మళ్లీ సుప్రీం‘కోర్టు’లో కౌన్సెలింగ్

  • ఇంజనీరింగ్ కళాశాలల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు విచారణ వచ్చే నెల 10కి వాయిదా
  • తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూహెచ్‌లకు నోటీసులు
  • చిన్న చిన్న కారణాలను చూపుతూ అఫిలియేషన్‌ను నిరాకరించడం సరికాదంటున్న కాలేజీలు
న్యూఢిల్లీ: అనుమతుల ఆలస్యం కారణం గా ఎంసెట్ కౌన్సెలింగ్‌లో అవకాశం కోల్పోయామని, మరోసారి కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరుతూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ జేఎన్‌టీయూహెచ్, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యా మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై విచారణను బెంచ్‌కు అప్పగిస్తామని.. వచ్చే నెల 10 వీటిపై విచారణ జరుగుతుందని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా లేవం టూ గత నెలలో 174 ఇంజనీరింగ్ కళాశాలలకు గుర్తింపును జేఎన్‌టీయూహెచ్ నిరాకరించిన విషయం తెలిసిందే. దానిపై కళాశాలల యాజ మాన్యాలు హైకోర్టును ఆశ్రయించడంతో... ఏఐసీటీఈ ప్రమాణాల మేరకు వసతులు సమకూర్చుతామంటూ అఫిడవిట్ తీసుకుని కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుమారు 130 కాలేజీలు యూనివర్సిటీకి అఫిడవిట్ ఇచ్చాయి. కానీ అప్పటికే సమయం మించిపోయిందంటూ.. ప్రభుత్వం ఆయా కళాశాలలను కౌన్సెలింగ్‌లో చేర్చలేదు. దాంతోపాటు రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతివ్వాలంటూ ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించినా... అంతకుముందే గడువు పెంచామని, మళ్లీ అనుమతివ్వబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అనుమతుల ఆలస్యం కారణంగా తాము నష్టపోయామంటూ 25 ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అనుమతించాలని, లేదంటే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించాయి. దీనిని శుక్రవారం జస్టిస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ అనిల్ దవేలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

ముందుగానే చేపట్టాల్సిన తనిఖీలను చివరివరకూ చేపట్టలేదని.. చిన్న చిన్న కారణాలను చూపుతూ అఫిలియేషన్‌ను నిరాకరించడం సరి కాదంటూ కాలేజీల యాజమాన్యాల తరఫున న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్, జీఎన్ రెడ్డి, తెలంగాణ అడ్వొకేట్ ఆన్ రికార్ట్స్ ఉదయ్‌కుమార్ సాగర్ వాదనలు విని పించారు. అనుమతుల విషయంలో జాప్యం జరగడంతో.. కళాశాలలు నష్టపోయాయని కోర్టుకు తెలిపారు. ఈ కాలేజీలను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు ఆదేశించినా.. అప్పటికే ఆలస్యమైందంటూ జాబితాలో చేర్చలేదని విన్నవించారు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో కౌన్సెలింగ్ గడువును జూలై31 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించారని కోర్టుకు తెలిపారు. అప్పటికీ కౌన్సెలింగ్ పూర్తికాకపోవడంతో రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని ఇంతకుముందే సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చిందని వివరించారు.

అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మా సనం పిటిషన్లను విచారణకు స్వీకరించింది. ఈ విచారణను సంబంధిత ధర్మాసనానికి బదిలీ చేస్తామని పేర్కొంటూ.. విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూలకు నోటీసులు జారీ చేసింది.

రెండో విడత కౌన్సెలింగ్ కష్టమే!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌కు అనుమతి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొదటి విడతలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కనీసం స్లైడింగ్‌కు (బ్రాంచీ, కాలేజీ మార్చుకునే వీలు కల్పించే ) అవకాశం ఇవ్వాలని, ఇందుకోసం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసును శుక్రవారం పరి శీలించిన సుప్రీంకోర్టు విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది. దీంతో ఇక రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి రాకపోవచ్చనే భావన అధికారుల్లో నెలకొంది.

కోర్టుకు వెళ్లినా దక్కని ఫలితం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 575 ఇం జనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటా లో 1,89,088 సీట్లు అందుబాటులో ఉండ గా, 1,16,029 మంది విద్యార్థులకు ఆగస్టు30న సీట్లను కేటారుుంచారు. అరుుతే 73,059 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో ఏపీలో 57,372 సీట్లు, తెలంగాణలో 15,677 సీట్లు ఉన్నాయి. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న దాదాపు 4 వేల మంది విద్యార్థులు తమ ర్యాం కుకు తగిన రీతిలో ఆప్షన్ ఇచ్చుకోనందున వారికి ఏ కాలేజీలోనూ సీట్లు రాలేదు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులకు స్లైడింగ్‌కు అవకాశం కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఈ నెల మొదట్లో సుప్రీంకోర్టును ఆశ్రయిం చగా, అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేస్తూ 11న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.



#Tags