APRCET Exam 2024 : ఏపీ ఆర్‌సెట్‌-2024 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET)2024 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 2 నుంచి 5 వరకు ఎపిఆర్‌ సెట్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి. దేవప్రసాదరాజు తెలిపారు. తిరుపతిలోని ఎస్‌వి యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్‌ దేవప్రసాదరాజు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఏపీఆర్‌సెట్ ప్రవేశానికి అర్హతలివే :

  • అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
  • రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు కనీస మార్కులు 50 శాతంగా ఉండాలి.

పరీక్షల షెడ్యూల్‌ ఇదే..
ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ, మధ్యహ్నం 2.30 గంటల నుంచీ 4.30 గంటల వరకూ రెండు దశలుగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు మార్చి 19తో ముగియగా.. రూ.2000 ఆలస్య రుసుంతో మార్చి 29 వరకు, రూ.5000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

పరీక్షా కేంద్రాలు..
ఈనెల 10వ తేదీ నుంచీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ నుంచీ హాల్‌టికెట్లను విద్యార్థులు పొందవచ్చని సూచించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఎంపిక చేసిన 17 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 10 వేల మందికి పైగా అ‍భ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మే 20వ తేదీ నాటికి ఫలితాలు వెల్లడించి, జూన్‌లో ఇంటర్వ్యూలు చేపడతామని వివరించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్‌ కుసుమ హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

#Tags