Inspirational Story: 10వ తరగతి నాలుగుసార్లు ఫెయిల్‌... అయితేనేం గ్రూప్స్‌ సాధించాడు

అకడమిక్‌ పరీక్షల్లో సత్తాచాటిన వారు సైతం కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌లో చేతులెత్తేస్తుంటారు. ఎంత కష్టపడిచదివినా టార్గెట్‌ రీచ్‌ కాలేక నిరాశ, నిస్పృహతో బాధపడుతుంటారు. అలాంటిది పదో తరగతిలో నాలుగు సార్లు ఫెయిల్‌ అయిన విద్యార్ధి... గ్రూప్స్‌ సాధించారు. కష్టపడి చదివితే విజయం ఎంత కష్టమైన మన సొంతమవుతుందని అంటున్నారు నాగస్వరం నరసింహులు.

నిరు పేద కుటుంబంలో జన్మించి....
సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన నాగస్వారం నరసింహులు నిరుపేద కుటుంబంలో జన్మించారు. మొదట ఎస్‌ఐ ఉద్యోగం సాధించి అంచలంచెలుగా ఎదుగుతూ రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారిగా, రాష్ట్ర ఇన్‌కంట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం తనలా ఎవరూ ఇబ్బందులు ఎదుర్కొటూ చదువులు సాగించొద్దనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. 
విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే...
ఒకటవ తరగతి నుంచి ఎంఏ పీహెచ్‌డీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలల్లోనే నరసింహులు చదువుకున్నారు. 1983లో సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం సాధించారు. ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్‌–2 అధికారిగా ఎంపికయ్యారు. అనంతరం 1996లో గ్రూప్‌–1 ఉద్యోగం సాధించారు. 2005 నుంచి 2016 వరకు రాష్ట్ర ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌గా, రీజనల్‌ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా కడపలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు.
పదవ తరగతిలో నాలుగుసార్లు ఫెయిల్‌....
తల్లిదండ్రులు తడికెలు, గంపలు అల్లేవారు. వారికి తోడుగా నరసింహులు పని చేస్తూ ఇంటి వద్దనే గడిపేవారు. ఈ క్రమంలో చదువుపై ఆసక్తి తగ్గింది. దీంతో పదవ తరగతి నాలుగుసార్లు ఫెయిల్‌ అయ్యారు. తర్వాత తల్లిదండ్రుల సూచన మేరకు పట్టుబట్టి పదవ తరగతి పాస్‌ అయ్యారు. అనంతరం ఎస్‌ఐ, గ్రూప్‌–2, గ్రూప్‌–1 స్థానానికి ఎదిగారు. చదువుకుంటున్న సమయంలోనే కళాశాల నుంచి జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ ఆటగాడిగా గుర్తింపు పొందారు. 2014–2016వ సంవత్సరంలో ఇండియా బాస్కెట్‌బాల్‌ టీంకు మేనేజర్‌గా వ్యవహరించారు. థాయిల్యాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, జపాన్‌  వంటి దేశాలకు ఇండియా టీం మేనేజర్‌గా వెళ్లారు.
సేవతోనే ఆత్మసంతప్తి...
ప్రభుత్వ పాఠశాలకు, పేద విద్యార్థులకు సేవ చేస్తుండడం వల్ల ఆత్మసంతప్తి కలుగుతుందని నరసింహులు చెబుతారు. తాము చదువుకున్న సమయంలో పాఠశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డామని, అలాంటి ఇబ్బందులు నేటి విద్యార్థులు ఎదుర్కోకూడదనే లక్ష్యంతో పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 90పాఠశాలల్లో నీటి బోర్లు వేయించి నీటి సమస్యను తీర్చామన్నారు.