ఇంజనీరింగ్‌లో బాలురే ఎక్కువ!

సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే 2019-20 విద్యా సంవత్సరంలోనూ ఇంజనీరింగ్‌లో బాలురే అత్యధికంగా చేరారు.
రాష్ట్రంలోని 186 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 65,565 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా అందులో 46,134 సీట్లు (70.4 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. అందులో బాలురే అత్యధికంగా చేరినట్లు డిసెంబర్ 4న ప్రవేశాల కమిటీ లెక్కలు తేల్చింది. బీటెక్ ఇంజనీరింగ్‌లో బాలురు 26,716 మంది చేరగా, బాలికలు 19,418 మంది చేరారు. ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్‌లో (ఫార్మ్-డి కలుపుకొని) 7,908 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా 7,241 సీట్లు (91.6 శాతం) భర్తీ అయ్యాయి. అందులో 2,026 సీట్లలో బాలురు చేరగా, 5,215 మంది బాలికలు చేరారు. ఎంబీఏలో 22,429 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా 19,277 సీట్లు (85.9 శాతం) భర్తీ అయ్యాయి. అందులో బాలురు 9,439 మంది చేరగా, బాలికలు 9,838 మంది చేరారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు ల్యాటరల్ ఎంట్రీలో భాగంగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో 24,479 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా, అందులో 17,803 సీట్లు (72.7 శాతం) భర్తీ అయ్యాయి. అందులో 12,270 మంది బాలురు చేరగా, 5,533 మంది బాలికలు చేరారు. ఇంజనీరింగ్‌లో చేరిన 46,134 మంది విద్యార్థుల్లో బీసీ విద్యార్థులే 24,396 (52.88 శాతం) మంది ఉండటం గమనార్హం. బీసీల్లోనూ ఎక్కువ మంది బీసీ-బీ, బీసీ-డీ కేటగిరీలకు చెందిన వారే ఉన్నారు. బీసీ-బీలో బాలురు 5,796 మంది ఉండగా, బాలికలు 4,544 మంది ఉన్నారు. బీసీ-డీలో బాలురు 4,534 మంది ఉండగా, బాలికలు 3,342 మంది ఉన్నట్లు లెక్కలు తేల్చింది.
 
 ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు
 బీసీ -  24,396
 ఓసీ -  13,129
 ఎస్సీ -  5,647
 ఎస్టీ -  2,962
 మొత్తం -  46,134 

#Tags