Chess Olympiad: చెస్‌ ఒలింపియాడ్‌లో పతకాలు సాధించిన వారిని సన్మానించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి

చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ప్రత్యేకంగా అభినందించారు.

బుడాపెస్ట్‌లో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో చాంపియన్‌లుగా నిలిచి భారత చదరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ప్లేయర్లను మన్‌సుఖ్‌తోపాటు కేంద్ర క్రీడా సహాయ మంత్రి రక్షా ఖాడ్సే సెప్టెంబ‌ర్ 26వ తేదీ న్యూఢిల్లీలో సన్మానించారు. 

‘అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవడం ద్వారా దేశ ప్రజలను గర్వపడేలా చేశారు. దీంతో పాటు వారసత్వ క్రీడలో మన సత్తా ఏంటో నిరూపించారు. ఏ ఆటలోనైనా నైపుణ్యాన్ని గుర్తించి వారికి అండగా నిలవడంలో కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్న క్రమంలో క్రీడారంగంలో మన అథ్లెట్లు సాధించే విజయాలు దేశానికి మరింత గుర్తింపు తెచ్చిపెడతాయి. 

ఒలింపియాడ్‌లో పతకాలు నెగ్గిన ప్లేయర్లు దేశంలో యువతరానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ల వంటి వాళ్లు’ అని మాండవీయ తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్లు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి కాగా.. ఈ ప్రదర్శనతో దేశంలో చిన్నారులు, యువతలో ఆటల పట్ల ఆకర్శణ మరింత పెరుగుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Chess Olympiad 2024: చెస్‌ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌.. తొలిసారి పసిడి పతకాలు సొంతం

ఈ సందర్భంగా దొమ్మరాజు గుకేశ్, ద్రోణవల్లి హారికలతో మాండవీయ సరదాగా చెస్‌ ఆడారు. స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్ల సభ్యులకు కేంద్ర క్రీడా శాఖ రూ.20 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని చెక్‌ల రూపంలో అందించింది.

#Tags