Dommaraju Gukesh: చదరంగానికి మన దేశం నుంచి వచ్చిన తెలుగు కుటుంబానికి చెందిన చిచ్చరపిడుగు ఇత‌నే!!

భారత చదరంగ క్రీడావనికి ఇది మరో శుభవార్త.

మన దేశం నుంచి మరో చిచ్చరపిడుగు వచ్చాడు. తెలుగు కుటుంబానికి చెందిన దొమ్మరాజు గుకేశ్‌ పట్టుమని 17 ఏళ్ళ వయసులో ప్రపంచస్థాయిలో సత్తా చాటాడు. అరంగేట్రంలోనే ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) వారి ‘క్యాండిడేట్స్‌ 2024’లో గెలిచాడు. అదీ... చదరంగపుటెత్తుల్లో చలాకీతనం చూపుతూ, చులాగ్గా గెలిచాడు. కొద్ది నెలల్లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌ పోటీలకు ఎన్నికయ్యాడు. 138 సంవత్సరాల ప్రపంచ ఛాంపి యన్‌షిప్‌ చరిత్రలోనే చిన్న వయసువాడిగా వరల్డ్‌ టైటిల్‌ కోసం పోటీపడనున్నాడు. ఒకవేళ ఆ విశ్వవేదిక పైనా గెలిస్తే, అతి పిన్నవయస్కుడైన వరల్డ్‌ ఛాంపియన్‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు.  

ఒక్క గుకేశ్‌ విజయమే కాక భవిష్యత్‌ ఆశాకిరణాలూ అనేకం ఉండడం గమనార్హం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు పాల్గొనే ‘క్యాండిడేట్స్‌’లో ఉన్నదే 16 మంది. అందులో ముగ్గురు మగ వాళ్ళు (గుకేశ్, విదిత్, ఆర్‌. ప్రజ్ఞానంద), ఇద్దరు ఆడవారు (కోనేరు హంపీ, ఆర్‌. వైశాలి)తో మొత్తం అయిదుగురి అతి పెద్ద బృందం భారత్‌దే. ఇంతమంది ఆటగాళ్ళు ఈ క్లిష్టమైన అలాగే, 2024 ఏప్రిల్‌ నాటి ‘ఫిడే’ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 25లో అయిదుగురు భారతీయ పురుషులే. 
ఇక, మహిళల ర్యాకింగ్స్‌లో టాప్‌ 15లో ముగ్గురు మనవాళ్ళే. జూనియర్‌ ర్యాకింగ్స్‌కు వస్తే టాప్‌ 20లో ఏడుగురు భార తీయులే. అదే టాప్‌ 30 జూనియర్స్‌ని గనక లెక్క తీస్తే మూడింట ఒక వంతు మన దేశీయులే.ప్రపంచ చదరంగ వేదికపై అంతకంతకూ విస్తరిస్తున్న భారతదేశ స్థాయికీ, స్థానానికీ ఇదే సాక్ష్యం.

‘చదరంగంలో భారత్‌ విశేష కృషి చేస్తోంది. అనతికాలంలో ప్రపంచంలో అగ్రశ్రేణి చదరంగ దేశమవుతుంది’ అని ప్రపంచ మాజీ ఛాంపియన్‌ మ్యాగ్నస్‌ కార్ల్‌సెన్‌ గత ఏడాది వ్యాఖ్యానించారు. ఇప్పుడదే నిజమవుతోంది. నిజానికి, మన దేశంలో చదరంగ క్రీడ ఇంత శరవేగంతో విస్తరించడానికీ, విస్ఫోటనం చెందడానికీ అనేక కారణాలున్నాయి. ఇంటర్నెట్‌ డేటా ప్యాక్‌లు చౌక కావడం, మొబైల్‌ ఫోన్లలో సైతం సులభంగా అందుబాటులో ఉన్న చెస్‌ యాప్‌లు వగైరా వల్ల జనసామాన్యంలో ఈ క్రీడ వేగంగా, బలమైన పునాది వేసుకుంటోందని నిపుణుల విశ్లేషణ. 
ఇంటర్నెట్‌ వ్యాప్తి వల్ల ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని పిల్లలు సైతం మెట్రో నగరాల్లోని అత్యుత్తమ కోచ్‌ల నుంచి ఆన్‌ లైన్‌ చెస్‌ పాఠాలు నేర్చే వీలొచ్చింది. కరోనా అనంతరం ఆన్‌లైన్‌ టోర్నమెంట్‌లు పెరగడం కూడా భారతీయ యువకిశోరాలకు కలిసొచ్చింది. సూపర్‌ గ్రాండ్‌ మాస్టర్ల తోనూ, చివరకు ప్రపంచ మాజీ ఛాంపియన్లతోనూ తలపడి అనుభవం, ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించే అవకాశం దక్కింది. 

Gukesh: చరిత్ర సృష్టించిన గుకేశ్‌.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..  

అగ్రశ్రేణి క్రీడాకారులు ఆట మానేశాక, కోచ్‌లుగా మారడమూ కొత్త తరానికి వరమైంది.గ్రాండ్‌ మాస్టర్లు ఆర్బీ రమేశ్‌ (ప్రజ్ఞానంద, వైశాలికి కోచ్‌), విష్ణుప్రసన్న (గుకేశ్‌కు కోచ్‌), శ్రీనాథ్‌ నారాయణన్‌ (అర్జున్, నిహాల్‌ సరీన్‌ల ట్రైనర్‌), సూర్యశేఖర్‌ గంగూలీ (విదిత్‌కు కోచ్‌) లాంటి వారు, వారి శిక్షణలో ఆరితేరిన ఆటగాళ్ళే అందుకు నిదర్శనం. గ్రాండ్‌ మాస్టర్లు కాకపోయినప్పటికీ, మంచి చదరంగం ఆటగాళ్ళు దాదాపు 50 వేల మందికి పైగా భారత్‌లో ఉన్నారని సాక్షాత్తూ ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) డైరెక్టర్‌ జనరల్‌ ఎమిల్‌ సుతోవ్‌స్కీ అనడం విశేషం. 
ఇవన్నీ కలసి దేశంలో చదరంగ క్రీడకు సంబంధించిన సువ్యవస్థిత వాతావరణ కల్పనకు దోహదం చేశాయి. ‘ఫిడే’ సహకారంతో టెక్‌ మహీంద్రా ధనసాయంతో నడుస్తున్న గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ లాంటి టోర్నమెంట్లు సైతం ఆటకూ, ఆటగాళ్ళకూ కొత్త ఉత్సాహం, ఉత్తేజం తెచ్చాయి. వీటన్నిటి ఫలితంగా ఇవాళ 64 చదరపు గడుల ఆటలో భారత్‌ అపూర్వంగా ముందుకు దూసుకుపోతోంది. 

‘ఈ ప్రపంచంలో ఈ క్షణంలో అత్యంత అస్థిరమైనది ఏమిటంటే, చదరంగంలో భారత నంబర్‌ 1 స్థానం’ అని అజర్‌బైజాన్‌కు చెందిన ఓ గ్రాండ్‌ మాస్టర్‌ ఈ ఏడాది జనవరిలో ట్వీట్‌ చేశారు. ఛలోక్తిగా చెప్పినా, చెస్‌లో నిత్యం కొత్త ప్రతిభావంతులు రంగంలోకి దూసుకువస్తున్న మన దేశంలో ఇప్పుడది అక్షరసత్యం. ఈ ఏడాదిలో ఈ నాలుగు నెలల్లోనే ఆ నంబర్‌1 కిరీటం మన ఆటగాళ్ళు అయిదుగురి (విశ్వనాథన్‌ ఆనంద్, గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్, విదిత్‌) మధ్య ఎప్పటికప్పుడు మారుతూ వచ్చిందంటే మనవాళ్ళలో పెల్లుబుకుతున్న ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. 

Asunta Lakra Award: దీపికా సోరెంగ్‌కు అసుంత లక్రా అవార్డు

యువజన – క్రీడాశాఖ సమకూరుస్తున్న నిధులు, ఆటగాళ్ళ శిక్షణకు అఖిల భారత చదరంగ సమాఖ్య అందిస్తున్న సహకారం, ప్రైవేట్‌ సంస్థల సహాయం ప్రతిభను పెంచి పోషించడంలో ప్రధానపాత్ర వహించాయి. ఇవాళ దేశంలో 84 మంది గ్రాండ్‌ మాస్టర్లు, 124 మంది ఇంటర్నేషనల్‌ మాస్టర్లు, 23 మంది మహిళా గ్రాండ్‌ మాస్టర్లు, 42 మంది మహిళా ఇంటర్నేషనల్‌ మాస్టర్లు ఉన్నారంటే కారణం అదే! 

దేశవ్యాప్తంగా 30 వేల మందికి పైగా రేటింగ్‌ పొందిన రెగ్యులర్‌ టోర్నమెంట్‌ చెస్‌ ఆటగాళ్ళు న్నారని ఒక లెక్క. ప్రపంచమంతటిలో ఇందరు ప్రతిభావంతులున్నది మన దేశంలోనే! ప్రపంచ మాజీ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ లాంటివారు చిరకాలంగా ఆదర్శంగా నిలవడంతో, ఎంతో మంది చెస్‌ వైపు ఆకర్షితులయ్యారన్నది నిజం. సమాజంలోని ఆ ధోరణుల్ని గమనించి, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో తగినంత సహాయ సహకారాలు అందించి, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే ఏ క్రీడలోనైనా ఎంతటి అద్భుతాలు చేయవచ్చో భారతీయ చదరంగావని చాటిచెబుతోంది. 
కఠోర పరిశ్రమతో, కాలగతిలో ఆ ఆటలో ఛాంపియన్‌ దేశంగా ఆవిర్భవించిన మనం ఈ పాఠాలను ఇతర క్రీడలకూ అనువర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమూ, ఇతర క్రీడా సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తే మన క్రీడాలోకం మరిన్ని శుభవార్తలు అందించడానికి సదా సిద్ధంగా ఉంటుంది! 

Wrestler Sakshi: ‘టైమ్‌’ టాప్‌–100 జాబితాలో రెజ్లర్‌ సాక్షి మలిక్‌

#Tags