TS Mega DSc Notification : సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం.. మెగా డీఎస్సీ ద్వారా టీచరు పోస్టుల భర్తీ.. మొత్తం ఎన్ని పోస్టులకంటే..?
తెలంగాణలో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి కొన్ని వేల మంది నిరుద్యోగులు వేచిచూస్తున్నారు. గత ప్రభుత్వంలో అదిగో నోటిఫికేషన్.. ఇదిగో నోటిఫికేషన్ అని కాలయాపన చేసి.. చివరికి మెండిచేయ్యి చూపింది. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కూడా త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ.. ఈ దిశగా ముందుకు వెళ్తుతున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని, వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని సీఎం ఆదేశంచారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో..,
ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఉన్నత విద్య మండలి ఛైర్మన్ ప్రో. లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా శాఖ శ్రీమతి దేవసేన, సి.ఎం.ఓ అధికారులు శ్రీ శేషాద్రి, శ్రీ షా-నవాజ్ కాసీం తదితర అధికారులు హాజరయ్యారు.
9,800 ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే..
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్పష్టంగా వెల్లడించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నహాలు చేస్తుంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ.. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తోంది. గత మూడున్నర నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో ఖాళీలు ఉండగా.. తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలోనే హామీ ఇచ్చింది. డిసెంబర్ 15వ తేదీన (శుక్రవారం) అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ వచ్చే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే గత నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థికశాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు సుమారు 9,800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేశాయి.
అంటే 19,043 పోస్టులను..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జులైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ ఆయా గణాంకాలు సమర్పించింది. అందుకు భిన్నంగా 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ అయ్యింది. అంటే 4,281 పోస్టులకు కోత పడింది. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 కాగా.. ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో స్కూల్ అసిస్టెంట్‌లో 70 శాతం, హెచ్‌ఎం ఖాళీలన్నింటినీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది.గత నోటిఫికేషన్ సమయంలోనే పదోన్నతుల ద్వారా 1947 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 2162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(పీఎస్‌హెచ్‌ఎం), మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 9,979 భర్తీ చేస్తామని సర్కారు స్పష్టంచేసింది. నోటిఫికేషన్ పోస్టులతో వీటిని కలిపినా మొత్తం 15,068 అవుతాయి. అంటే 3,975 ఖాళీలకు గండిపడింది. విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370 తోపాటు గత అక్టోబరులో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన 9,820 ఖాళీలు ఉన్నట్లు.
కొత్త నియామకాలపైనే..
ఉపాధ్యాయ ఖాళీల్లో కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. స్కూల్ అసిసెంట్లు(ఎస్‌ఏ)గా అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్ల ద్వారా 70 శాతం ఖాళీలు భర్తీ చేసి, 30 శాతం స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీ నేరుగా నోటిఫికేషన్ ద్వారా చేయాల్సి ఉంటుంది.కొన్ని స్కూళ్లలో టీచర్ల సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్య లేదు. కొన్ని స్కూళ్లల్లో విద్యార్థులున్నా, టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధీకరణ చేయాలని విద్యాశాఖ 2016 నుంచి చెబుతూనే ఉంది.
నోటిఫికేషన్‌కు అడ్డంకులెన్నో...
ఉపాధ్యాయ నియామకాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా లక్షలాదిమంది కోచింగ్‌ల కోసం హైదరాబాద్ బాట పడుతున్నారు. అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. కొంత మంది ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నా, వాటిని విడిచిపెట్టి ప్రభుత్వ టీచర్ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వాతావరణమే మళ్లీ కనిపించనుంది. అయితే, విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలుస్తాయి. టెట్ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు దీనిని చేపట్టాల్సి ఉంటుంది.వరుసగా స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలున్నాయి. దీనివల్ల కాలయాపన జరిగే వీలుంది. ఇవేవీ అడ్డంకి కాకుండా నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఒక వేళ ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తే..
గత నోటిఫికేషన్‌కు సుమారు 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల నియమావళి కారణంగా ఆన్‌లైన్ పరీక్షలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు, డీఎస్సీకి ముడిపెడితే నియామకాలు పూర్తికావనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.