Paris Olympics: ఒలింపిక్స్‌లో పాల్గొన్న అత్యధిక వయస్కురాలు ఈమెనే.. ఓ దేశంలో పుట్టి మరో దేశానికి..

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో చిలీ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి జియింగ్‌ జెంగ్‌ చరిత్ర సృష్టించింది.

ఒలింపిక్స్‌లో పాల్గొన్న అత్యధిక వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. జియింగ్‌ జెంగ్‌ 58 ఏళ్ల లేటు వయసులో ఒలింపిక్స్‌ బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్నది జెంగ్‌ చిరకాల కోరిక. తన కోరికను జెంగ్‌ లేటు వయసులో సాకారం చేసుకుంది. సాధించాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డు కాదని జెంగ్‌ నిరూపించింది.

చైనా నుంచి చిలీ వరకు..
చైనాలో జన్మించిన జియింగ్‌ జెంగ్‌ ప్రస్తుతం చిలీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. జియింగ్‌ జెంగ్‌ ఒలింపిక్స్‌ ప్రస్తానం అంత సులువుగా సాగలేదు.

18 సంవత్సరాల వయస్సులో జెంగ్‌ తన జన్మ దేశమైన చైనా తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఆశించింది. అయితే టేబుల్‌ టెన్నిస్‌ ఒలింపిక్స్‌ అరంగేట్రానికి ముందే ఆమె కెరీర్‌కు బ్రేక్‌ పడింది. వివిధ కారణాల చేత జెంగ్‌ తనకెంతో ఇష్టమైన ఆటకు దూరమైంది. 20 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ ప్రకటించింది. కొంతకాలం తర్వాత ఆమె చిలీకి వెళ్లి వివిధ టేబుల్ టెన్నిస్ జట్లకు శిక్షణ ఇచ్చింది.

2000లో జెంగ్‌ ఉద్యోగరిత్యా టేబుల్‌ టెన్నిస్‌కు పూర్తిగా దూరమైంది. అనంతరం 20 సంవత్సరాల పాటు ఆటతో సంబంధం లేకుండా ఉండింది. కోవిడ్ సమయంలో జెంగ్‌ తిరిగి టేబుల్‌ టెన్నిస్‌ ఆడటం ప్రారంభించింది. 2024 ఒలింపిక్స్‌లో చిలీకి ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టకేలకు  ఆమె ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా.. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించింది.

Paris Olympics: ఒలింపిక్స్‌లో పడి లేచిన తరంగం.. ‘మను’సంతా పతకమే!

#Tags