Jyothi Surekha: ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు సాధించిన క్రీడాకారిణి?

అమెరికాలోని యాంక్టన్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. సెప్టెంబర్‌ 25న జరిగిన కాంపౌండ్‌ విభాగంలో జ్యోతి సురేఖ భారత్‌కు మూడు రజత పతకాలను అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్‌ విభాగంలో, మహిళల టీమ్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.

వ్యక్తిగత విభాగంలో...

కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో సురేఖ 144–146 పాయింట్ల తేడాతో సారా లోపెజ్‌ (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. ఫలితంగా రజతం దక్కించుకుంది.

 

ప్రపంచ రికార్డు... 

కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం క్వార్టర్‌ ఫైనల్లో సురేఖ 150–144తో అమందా మ్లినారిచ్‌ (క్రొయేషియా)పై విజయం సాధించింది. 150కి 150 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో లిండా అండర్సన్‌ (అమెరికా; 2018లో), సారా లోపెజ్‌ (కొలంబియా; 2013, 2021లో) మాత్రమే 150కి 150 పాయింట్లు స్కోరు చేశారు.

 

టీమ్‌ విభాగం ఫైనల్లో... 

కాంపౌండ్‌ మహిళల టీమ్‌ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, ముస్కాన్‌ కిరార్, ప్రియా గుర్జర్‌లతో కూడిన భారత జట్టు 224–229 పాయింట్ల తేడాతో సారా లోపెజ్, అలెజాంద్రా ఉస్కియానో, నోరా వాల్దెజ్‌లతో కూడిన కొలంబియా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది.

 

మిక్స్‌డ్‌ ఫైనల్లో...  

కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ (భారత్‌) జంట ఫైనల్లో 150–154 పాయింట్ల తేడాతో సారా లోపెజ్‌–డానియల్‌ మునోజ్‌ (కొలంబియా) జోడీ చేతిలో పరాజయంపాలైంది.

చ‌ద‌వండి: హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరం?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు సాధించిన భారత క్రీడాకారిణి?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 25
ఎవరు    : వెన్నం జ్యోతి సురేఖ
ఎక్కడ    : యాంక్టన్, అమెరికా

 

#Tags