Scorpene Class Submarine: ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి ఎక్కడ జలప్రవేశం చేసింది?

ప్రాజెక్టు 75లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి నవంబర్ 25న నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ చేతుల మీదుగా ముంబై తీరంలో జలప్రవేశం చేసింది. ఈ సందర్భంగా అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ మాట్లాడుతూ... ఐఎన్‌ఎస్‌ వేలా అత్యంత సమర్థవంతమైనదని, జలంతార్గాముల ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతాపరమైన సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ వేలాకి భారత నావికాదళ ప్రయోజనాలను పరిరక్షించే సత్తా ఉందని అన్నారు.   

నాలుగవది..

2005లో భారత్, ఫ్రాన్స్‌ 375 కోట్ల డాలర్లతో ఆరు స్కార్పెన్‌ క్లాస్‌ జలాంతర్గాముల్ని తయారు చేయాలని ఒప్పందం కుదిరింది. అందులో ఐఎన్‌ఎస్‌ వేలా నాలుగవది. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ఎస్, భారత్‌కు చెందిన మాజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఈ జలాంతర్గామి తయారీలో భాగస్వామ్యులుగా ఉన్నాయి. అయితే ఫ్రాన్స్‌ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో జాప్యం చేయడంతో ఈ ప్రాజెక్టులు ఆలస్యమవుతూ వచ్చాయి. 2017లో ఐఎన్‌ఎస్‌ కల్వారి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఐఎన్‌ఎస్‌ ఖండేరి, ఐఎన్‌ఎస్‌ కరాంజ్‌లు కూడా విధుల్లో చేరాయి. అయితే కరోనా కారణంగా ఐఎన్‌ఎస్‌ వేలా మరింత ఆలస్యమైంది.  1973 నుంచి 2010 వరకు నావికాదళంలో సేవలు అందించిన ఒకప్పటి జలాంతర్గామి వేలా పేరునే దీనికీ పెట్టారు. సోవియెట్‌ రష్యా తయారు చేసిన ఆ సబ్‌మెరైన్‌ మన దేశం నిర్వహించిన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది. నేవీలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన వేలాని 2010లో నావికాదళం నుంచి విరమించారు.  

ఐఎన్‌ఎస్‌ వేలా ప్రత్యేకతలు..

  • వేలా సబ్‌మెరైన్‌ 67.5 మీటర్లు పొడవు, 12.3 మీటర్ల ఎత్తు, 6.2 మీటర్ల వెడల్పు ఉంటుంది.  
  • నీట మునిగినప్పుడు 20 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
  • సీ303 యాంటీ టార్పెడో కౌంటర్‌మెజర్‌ వ్యవస్థ కలిగి ఉంది. ఈ సబ్‌మెరైన్లో 18 టార్పెడోలను, లేదంటే యాంటీ షిప్‌ క్షిపణుల్ని అత్యంత సమర్థవంతంగా ప్రయోగించగలదు.  
  • ఎనిమిది మంది  అధికారులు, 35 మంది సిబ్బందిని మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగి ఉంది.
  • స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన వేలాలో తొలిసారిగా బ్యాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డీజిల్, ఎలక్ట్రిక్‌ శక్తితో ఇంజిన్లు పని చేస్తాయి.

చ‌ద‌వండి: ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి ప్రారంభం  
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు    : నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌   
ఎక్కడ    : ముంబై తీరం, మహారాష్ట్ర
ఎందుకు : భారతా నావికాదళాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు...

డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

#Tags