ఏపీలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. పరీక్షలపై బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫిబ్రవరి 23న అన్ని జిల్లాల ఆర్‌ఐవోలు, ఇతర అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. థియరీ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 1423 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28న ఫస్టియర్, మార్చి 1న సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. గతేడాది రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులు 10.31 లక్షల మంది హాజరుకాగా ఈ ఏడాది ఈ సంఖ్య స్వల్పంగా పెరగనుంది. గతేడాది 124 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించగా ఈసారి కూడా అంతే సంఖ్యలో ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు చైర్మన్లుగా హైపవర్ కమిటీలను, కాపీయింగ్‌కు తావు లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. హాల్‌టిక్కెట్లను ఫిబ్రవరి 26 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టిక్కెట్లపై ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లతో విద్యార్థులు సంతకాలు చేయించుకోవాలి. వాటిపై తమ పేరు, మాధ్యమం, సబ్జెక్ట్, తదితర వివరాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. తప్పులుంటే సంబంధిత ప్రిన్సిపాళ్ల ద్వారా సరిచేయించుకోవాలి. ప్రిన్సిపాళ్ల సంతకంతో కూడిన హాల్‌టిక్కెట్లను మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.

ఫస్టియర్‌కు గ్రేడింగ్ విధానం..
ఇంటర్‌లో ఇప్పటివరకు అమల్లో ఉన్న మార్కుల విధానానికి స్వస్తి పలికి గ్రేడింగ్ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. విద్యార్థులు ఒత్తిళ్లకు లోనవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నందున మార్కుల విధానం స్థానంలో గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెడుతున్నారు.

ఏయే మార్కులకు ఏయే గ్రేడులు...

మార్కుల రేంజ్

గ్రేడ్

గ్రేడ్ పాయింట్లు

91-100

ఏ1

10.0

81-90

ఏ2

9.0

71-80

బీ1

8.0

61-70

బీ2

7.0

51-60

సీ1

6.0

41-50

సీ2

5.0

35-40

డీ1

4.0

00-34

ఫెయిల్

ఫెయిల్

  • ఈ గ్రేడింగ్ విధానంలో దివ్యాంగులకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. పరీక్ష ఫలితాలను గ్రేడ్‌లు, గ్రేడ్ పాయింట్లలోనే ప్రకటిస్తారు. మార్కులను ప్రకటించరు.




#Tags