Godavari Basin: గోదావరి పరీవాహకం.. ప్రకృతి విపత్తుల అడ్డా

తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు నిలయంగా మారుతున్నాయి.

కొన్నేళ్ల నుంచి జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ఏటా ఏదో ఒక విపత్తు ఎదురవుతోంది. ముఖ్యంగా ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా అతి భారీ వర్షాలు, వరదలు, పెనుగాలులు టోర్నడోలు, ఇప్పుడు భూకంపం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

అతి భారీ వర్షాలతో..
2022 జూలై 14 నుంచి 16 వరకు ఈ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. ఏ క్షణమైనా కరకట్ట కొట్టుకుపోయి భద్రాచలం మునిగిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. 2023 జూలై 27న భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురిసింది. 

ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా ఒక్కరోజే 64.9 సెంటీమీటర్ల వాన పడింది. అందులో కేవలం మూడు గంటల్లోనే 46.4 సెంటీమీటర్ల అతి భారీ వాన పడింది. అదేరోజు జయశంకర్‌ జిల్లా చిట్యాలలో 61.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి గ్రామాలు నీట మునిగి పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. 

ఈ ఏడాది ఆగస్టు 31న నర్సంపేట, పాలకుర్తి, మహబూబాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షం పడి మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులకు కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఖమ్మం పట్టణం, పరిసర గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి.

Migratory Birds: తెలంగాణ‌లో విదేశీ వలస పక్షుల కిలకిలావారాలు

లక్ష చెట్లను కూల్చేసిన పెనుగాలులు
ఈ ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్‌ ఒకటో తేదీల మధ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తీవ్ర పెను సుడిగాలులు వీచాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో ఏకంగా 334 హెక్టార్ల పరిధిలో లక్ష వరకు చెట్లు కూలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వాయు విధ్వంసానికి కారణాలను ఇప్పటికీ స్పష్టంగా తేల్చలేదు. 

ఇక్కడే భూకంప కేంద్రాలు
రాష్ట్రంలోని సిర్పూర్, జైనూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, వరంగల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలు భూకంప సీస్మిక్‌ జోన్‌–3 పరిధిలో ఉన్నాయి. బొగ్గు గనులు విస్తృతంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తరచూ భూమి నుంచి భారీ శబ్దాలు రావడం సాధారణంగా మారిపోయింది. 

ఇదే ప్రాంతంలోని భద్రాచలంలో 1969లో 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పుడు 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో మణుగూరులో స్వల్ప స్థాయిలో మూడు సార్లు ప్రకంపనలు వచ్చాయి కూడా. భారీగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు తవ్వకాలు, గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు వంటివి విపత్తులకు దారితీస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.

Maoists: పీఎల్‌జీఏ 24వ వారోత్సవం.. గెరిల్లా వార్‌ నుంచి పీపుల్స్‌ ఆర్మీ దిశగా..

వేడి నీటిబుగ్గలకూ కేంద్రం
ములుగు జిల్లాలోని రామన్నగూడెం ప్రాంతంలో వేడి నీటిబుగ్గలు ఉన్నాయి. 1954లో ఇక్కడ చమురు నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరిపి వదిలేసిన బోరులోనుంచి ఇప్పటికీ వేడి నీళ్లు వెలువడుతూ ఉన్నాయి. భూమి పొరల్లో పగుళ్ల వల్ల నీళ్లు మరింత లోతుకు వెళ్లి.. అక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడై పైకి ఉబికివస్తాయని నిపుణులు చెబుతున్నారు. మానవ తప్పిదాలపై ప్రకృతి హెచ్చరికలివి!

మానవ తప్పిదాలపై ప్రకృతి చేసిన హెచ్చరికలను మనం పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం తాడ్వాయి అడవుల్లో టోర్నడోల తీవ్రత కారణంగా లక్ష చెట్లు నేలకొరిగినప్పుడే భూకంపాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ ఘటన జరిగాక కారణాలేమిటన్న దానిపై ప్రభుత్వం, వర్సిటీలు, ఎన్‌జీఆర్‌ వంటి సంస్థలు ఎలాంటి పరిశోధనలు చేయలేదు. మనం గోదావరి బెల్ట్‌ను నాశనం చేశాం. 

ప్రాజెక్టుల కోసం అడవులు నరికేశాం. భూమి లోపల పొరలు ఎలా ఉన్నాయి? డ్యామ్‌ల వల్ల వాటికి ఏ మేరకు నష్టం అన్నది సాంకేతికంగా పరిశీలించలేదు. అది భూకంపాలకు కారణమవుతోంది. – పాకనాటి దామోదర్‌రెడ్డి, పర్యావరణవేత్త

Kommu Koya Dance: కొండకోనల్లో నృత్య సౌందర్యం.. దేశం నలుమూలలా ప్రత్యేకత చాటుతున్న కోయజాతి కళాకారులు!

#Tags