Disha App : ‘దిశ’ యాప్‌ గురించిన సమగ్ర సమాచారం మీకోసం...

ఆపదలో చిక్కుకున్న మహిళలు సహాయం కోరిన వెంటనే అక్కడకు పోలీసులు చేరుకుని రక్షణ కల్పించే వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆవిష్కరించింది. అదే ‘దిశ’ మొబైల్‌ యాప్‌.
Disha App

మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం ప్రకారం పోలీసు శాఖ ‘దిశ’ యాప్‌ను రూపొందించింది. ఎన్నో వినూత్నమైన ఫీచర్లతో రూపొందించిన ఈ యాప్‌ ఆధునిక సాంకేతిక వ్యవస్థతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొందింది. కిందటేడాది ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘దిశ’యాప్‌ను ఆవిష్కరించారు. కరోనా ప్రభావం తగ్గాక ఈ ఏడాది జూన్‌ 29న విజయవాడలో ‘దిశ’ యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యాప్‌ ఆవశ్యకతను వివరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

బ్లాక్‌ మెయిలర్‌ ఆటకట్టు...


వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రసన్నకుమార్‌ అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన ఓ వివాహితను అసభ్యంగా వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. బాధితురాలి నుంచి నగలు దోపిడీ చేయడంతో పాటు ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలను బహిర్గతం చేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలు తన మొబైల్‌ ఫోన్లోని దిశ యాప్‌లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఆమె వద్దకు చేరుకున్నారు. నిందితుడి ఫోన్‌ను ట్రాక్‌ చేసి హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ మరో యువతిని బెదిరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. బీటెక్‌ చదువుతూ మధ్యలో నిలిపివేసిన నిందితుడు గతంలో పలు మోసాలు, దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతడి ఫోన్‌లోని వీడియోలు, కాల్‌డేటాను తనిఖీ చేయగా దాదాపు 200 మంది మహిళలు, 100 మంది యువతులను బెదిరించి డబ్బులు లాగినట్టు వెలుగులోకి వచ్చింది. పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితురాలు ‘దిశ’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో నిందితుడు చిక్కాడు.

ఆత్మహత్య నివారణ..
విజయవాడలోని ఓ మహిళను ఒకరు మాయమాటలతో మోసం చేశారు. దాంతో ఆమె విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడబోయింది. ఆమె తన మొబైల్‌ ఫోన్‌లో దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కింది. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఫోన్‌ చేసి ఆమెకు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. జీవితంలో మోసపోయినందున తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మూడేళ్ల కుమార్తెను ఆదుకోవాలని దిశ యాప్‌ ద్వారా కోరింది. దాంతో పోలీసులు కేవలం 3 నిముషాల్లోనే ఆ ఇంటికి చేరుకుని ఆమెను ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఆమెను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 

గృహహింసకు చెక్‌..
విజయవాడ మధురానగర్‌లో ఓ మహిళను ఆమె భర్త దాడి చేసి గాయపరిచాడు. ఆమె దిశ యాప్‌ ద్వారా పోలీసులను సంప్రదించగా కేవలం 5 నిమిషాల్లోనే పోలీసులు ఆ ఇంటికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు రక్షణ..
వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఓ యువతి  పరీక్ష రాసేందుకు ఢిల్లీ వెళ్లారు. రైల్లో ఆమెకు పరిచయమైన ఓ దంపతులతో తాను ఢిల్లీలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లాల్సి ఉందని ఆమె చెప్పారు. ఢిల్లీ చేరుకున్న తరువాత ఆ దంపతులు ఆమెను ఓ ఆటో ఎక్కించారు. ఆటో బయల్దేరాక ఆమె తన స్నేహితురాలికి ఫోన్‌ చేసి, ఆటో డ్రైవర్‌కు అడ్రస్‌ చెప్పమని ఫోన్‌ ఇచ్చారు. కానీ ఆ ఆటో డ్రైవర్‌ ఆటువైపు మాట్లాడుతోంది ఆమెను ఆటో ఎక్కించిన దంపతులని భావించి, హిందీలో ఏదో మాట్లాడుతుండటంతో ఆమె స్నేహితురాలికి అసలు విషయం తెలిసి, వెంటనే తన స్నేహితురాలిని ఆటో దిగిపోవాలని చెప్పింది. ఆమె ఆటో ఆపాలని కోరినా అతను ఆపలేదు. దాంతో వేగంగా వెళ్తున్న ఆటో నుంచి కిందకు దూకేసి, తన మొబైల్‌ ఫోన్లో దిశ యాప్‌ను నొక్కడంతో కడప పోలీసులు వెంటనే స్పందించి, ఢిల్లీలోని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఆమెకు అక్కడ ఆశ్రయం కల్పించారు. ఆ మర్నాడు ఆమెను పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లి, పరీక్ష రాశాక ఆమెను సురక్షితంగా ఢిల్లీలో రైలు ఎక్కించారు. ఆమె తిరిగి తన ఇంటికి సురక్షితంగా చేరుకునేవరకు పోలీసులు ఆమెతో ఫోన్లో టచ్‌లోనే ఉన్నారు. 

ఆన్‌లైన్‌ మోసగాడి నుంచి భద్రత..
విశాఖ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తరువాత వేధించడంతో దూరం పెట్టింది. నిందితుడు తాము తీసుకున్న ఫోటోలను అందరికీ చూపిస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఇంటికి చేరుకుని తలుపులు బాదుతూ వేధించడంతో మధ్యాహ్నం 2.46 గంటలకు దిశ యాప్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. 2.47 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. 2.55 గంటలకు పోలీసులు అక్కడకు చేరుకుని యువతికి ధైర్యం చెప్పి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బాల్యవివాహానికి అడ్డుకట్ట...
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో ఓ మైనర్‌ బాలికకు ఆమె తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారు. ఆ విద్యార్థిని పెళ్లి వద్దని ఎంత గొడవ చేసినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. విషయం తెలిసి పొరుగింటిలో ఉండే ఓ మహిళ తన మొబైల్‌ ఫోన్‌లో దిశ యాప్‌ ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కింది. వెంటనే స్పందించిన పోలీసులు కేవలం కొద్ది నిముషాల్లోనే అక్కడకు  చేరుకుని ఆ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఆ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేశారు. 

సందేశం ఇచ్చిన క్షణాల్లో రక్షణ..


దిశ యాప్‌ తమ మొబైల్‌ ఫోన్లో ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా భద్రత ఉన్నట్టే. తాము ఆపదలో ఉన్నామన్న సందేశం ఇస్తే చాలు... క్షణాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని రక్షణ కల్పిస్తారు. ఆకతాయిల అల్లరి, ఆగంతకులు వేధింపులు, బ్లాక్‌ మెయిల్, అసభ్య ఫోటోలు, వీడియోలతో బెదిరింపులు, దాడులు, గృహహింస.. ఇలా అన్ని రకాల వేధింపులను అడ్డుకుంటూ మహిళా భద్రతకు దిశ యాప్‌ భరోసానిస్తోంది. గతంలో మహిళలపై వేధింపుల కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరిగేది. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి బాధితులు సందేహించేవారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా పోలీసులు తక్షణం స్పందిస్తారన్న నమ్మకం ఉండేది కాదు. వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతాయని జంకేవారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతూ దిశ యాప్‌ మహిళలకు రక్షణ కల్పిస్తోంది. ఆపద ఎదురైతే ఆ యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కినా, గట్టిగా అటూ ఇటూ ఊపినా చాలు కొద్ది నిమిషాల్లోనే పోలీసుల ద్వారా రక్షణ లభిస్తోంది. 

రోజూ ఐదు వేల కాల్స్‌..
గతంలో ఎవరైనా సమస్య ఎదురైతే 100 నంబర్‌కు కాల్‌ చేసేవారు. ఎన్నో ఏళ్లుగా డయల్‌ 100 కల్పించిన నమ్మకాన్ని దిశ యాప్‌ అతి తక్కువ వ్యవధిలో సాధిస్తోంది. దిశ యాప్‌ ద్వారా రోజుకు దాదాపు 5వేల కాల్స్‌ వస్తున్నాయి. వీటిలో దాదాపు 60 కాల్స్‌ తగిన చర్యలు తీసుకునేవిగా ఉంటున్నాయి. రోజుకు సగటున 8 వరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. 

85 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్‌..


‘దిశ’ యాప్‌ పట్ల మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అతి తక్కువ కాలంలోనే 85 లక్షల మందికి పైగా ‘దిశ’యాప్‌ను డౌన్‌లోడ్‌  చేసుకోవడాన్ని చూస్తే ఈ యాప్‌ పట్ల మహిళల్లో ఎంతటి నమ్మకం ఉందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్దేశించినట్లుగా కోటి డౌన్‌లోడ్లు లక్ష్య సాధన దిశగా ‘దిశ’ దూసుకుపోతోంది.  

తక్షణ రక్షణ...
దిశ యాప్‌ ద్వారా ఇప్పటివరకు 3,98,878 ఎస్‌వోఎస్‌ కాల్స్‌ వచ్చాయి. వాటిలో చర్యలు తీసుకోదగ్గ కాల్స్‌ 6,306 ఉన్నాయి. ఆ కాల్స్‌పై పోలీసులు తక్షణం స్పందించి 100 శాతం మందికి రక్షణ కల్పించారు. సమస్యలను పరిష్కరించారు. 799 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ‘దిశ’ వచ్చిన తరువాత ఇప్పటి వరకు 148 కేసుల్లో దోషులకు శిక్షలు అమలయ్యాయి. 

సత్వర పరిష్కారంలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌... 


దిశ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కేసుల సత్వర పరిష్కారంలో జాతీయ సగటు కంటే మన రాష్ట్రం ఎంతో మెరుగ్గా ఉండటం విశేషం. 2019తో పోలిస్తే 2020లో రాష్ట్రంలో మహిళలపై నేరాలు 4శాతం తగ్గాయి. మహిళలపై నేరాల కేసుల విచారణ 2019లో సగటున  100 రోజులు ఉండగా 2020లో 86 రోజులకు తగ్గింది. ఇక 2021లో ఏకంగా 42 రోజులకు తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహిళలపై దాడుల కేసుల్లో నిర్ణీత గడువు 60రోజుల్లోగా దేశంలో ఈ ఏడాది 35 శాతం కేసుల్లోనే దర్యాప్తు చేశారు. కానీ ఏపీలో మాత్రం ఏకంగా 90.17శాతం కేసుల్లో దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయడం విశేషం. దిశ యాప్, దిశ వ్యవస్థ జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు గెలుచుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న దిశ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా బృందాలను పంపించాయి. 

పటిష్ఠ వ్యవస్థ...
➤ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా 18 దిశ పోలీస్‌ స్టేషన్లు నెలకొల్పింది. వాటిలో మహిళల హెల్ప్‌ డెస్క్, వెయిటింగ్‌ హాల్, కౌన్సెలింగ్‌ రూమ్, బాలింతలు బిడ్డలకు పాలుపట్టేందుకు ప్రత్యేక గది... ఇలా పలు సదుపాయాలు కల్పించారు. 
➤ ఏపీ ప్రభుత్వం రూ.4.50కోట్లతో దిశ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పించింది. కేసుల సత్వర విచారణకు దిశ ల్యాబ్‌లను బలోపేతం చేసేందుకు అవసరమైన 7 రకాల పరికరాల కొనుగోలు చేసింది. 
➤ మహిళలపై అత్యాచారాలు, హత్యల కేసుల సత్వర దర్యాప్తు కోసం 7 దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. 58మంది సైంటిఫిక్‌ అసిస్టెంట్లను నియమించింది. త్వరలో 61మంది ఫోరెన్సిక్‌ నిపుణులను నియమించనుంది. 
➤ మొబైల్‌ ఫోన్లలో వైరస్, మాల్‌వేర్‌లను తొలగించేందుకు ’సైబర్‌ కవచ్‌’పేరిట 50 సైబర్‌ కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. 
➤ పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం ఉన్న 10 కోర్టులకు అదనంగా కొత్తగా 6 కోర్టులను ఏర్పాటు చేస్తోంది.
➤ మహిళలపై నేరాల విచారణకు 12 కోర్టులు ఉండగా కడపలో మరో కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. 
➤ దిశ వ్యవస్థ కోసం ప్రభుత్వం ఇప్పటికే 900 స్కూటర్లను సమకూర్చింది. కొత్తగా 145 స్కార్పియో వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం రూ.16.60 కోట్లు మంజూరు చేసింది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 8 మంది నుంచి 10మందితో మహిళా మిత్ర బృందాలను ఏర్పాటు చేశారు. 

ఇతర సహాయం కోసం..
దిశ యాప్‌లోనే డయల్‌ 100, డయల్‌ 112 నంబర్లు కూడా ఉంటాయి. ఈ యాప్‌లోనే పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్‌ సెంటర్లు, బ్లడ్‌ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు కూడా ఉన్నాయి. 

మహిళా భద్రతకు భరోసా:  గౌతం సవాంగ్, డీజీపీ, ఏపీ


ఏపీలో మహిళల భద్రతలో దిశ యాప్‌ కీలక భూమిక పోషిస్తోంది. ఆపదలో ఉన్నామని మహిళలు దిశ యాప్‌ ద్వారా సంప్రదిస్తే గరిష్టంగా ఆరేడు నిముషాల్లోనే పోలీసులు అక్కడకు చేరుకుని రక్షణ కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దిశ వ్యవస్థను సమర్థంగా పనిచేసేందుకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చారు. జాతీయ స్థాయిలో దిశ యాప్‌కు ఎన్నో అవార్డులు లభించాయి. ఎన్నో రాష్ట్రాలు దిశ యాప్‌ పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏపీకి పంపించి పరిశీలించాయి. సత్వరం దర్యాప్తు జరిపి దోషులను త్వరగా శిక్షించేలా చట్టాన్ని తీసుకు వచ్చేందుకు దిశ బిల్లును కూడా ఏపీ శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ బిల్లుకు త్వరలో ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నాం. 

యాప్‌ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్‌ ఇలా..


ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ మొబైల్‌ ఫోన్లలో గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దిశ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం తమ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ వెంటనే ఒక ఓటీపీ నంబర్‌ వస్తుంది. దాన్ని యాప్‌లో నమోదు చేస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 

ఆపదలో యాప్‌ పని చేసేది ఇలా...
➤ దిశ యాప్‌లో అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్‌) బటన్‌ ఉంటుంది. 
➤ యువతులు, మహిళలు తాము ఆపదలో చిక్కుకున్నారని భావిస్తే వెంటనే యాప్‌ను ఓపెన్‌ చేసి ఆ ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కాలి.  ఆ వెంటనే వారి ఫోన్‌ నంబర్, చిరునామా, వారు అప్పటికి ఉన్న ప్రదేశం(లొకేషన్‌)తోసహా మొత్తం సమాచారం దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది.
➤ ఆ వెంటనే కంట్రోల్‌ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపినవారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు.   
➤ ఇక అత్యవసర ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కితే చాలు వారి వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియో కూడా రికార్డ్‌ చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు పంపుతుంది. 
➤ యువతులు, మహిళలు విపత్కర పరిస్థితుల్లో తమ ఫోన్లోని దిశ యాప్‌ను ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. వారు తమ ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్‌ వెంటనే దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. 
➤ సమాచారం తెలిసిన వెంటనే పోలీస్‌ స్టేషన్‌లోని అధికారులు, సిబ్బంది జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వచ్చి రక్షిస్తారు. అందుకోసం పోలీస్‌ వాహనాల్లో అమర్చిన ’మొబైల్‌ డేటా టెర్మినల్‌’ సహాయపడుతుంది. 

కుటుంబ సభ్యులకూ సమాచారం.. 
యువతులు, మహిళలు తాము ఆపదలో ఉన్నామని భావించినప్పుడు పోలీసులతోపాటు తమ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చే వెసులుబాటు ‘దిశ’యాప్‌లో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఐదు నంబర్లను ఆ యాప్‌లో ఫీడ్‌ చేసుకోవచ్చు. దాంతో ఆ ఐదు నంబర్లకు కూడా సమాచారం చేరుతుంది. వారు కూడా వెంటనే పోలీసులను సంప్రదించేందుకు అవకాశం ఉంటుంది. 

ప్రయాణాల్లోనూ రక్షణ...
యువతులు, మహిళలు తమ ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గ నిర్దేశం కోసం కూడా దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవచ్చును. అందుకోసం ఆ యాప్‌లో ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ను ఏర్పాటు చేశారు. తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని అందులో నమోదు చేయాలి. వారు ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు, వారి బంధుమిత్రులకు సమాచారాన్ని పంపుతుంది. దాంతో వారు అప్రమత్తమై రక్షణకు వస్తారు. 

పుష్‌ బటన్‌ ఆప్షన్‌...
యువతులు, మహిళల రక్షణ కోసం వారికి పోలీసులు ఏదైనా సమాచారం పంపించేందుకు కూడా ఈ యాప్‌లో అవకాశం కల్పించారు. అందుకోసం ‘పుష్‌ బటన్‌’ ఆప్షన్‌ ఏర్పాటు చేశారు. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆధీనంలో ఉండే ఈ ‘పుష్‌ బటన్‌’ ఆప్షన్‌ ద్వారా పోలీసులు అందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయవచ్చును. ఆ యాప్‌ ఉన్న అందరికీ పోలీసుల సందేశం చేరుతుంది. దాంతో యువతులు, మహిళలు మరింత అప్రమత్తంగా ఉండి పోలీసుల సూచనలను పాటిస్తారు. 

అప్రమత్తం చేసే ఫీచర్‌..
ప్రమాదకర, సున్నిత ప్రాంతాల గురించి మహిళలను ముందే అప్రమత్తం చేసే ఫీచర్‌ను కూడా ఈ యాప్‌లో పొందుపరిచారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న మహిళలు, విద్యార్థినులు లైవ్‌ ట్రాకింగ్‌ ఆప్షన్‌ను ఆన్‌లో ఉంచుకోవాలి. తాము ఎక్కడికైనా వెళ్లాల్సిన వస్తే ఆ ప్రాంతాన్ని దిశ యాప్‌లో ఫీడ్‌ చేయాలి. వారు వెళ్లే మార్గంలో ఎక్కడైనా సున్నిత, ప్రమాదకర ప్రాంతాలు ఉంటే దిశ యాప్‌ వారిని వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఈవ్‌ టీజింగ్, చైన్‌ స్నాచింగ్, నిర్మానుష్య ప్రాంతాలు, ఇతర సున్నిత, ప్రమాదక ప్రాంతాలనే విషయాన్ని వారికి ముందే చెబుతుంది.  దాంతో ఆ మార్గంలో వెళ్లాలన్న ఆలోచనను విరమించుకోవడంగానీ, తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడంగానీ, బంధుమిత్రుల తోడు తీసుకుని వెళ్లడంగానీ చేస్తారు. దిశ యాప్‌లో ఈ ఫీచర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుగా రాష్ట్రంలోని సున్నిత, ప్రమాదాలకు అవకాశం ఉండే ప్రాంతాలను పోలీసు శాఖ మ్యాపింగ్‌ చేసి జియో ట్యాగింగ్‌ చేసింది. 

వన్‌స్టాప్‌ సెంటర్లతో బాధిత మహిళలకు పూర్తి వైద్య, న్యాయ సహకారం..


ఆంధ్రప్రదేశ్‌లో 13 దిశ వన్‌స్టాప్‌ సెంటర్లను నిర్వహిస్తున్నాం. దిశ పోలీస్‌ స్టేషన్ల ద్వారా వచ్చిన కేసుల్లో బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం. బాధిత మహిళలు, బాలికలకు అవసరమైన వైద్యసహాయాన్ని అందించేలా సహకరిస్తున్నాం. ఆ కేసుల్లో బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి ఉచితంగా పూర్తి న్యాయసహాయం అందిస్తున్నాం. బాధిత బాలికలకు పోక్సో న్యాయస్థానాలకు హాజరయ్యేటప్పుడు వారితో దిశ వన్‌స్టాప్‌ సెంటర్ల సిబ్బంది తోడు ఉంటున్నారు. రాష్ట్రంలోని వన్‌స్టాప్‌ సెంటర్లతో 45 స్వచ్ఛంద సంస్థలను అనుసంధానించాం. యూనిసెఫ్‌ సహకారం తీసుకుంటున్నాం. బాధిత మహిళలకు సమస్యలను పరిష్కరించేందుకు వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. మహిళలు, బాలికలకు పూర్తి రక్షణ, సామాజిక భద్రత, వైద్య, న్యాయసహాయాలు అందించే బాధ్యతను వన్‌స్టాప్‌ సెంటర్లు సమర్థంగా నిర్వహిస్తున్నాయి.
                                                                                                   – కృతిక శుక్లా, దిశ ప్రత్యేక అధికారి

దిశ బిల్లుకు ఆమోదం.. 
మహిళలు, యువతులపై దాడులు, అత్యాచారాల కేసుల్లో నిందితులను సత్వరం విచారించి, శిక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘దిశ’ బిల్లును రూపొందించింది. కేవలం 21రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను గుర్తించి శిక్షించేందుకు అవకాశం కల్పించిన ఈ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. ప్రస్తుతం ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దిశ కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా దిశ కోర్టులను ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏపీ ప్రభుత్వం కోరింది. దిశ కేసుల విచారణ కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించింది.

ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం– 2019.. ముఖ్యాంశాలు..!

#Tags