ఐఏఎస్ శిక్షణతో సుపరిపాలనా సైన్యం

లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ - ముస్సోరి

జీవిత పయనంలో మేలిమి మెరుపు లతో పాటు కొన్ని చేదు మలుపులు కూడా ఉంటాయి. ఆ మలుపులను విజయానికి సోపానాలుగా మార్చుకున్న వారే ఉన్నత లక్ష్యాలను సాధించగలరు. ఇలా గెలుపు బాటలో పయనించి ఉన్నత కెరీర్ శిఖరాన్ని అందుకున్న వారిలో రాష్ట్రానికి చెందిన జె.మేఘనాథ్‌రెడ్డి ఒకరు.


చేపట్టిన వృత్తి.. వ్యక్తి వికాసానికే కాదు.. సామాజిక శ్రేయస్సుకూ ఉపయోగపడేదిగా ఉండాలన్న తపన, శ్రమించే తత్వం ఉన్నవారే సివిల్ సర్వీసెస్‌ను అందుకోగలరు. అలా ఐఏఎస్‌ను అందుకున్న మేఘనాథ్‌రెడ్డి ప్రస్తుతం ముస్సోరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్నారు. అక్కడి వివరాలను ‘భవిత’ పాఠకులతో పంచుకున్నారు..!

దేశంలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సర్వీస్.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్). దీన్ని భారత పరిపాలన వ్యవస్థకు ఉక్కు కవచంగా చెబుతుంటారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఐఏఎస్‌ల కృషి ప్రశంసనీయం. ఐఏఎస్ ఆఫీసర్‌గా అవకాశాన్ని చేజిక్కించుకోవాలని లక్షల మంది యువత కలలు కంటారు. ఆ కలల్ని నిజం చేసుకునే దిశగా ఏటా యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షను రాస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకసారి సర్వీస్‌కు ఎంపికైన తర్వాత శిక్షణ ఎలా ఉంటుందన్న విషయాలు చాలామందికి తెలీదు. వాస్తవానికి.. యువ ఐఏఎస్ ఆఫీసర్ల కెరీర్‌లో కీలకమైన, ఆసక్తికరమైనది శిక్షణ (Training) దశ.

అకాడమీ- విజన్
ప్రాథమిక శిక్షణ.. ఒక యువ ఐఏఎస్ అధికారిని సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారిగా తీర్చిదిద్దుతుంది. ఎంపికైన ఐఏఎస్ అధికారులకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలో ఉన్న ప్రఖ్యాత లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ)లో శిక్షణ ఇస్తారు. హిమాలయాల సొగసు చెంత, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన, అధునాతన మౌలిక వసతులున్న ఈ శిక్షణ కేంద్రం ప్రపంచంలోనే అత్యున్నత పరిపాలనా శిక్షణ కేంద్రాల సరసన నిలిచింది. ఇది 1959లో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌గా ఆవిర్భవించింది. తర్వాత 1972, అక్టోబర్‌లో అకాడమీకి దేశంలో గొప్ప రాజనీతి కోవిదుడైన లాల్ బహదూర్ శాస్త్రి పేరు పెట్టారు. నైతిక, పారదర్శక విధానాలతో సివిల్ సర్వీస్ అధికారులను సుశిక్షితులను చేసి, తద్వారా దేశంలో సుపరిపాలనను అందించడమే అకాడమీ అసలు లక్ష్యం.

శిక్షణ- దశలు:
అకాడమీ శిక్షణలో ఉన్న యువ అధికారులను ఆఫీసర్ ట్రైనీస్ (OT's)గా వ్యవహరిస్తారు. వీరికి ప్రాథమిక శిక్షణ వివిధ దశలుగా సాగుతుంది. ఇందులో మొదటి దశ 15 వారాల ఫౌండేషన్ కోర్సు. ఇది ఈ ఏడాది సెప్టెంబరు 2న ప్రారంభమైంది. ఈ కోర్సులోకి అడుగుపెట్టేటప్పుడు అందరూ ఒకరకమైన భావోద్వేగానికి గురయ్యాం. ప్రాంగణంలో జ్ఞాన్‌శిల, ధ్రువ్‌శిల, కర్మ్‌శిల పేర్లతో అకడమిక్ బిల్డింగ్‌లున్నాయి. హాస్టళ్లకు పవిత్ర నదులైన గంగా, కావేరి, నర్మద వంటి పేర్లు పెట్టారు. ప్రాంగణంలోని సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలు.. యువ అధికారుల భుజస్కందాలపై ఉన్న బాధ్యతల్ని రోజూ గుర్తుచేస్తుంటాయి. వారికి ప్రేరణగా నిలుస్తాయి. అకాడమీలోని పచ్చిక బయళ్ల నుంచి చూస్తే మంచు ముత్యాలను అలంకరించుకున్న హిమాలయ పర్వత శిఖరాలు కనువిందు చేస్తాయి. అకాడమీ పక్కనే ఉన్న ‘హ్యాపీ వ్యాలీ’లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, దానికి దగ్గర్లోని పోలో గ్రౌండ్ యువతకు మధురానుభూతుల్ని అందిస్తుంటాయి.

మూడు సర్వీసుల మేలు కలయిక:
ఫౌండేషన్ కోర్సులో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లకు ఎంపికైన వారందరూ కలసి శిక్షణ పొందుతారు. ఇలా ఈ ఏడాది మూడు సర్వీస్‌లకు ఎంపికైన దాదాపు 269 మంది 88వ ఫౌండేషన్ కోర్సులో కొనసాగుతున్నారు. వ్యక్తిగత, సామాజిక జీవితంలో స్నేహ పరిమళాల గొప్పదనం ఎంతో అవసరం. ఇలాంటి స్నేహశీలతను పెంపొందించుకునేందుకు వీలుగా భిన్న సర్వీస్‌లకు, రాష్ట్రాలకు చెందిన అధికారులను రూమ్మేట్‌్లగా ఉంచుతారు. ఫౌండేషన్ కోర్సు ద్వారా ఎలాంటి అడ్డంకినైనా తొలగించి, ముందుకెళ్లే సామర్థ్యం యువ అధికారులకు సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఉదయం 5 గంటలకు మొదలు
అకాడమీలో రోజువారీ జీవితం ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. అందమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న పోలో గ్రౌండ్‌లో గంట పాటు ఫిజికల్ ట్రైనింగ్ (పీటీ) ఉంటుంది. రన్నింగ్‌తో పాటు ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. అకడమిక్‌గా శిక్షణ ఇచ్చేందుకు యువ అధికారులను నాలుగు క్లాస్‌రూం సెక్షన్లుగా విభజించారు. క్లాస్‌రూం సెషన్స్ ఉదయం 9.30గంటలకు ప్రారంభమై 5.15 గంటల వరకు ఉంటాయి. తరగతుల్లో భారతదేశ చరిత్ర, స్వాతం త్య్ర ఉద్యమం, రాజ్యాంగం- రాజకీయ అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, ఎకనామిక్స్, లా వంటి వాటిని బోధిస్తారు. సివిల్ సర్వెంట్స్, వివిధ రంగాల్లో నిపుణులు ఫ్యాకల్టీగా ఉంటారు. ఇప్పటికే ఐఏఎస్‌గా పనిచేస్తున్న వారు ఫ్యాకల్టీగా ఉండటం వల్ల క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు అవకాశముంటుంది. లా వంటి అంశాలను స్పెషలిస్టు ప్రొఫెసర్లు బోధిస్తారు. స్నేహపూర్వక చర్చలకు అవకాశంతో పాటు పరస్పరం భావాలను పంచుకునేలా తరగతి గది వాతావరణం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టీ, లంచ్ బ్రేక్స్ యువ అధికారుల మధ్య వాడివేడి చర్చలకు వేదికలుగా నిలుస్తుంటాయి. హిందీ, కంప్యూటర్ స్కిల్స్‌ను మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక తరగతులుంటాయి. అకడమిక్ తరగతులకు భిన్నంగా వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు శిక్షణలోని అధికారులు తప్పనిసరిగా నిరాయుధ పోరాటం, వోకల్ మ్యూజి క్, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్, కుకింగ్, హార్స్ రైడింగ్ వంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఐఏఎస్ అకాడమీ.. హార్స్ రైడింగ్ వసతులకు పెట్టింది పేరు. రైడింగ్ శిక్షకులు ప్రఖ్యాత ప్రెసిడెన్షియల్ బాడీగార్డ్స్ బృందం నుంచి వస్తుంటారు.

మేధోమథనం:
శిక్షణలో మరో ముఖ్యమైన అంశం.. గెస్ట్ లెక్చర్స్. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. అకాడమీలోని ఆఫీసర్స్ ట్రైనీలను ఉద్దేశించి మాట్లాడారు. శిక్షణలో తరగతి బోధన సగ భాగమైతే.. మరో సగ భాగం ఇంటర్నల్ ఎన్నికలు, ట్రెక్కింగ్, ‘ఇండియా డే కల్చరల్ ప్రోగ్రామ్స్’, విలేజ్ విజిట్, అథ్లెటిక్ మీట్‌ల సమాహారంగా ఉంటుంది. అకాడమీలో మెస్ సొసైటీ, ఆఫీసర్స్ క్లబ్, కాంటెంపరరీ అఫైర్స్ సొసైటీ, ఫైన్ ఆర్ట్స్ క్లబ్, హాబీస్ క్లబ్ వంటివి ఉంటాయి. ఈ క్లబ్బులకు ఎన్నికలు ఫౌండేషన్ కోర్సు రెండో వారంలో జరుగుతాయి. ఎన్నికలకు ముందు అభ్యర్థుల ప్రచార పర్వంతో అకాడమీ సందడిసందడిగా ఉంటుంది.

ఇండియా డే.. సాంస్కృతిక వైభవం
ఏటా ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఒక రోజును ‘ఇండియా డే’గా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలు, యువ అధికారుల కేరింతలతో సరదాగా సాగుతుంది. ఆఫీసర్ ట్రైనీలను వారివారి సొంత రాష్ట్రాలను అనుసరించి North, South, East, West జోన్ల బృందాలుగా విభజిస్తారు. ఉదయం రాష్ట్రాల వారీగా సాంస్కృతిక ఊరేగింపు ఉంటుంది. తర్వా త ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో రాష్ట్రాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. సాయంత్రం సంపూర్ణానంద్ ఆడిటోరియంలో భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. తమ సాంస్కృతిక వైభవాన్ని, ప్రతిభను చాటుకునేందుకు ప్రతి రాష్ట్రానికీ పది నిమిషాలు కేటాయిస్తారు. ఈ ఏడాది వేడుకల్లో మన రాష్ట్రానికి చెందిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ ట్రైనీలు పాల్గొని, ఆంధ్ర రాష్ట్ర వైభవాన్ని చాటిచెప్పగలిగాం. మాలో కొందరు రాణి రుద్రమ దేవి, అల్లూరి సీతారామరాజు, వీరేశలింగం పంతులు, హరిదాసు వంటి రూపాలను ప్రదర్శించారు. మరికొందరు కోలాటం, బతుకమ్మతో సందడి చేశారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో అందరూ కలసి ఇచ్చిన కూచిపూడి (దశావతారం) ప్రదర్శన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ‘ఇండియా డే’ స్పెషల్ లంచ్‌లో అన్ని ప్రాంతాలకూ సంబంధించిన ప్రత్యేక వంటకాలు వడ్డించారు.

క్షేత్ర స్థాయి అనుభవం
ఫౌండేషన్ కోర్సులో క్షేత్రస్థాయి పర్యటనలు కీలకమైనవి. మొత్తం ఆఫీసర్ ట్రైనీలను ఐదుగురు సభ్యుల బృందాలుగా విభజించి గ్రామాలకు పంపుతారు. ఈ బృందాలు ఐదురోజుల పాటు ఆయా గ్రామాల్లో ఉండాలి. ఇటీవల మా విలేజ్ విజిట్‌ను ముగించుకొని అకాడమీకి తిరిగొచ్చాం. ఈ ప్రత్యక్ష పర్యటనలో భూమి లేకపోవడం, నిరుద్యోగం.. గ్రామాల్ని పట్టిపీడిస్తున్న రెండు పెద్ద సమస్యలుగా గుర్తించాం. సమ్మిళిత వృద్ధిని సాధించాలంటే ఈ సమస్యలకు పరిష్కారాలను చూపించాల్సి ఉంది.
  • ఫౌండేషన్ కోర్సు పూర్తికావడానికి ఇంకా నెల మాత్రమే ఉంది. ఈ నెల రోజుల వ్యవధిలో అథ్లెటిక్ మీట్, పరీక్షలు ఉంటాయి. నవంబర్ చివర్లో జరిగే పరీక్షలు చాలా ముఖ్యమైనవి. భవిష్యత్ కెరీర్‌కు సంబంధించి ఇందులో సాధించిన మార్కులకు ప్రాధాన్యం ఉంటుంది.
  • ఫౌండేషన్ కోర్సు చివరి వారంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శిక్షణ కాలంలో అకడమిక్‌గా ప్రతి భ కనబరిచిన వారికి అవార్డులు, రివార్డులు ఉంటాయి.
  • డిసెంబర్ 13: 15 వారాల ఫౌండేషన్ కోర్సు సుదీర్ఘ ప్రయాణం పూర్తికానున్న రోజు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఐఏఎస్ ట్రైనీలకు ముస్సోరిలోనే ప్రొఫెషనల్ శిక్షణ ఉంటుంది. ఐపీఎస్‌లు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్‌పీఏ) కి వెళ్తారు. ఐఎఫ్‌ఎస్‌లు న్యూఢిల్లీలోని ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తారు.
భారత్ దర్శన్
ఫౌండేషన్ కోర్సు పూర్తయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీలు 45 రోజుల ‘భారత్ దర్శన్’ పర్యటనకు వెళ్తారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ.. దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల ప్రత్యక్ష పరిశీలనకు అవకాశముంటుంది.
  • భారత్ దర్శన్ తర్వాత ఫేజ్- 1 క్లాస్‌రూం ట్రైనింగ్, ఏడాది పాటు జిల్లాలో శిక్షణ ఉంటుంది. భవిష్యత్తులో సమర్థవంతమైన జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఇది పూర్తయ్యాక 2015లో స్వల్పస్థాయి ఫేజ్- 2 క్లాస్‌రూం ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలోనే విదేశీ పర్యటన ఉంటుంది. తర్వాత ట్రైనీ ఐఏఎస్‌లు పూర్తిస్థాయి ఐఏఎస్‌లుగా సవాళ్లతో కూడిన భారత పరిపాలనలోకి అడుగుపెడతారు. ఓ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడతారు!!
నీతి, నిజాయితీ, ఆత్మవిశ్వాసం పునాదులపై కొండంత ప్రజాభిమాన మహా సౌధాన్ని నిర్మించుకున్న లాల్ బహదూర్ శాస్త్రి ఆదర్శప్రాయులు. నీతి పూర్వక నడత, నిరాడంబరత, త్యాగశీలతలతో భారత రాజకీయాలకు మార్గదర్శకుడిగా నిలిచిన శాస్త్రి పేరుతో ఉన్న ముస్సోరిలోని ‘అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ సుశిక్షితులైన సుపరిపాలనా సైన్యాన్ని దేశానికి అందిస్తోంది...

ట్రెక్కింగ్
ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇచ్చే శిక్షణలో మౌంటైన్ ట్రెక్కింగ్ యువ అధికారులకు మరపురాని అనుభూతులను మూటగట్టి ఇస్తుంది. అందరూ తప్పనిసరిగా ట్రెక్కింగ్‌లో పాల్గొనాలి. మొత్తం ఆఫీసర్ ట్రైనీలను 25 మంది సభ్యుల బృందాలుగా విభజిస్తారు. వీరికి వేర్వేరు ట్రెక్ మార్గాలను కేటాయిస్తారు. ఈ బృందాలు ట్రెక్కింగ్ చేస్తూ ఐదు రోజుల్లో 100-120 కి.మీ. దూరాన్ని చేరుకుంటారు. అన్ని ట్రెక్కింగ్ మార్గాలూ కనీసం 4 వేల మీటర్ల ఎత్తు వరకూ ఉంటాయి. దట్టమైన అడవుల గుండా నడుస్తూ, ఎత్తై శిఖరాలను ఎక్కుతూ బృందాలు ముందుకు సాగుతుంటాయి. వణికించే చలిలో కరెంటు, మొబైల్ సిగ్నల్స్ లేని ప్రాంతంలో టెంట్లలో బస చేయడం ఒక గొప్ప అనుభవం. బృందాలుగా ట్రెక్కింగ్ చేయడం ద్వారా బృంద స్ఫూర్తి, స్నేహశీలత, సర్దుకుపోవడం, ప్రకృతి పట్ల ప్రేమ అలవడతాయి.





















#Tags