అభ్యర్థులు కోరితే జేఈఈ ‘జవాబు పత్రాలు’
హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ-మెయిన్ 2015) పరీక్షకు సంబంధించిన ఓఎమ్మార్ షీట్లు, ఆన్సర్ కీ, క్యాలిక్యులేషన్ షీట్ల ఫొటో కాపీలను అభ్యర్థులకు అందించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. రూ. 500 రుసుము చెల్లిస్తే ఈ ఫొటో కాపీలను అభ్యర్థులకు అందించనున్నారు.
జూన్ 8 లోగా దరఖాస్తులు చేసుకున్న వారికి వీటిని ఇస్తామని సీబీఎస్‌ఈ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (జేఏబీ) నోటిఫికేషన్ జారీచేశారు. అభ్యర్థులు రూ. 500 రుసుమును ‘సెక్రటరీ, సీబీఎస్‌ఈ’ పేరిట న్యూఢిల్లీలో చెల్లుబాటు అయ్యేలా షెడ్యూల్డ్ బ్యాంకుల్లో డిమాండ్ డ్రాఫ్టును తీయాలి. దరఖాస్తులో తమ జేఈఈ మెయిన్ రోల్ నంబర్, పేరు, చిరునామాను తప్పనిసరిగా పొందుపర్చాలి. ఇవే వివరాలను అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ వెనుక కూడా తప్పకుండా రాయాలి. నేరుగా అభ్యర్థులు మాత్రమే వీటికోసం దరఖాస్తు చేయాలి. సీబీఎస్‌ఈ అందించే ఓఎమ్మార్ షీటు, క్యాలిక్యులేషన్ షీట్ల ఫొటో కాపీలను ఏ విద్యాలయానికి, ఇతర ఏ సంస్థకు ప్రచారం కోసం అందించడానికి వీల్లేదు. అలాగే పత్రికల్లో ప్రచారానికి కూడా వినియోగించరాదు. ఫొటో కాపీలు అందించడంలో తుది నిర్ణయం బోర్డుదే. ఈ ఫొటో కాపీలను స్పీడ్‌పోస్టులో పంపిస్తారు. గడువు దాటాక ఎలాంటి దరఖాస్తులను ఆమోదించబోమని బోర్డు ఆ నోటిఫికేషన్లో స్పష్టంచేసింది.
#Tags