TGPSC Group 1 Mains: గ్రూప్‌–1 మెయిన్స్‌కు 72.4 శాతం హాజరు.. ఉత్కంఠకు తెర

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వరుసగా వారం పాటు జరిగే ఈ పరీక్షల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫయింగ్‌ టెస్ట్‌) పరీక్ష జరిగింది. అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లోని 46 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 1.30 గంటలకు కేంద్రాలను మూసివేశారు. ఆలస్యంగా వచ్చినవారిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు.

ఒకచోట నిమిషం ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థిని లోపలికి అనుమతించకపోవడంతో.. ఆ అభ్యర్థి ప్రహరీగోడ దూకివెళ్లాడు. కానీ పోలీసులు వెంబడించి పట్టుకుని.. బయటికి పంపించేశారు.

22,744 మంది హాజరు

మొత్తం 563 గ్రూప్‌–1 పోస్టులకు సంబంధించి మెయిన్స్‌ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా.. సోమవారం జరిగిన జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్షకు 22,744 మంది, అంటే 72.4 శాతం మంది హాజరయ్యారు. సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతోపాటు ఇతర కారణాలతో చాలా మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి.

చదవండి: TGPSC Group 1 Mains Exams: గ్రూప్‌–1 మెయిన్స్‌.. అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మూఖ్యంగా హాల్‌టికెట్..

ఇక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం గట్టి ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రం చుట్టూరా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు.. పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితిని, నిర్వహణ తీరును పర్యవేక్షించారు.

ఉత్కంఠకు తెర

గ్రూప్‌–1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలనే డిమాండ్‌తో అభ్యర్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు తెలుగు అకాడమీ పుస్తకాలు అధికారికం కావని ప్రభుత్వం పేర్కొనడం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, పలు ఇతర అంశాలపైనా ఆందోళన వ్యక్తమైంది. అభ్యర్థులకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు మద్దతుగా నిలవడంతోపాటు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.

మరోవైపు అభ్యర్థులు న్యాయ పోరాటానికి సైతం దిగారు. వారి పిటిషన్లను హైకోర్టు తిరస్కరించగా.. సోమవారం సుప్రీంకోర్టులో జరిగే విచారణపై ఆశలు పెట్టుకున్నారు. కానీ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో.. ఉత్కంఠకు తెరపడింది.

మధ్యస్తంగా జనరల్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రం

మెయిన్స్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి పరీక్ష.. జనరల్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఇస్తున్నట్టు టీజీపీఎస్సీ పేర్కొన్నా.. కొన్ని ప్రశ్నలు సులభంగా అనిపించినా, అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని పేర్కొన్నారు.

క్వాలిఫయింగ్‌ పరీక్ష అయిన ఈ పేపర్‌ చాలా మంది అభ్యర్థులు అర్హత సాధించే విధంగానే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల్లో జనరల్‌ ఇంగ్లిష్‌ కీలకమైనది. అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధిస్తేనే.. తదుపరి పరీక్షలకు సంబంధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

గ్రూప్‌–1 మెయిన్స్‌కు హాజరవుతున్న అభ్యర్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పరీక్షలకు హాజరవుతున్న వారందరికీ శుభాకాంక్షలు అంటూ సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని.. విజయం సాధించి, తెలంగాణ పునర్ని ర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అందులో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మెయిన్స్‌ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు గ్రూప్‌–1 ఆఫీసర్లుగా ఎంపికై ప్రజాప్రభుత్వంలో, ప్రగతి తెలంగాణలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తుగడల్లో నిరుద్యోగులు చిక్కకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

#Tags