జనవరి 2020 అంతర్జాతీయం

ప్రపంచంలోనే అతిచిన్న బంగారు నాణెం
పరిమాణం పరంగా ప్రపంచంలోనే అతి చిన్న బంగారు నాణేన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వం తయారు చేసింది. ఈ నాణెంపై ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన నాలుకను బయటపెట్టి వెక్కిరిస్తున్నట్లున్న చిత్రాన్ని ఒకవైపు, నాణెం విలువను తెలిపే 1/4 స్విస్ ఫ్రాంక్స్‌ను మరోవైపు ముద్రించింది. 0.0163 గ్రాముల బంగారంతో రూపొందించిన ఈ నాణెం పరిమాణం 2.96 మిల్లీమీటర్లుగా ఉందని స్విస్‌మింట్ జనవరి 23న వెల్లడించింది. ఇటువంటి 999 నాణేలను మాత్రమే ముద్రించామనీ, ఒక్కో నాణెం వెల సుమారు రూ.18 కాగా రూ.14,657కు విక్రయిస్తామని తెలిపింది. నాణెంతోపాటు దానిపైని ఐన్‌స్టీన్ చిత్రం చూసేందుకు కొనుగోలుదారులకు కళ్లద్దాలు కూడా అందజేస్తామని వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అతిచిన్న బంగారు నాణెం ముద్రణ
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : స్విట్జర్లాండ్ ప్రభుత్వం

రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి : ఐసీజే
మయన్మార్ సైన్యం దాడులతో బంగ్లాదేశ్ వెళ్లి తలదాచుకుంటున్న లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బాసటగా నిలిచింది. రోహింగ్యాలపై మారణకాండను ఆపేందుకు మయన్మార్ ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని జనవరి 23న ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నదీ ముందుగా నాలుగు నెలలకు, ఆ తర్వాత ఆరు నెలలకోసారి నివేదిక అందించాలని ఐసీజే ప్రెసిడెంట్ అబ్దుల్‌ఖవీ అహ్మద్ యూసఫ్ కోరారు. మయన్మార్ సైన్యం రోహింగ్యాలపై అత్యాచారాలు, హత్యలు, ఆస్తుల విధ్వంసాలకు పాల్పడుతోందని ముస్లిం దేశాల తరఫున ఐసీజేలో గాంబియా వాదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రోహింగ్యాలపై మారణకాండను ఆపేందుకు మయన్మార్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)

డబ్ల్యూఈఎఫ్ ఇంటర్నెట్ నిబంధనలు విడుదల
ఇంటర్నెట్ వినియోగ దారుల భద్రత కోసం తయారుచేసిన నూతన ఇంటర్నెట్ నిబంధనలను వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) జనవరి 23న విడుదల చేసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం 50వ వార్షిక సమావేశాల సందర్భంగా తాజా నిబంధనలను ఆవిష్కరించారు. ఈ నిబంధనలు 180 దేశాల్లోని వందకోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులను తీవ్రమైన సైబర్ దాడుల నుంచి రక్షిస్తాయని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. అలాగే 2021 నాటికి సైబర్ నేరగాళ్ళబారి నుంచి 6 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చునని వెల్లడించింది. నూతన ఇంటర్నెట్ నిబంధనలను ఐఎస్‌పీ(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్), ప్రముఖ బహుపాక్షిక సంస్థల బృందం తయారు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూఈఎఫ్ ఇంటర్నెట్ నిబంధనలు విడుదల
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
ఎందుకు : ఇంటర్నెట్ వినియోగ దారుల భద్రత కోసం

డబ్ల్యూఈఎఫ్ సదస్సులో గోయల్ ప్రసంగం
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో జనవరి 23న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు. ‘వ్యూహాత్మక దృక్కోణం- భారతదేశం’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ... భారత ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు సిద్ధంగా ఉందని అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొన్నట్టు పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
సదస్సులో ఇతర ముఖ్యాంశాలు...
  • బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో ఈ విషయమై సెంట్రల్ బ్యాంకులకు సాయపడేందుకు డబ్ల్యూఈఎఫ్, 40 దేశాల కేంద్ర బ్యాంకులతో కూడిన కమ్యూనిటీ ఓ కార్యాచరణను రూపొందించింది.
  • పర్యావరణ అనుకూలమైన, నైతిక ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌కు స్పందించేందుకు వీలుగా అన్ని రంగాల్లోని వ్యాపార సంస్థలకు సాయపడే విధంగా రూపొందించిన బ్లాక్ చెయిన్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను తొలిసారిగా ప్రపంచ ఆర్థిక వేదికలో ఆవిష్కరించారు.
  • డిజిటల్ ట్యాక్స్ సమస్యల పరిష్కార ప్రణాళికకు 137 దేశాలు మద్దతిచ్చినట్లు ఓఈసీడీ చీఫ్ ఆంగెలాగురియా చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సులో
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్

డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు ముగింపు
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 21న ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు జనవరి 24న ముగిసింది. ఈ సదస్సులో ఎన్నో అంశాలపై ప్రగతిని సాధించినట్టు డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గేబ్రెండే చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ/ప్రైవేటు సహకారం అన్నది ఎంతో కీలకమైనదిగా అభివర్ణించారు. అంతర్జాతీయంగా సమ్మిళిత, స్థిరమైన వృద్ధి కోసం ఓఈసీడీతో కలసి పనిచేస్తామని ప్రకటించారు. 2030కి లక్ష కోట్ల చెట్ల సంరక్షణ, పెంపకం లక్ష్యానికి సహకరిస్తామని, నాలుగో పారిశ్రామిక విప్లవానికి వీలుగా పునఃనైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రకటించారు.
డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు థీమ్ : Stakeholders for a Cohesive and Sustainable World (సమైక్య మరియు సుస్థిర ప్రపంచానికి వాటాదారులు)
మందగమనం తాత్కాలికమే: ఐఎంఎఫ్
సదస్సు ముగింపు కార్యక్రమంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా మాట్లాడుతూ.. భారత్‌లో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని, ఇకపై వృద్ధి పుంజుకుంటుందని అన్నారు. 2019 అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.
గోయల్ కీలక భేటీలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా జనవరి 24న పలు కీలక నేతలతో చర్చలు జరిపారు. సమగ్రాభివృద్ధి, పారదర్శకత దిశగా సంస్కరణలకు భారత్ సిద్ధంగా ఉందని డబ్ల్యూటీవో చీఫ్ రాబర్టో అజవేదోతో చెప్పారు. ఈయూ వాణిజ్య కమిషనర్ ఫిల్ హోగన్, ప్రముఖ ఆర్థికవేత్త మేఖేల్ స్పెన్స్, బ్లాక్‌స్టోన్ గ్రూపు చైర్మన్ ష్వార్జ్‌మాన్, ఏబీబీ చైర్మన్ పీటర్ వోసర్ తదితరులతోనూ గోయల్ చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు ముగింపు
ఎప్పుడు : జనవరి 24
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్

బ్రిటన్‌లో ఫాస్ట్ ట్రాక్ వీసా పథకం
నిపుణులైన శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త వీసా పథకాన్ని ప్రారంభించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, గణిత మేధావులకు ‘అపరిమిత ఫాస్ట్ ట్రాక్ వీసా’ను అందిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జనవరి 27న ప్రకటించారు. ఈ తాజా వలస నిబంధనలను జనవరి 30న ప్రకటిస్తామని, 2020 ఫిబ్రవరి 20 నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. తాజా నిర్ణయం దిశగా భారత సంతతికి చెందిన నోబెల్ బహుమతి విజేత, బ్రిటన్ రాయల్ సొసైటీ అధ్యక్షుడు వెంకీ రామకృష్ణన్ కృషి చేశారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్‌ను శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అపరిమిత ఫాస్ట్ ట్రాక్ వీసా పథకం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : బ్రిటన్ ప్రభుత్వం
ఎందుకు : నిపుణులైన శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు

ప్రపంచంలో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఈమేరకు టామ్‌టామ్ (టామ్2) అనే సంస్థ ఓ నివేదిక వెల్లడించింది. 57 దేశాల్లోని 416 నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులపై టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేరిట ఓ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం బెంగళూరు వాసులు ట్రాఫిక్‌లో సగటున 71 శాతం ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలిపింది. బెంగళూరు వాసులు ఏడాదిలో సగటున 10 రోజుల 3 గంటల పాటు (243 గంటలు) ట్రాఫిక్‌లో గడుపుతున్నట్లు పేర్కొంది. టాప్-10 జాబితాలో ముంబై, పుణే, ఢిల్లీ నగరాలు వరుసగా 4, 5, 8 స్థానాల్లో నిలిచాయి. ట్రాఫిక్ రద్దీ ముంబైలో 65 శాతంగా, పుణేలో 59 శాతంగా, ఢిల్లీలో 56 శాతంగా ఉంది. టాప్-10లో మనీలా (ఫిలిప్పీన్స్), బొగోటా (కొలంబియా), మాస్కో (రష్యా), లిమా (పెరు), ఇస్తాంబుల్ (టర్కీ), జకార్తా ( ఇండోనేసియా) ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచంలో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు
ఎక్కడ: బెంగళూరు
ఎందుకు: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ నగరం

అంతర్జాతీయ సదస్సు రైజినా డైలాగ్ ప్రారంభం
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ‘రైజినా డైలాగ్’ న్యూఢిల్లీలో జనవరి 14న ప్రారంభమైంది. ప్రపంచ దేశాల కీలక నేతలు పాల్గొంటున్న ఈ సదస్సులో ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తత, అఫ్గానిస్తాన్‌లో శాంతి, వాతావరణ మార్పు.. తదితర ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తారు. సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని ఆండర్స్ రాస్ముసెన్, న్యూజీలాండ్ పీఎం హెలెన్ క్లార్క్, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయి, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, స్వీడన్ మాజీ పీఎం కార్ల్ బ్లిడ్ హాజరయ్యారు.
సదస్సులో డెన్మార్క్‌లో ప్రధాని రాస్ముసెన్ ప్రసంగిస్తూ... ప్రపంచవ్యాప్తంగా నియంత పాలకులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశాలు ఒక అంతర్జాతీయ కూటమి కట్టాలని కోరారు. ఆ కూటమిలో భారత్ కీలకపాత్ర పోషించాలన్నారు. ‘ఈ కూటమిలో భారత్ పాత్ర కీలకం. ప్రధాని మోదీకి నేను అభిమానిని’ అని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ సదస్సు ‘రైజినా డైలాగ్’ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : భారత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తత, అఫ్గానిస్తాన్‌లో శాంతి, వాతావరణ మార్పు వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం
దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న వాణిజ్య యుద్ధానికి విరామమిచ్చే దిశగా అగ్రరాజ్యాలు అమెరికా, చైనా ముందడుగు వేశాయి. తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జనవరి 16న జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ఉపాధ్యక్షుడు లియు హి ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందంతో అమెరికా నుంచి చైనాకు మరింతగా వ్యవసాయోత్పత్తులు, ఆర్థిక సేవల ఎగుమతికి అవకాశం లభించనుంది.
ఒప్పందంలో మేథోహక్కుల పరిరక్షణ, బలవంతపు టెక్నాలజీ బదిలీకి ముగింపు, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సమతౌల్యం పాటించడం, వివాదాల పరిష్కారానికి సమర్థమంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం తదితర అంశాలు ఉన్నాయి.
పోటాపోటీగా సుంకాల పోరు..
చైనాతో భారీ వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు 2018లో ట్రంప్.. వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య సుంకాలపరమైన పోరు కొనసాగుతోంది. అమెరికా ఇప్పటిదాకా సుమారు 360 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాలు విధించింది. చైనా కూడా దానికి తగ్గట్లుగా దాదాపు 110 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలు విధించింది. వాణిజ్య పోరు ప్రభావం.. ఈ రెండు దేశాలకే పరిమితం కాకుండా మిగతా ప్రపంచ దేశాలపై కూడా పడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ఉపాధ్యక్షుడు లియు హి
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా

సోషల్ మొబిలిటీ సూచీలో భారత్‌కు 76వ స్థానం
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయిలకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే ‘సోషల్ మొబిలిటీ సూచీ 2020’లో భారత్‌కు 76వ స్థానం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 82 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో డెన్మార్క్ అగ్రస్థానం నిలిచింది. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో పనిలేకుండా అందరూ పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమాన అవకాశాలు ఏ దేశంలో ఎంత మేర లభిస్తున్నాయన్నది తెలిపేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్య, వైద్యం, టెక్నాలజీ తదితర 5 అంశాల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు.
సోషల్ మొబిలిటీ విషయంలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే అత్యధికంగా లాభపడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ కూడా ఉంటుందని సంబంధిత నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.
సోషల్ మొబిలిటీ సూచీ 2020

ర్యాంకు

దేశం

1

డెన్మార్క్

2

నార్వే

3

ఫిన్‌లాండ్

4

స్వీడెన్

5

ఐస్‌లాండ్

27

అమెరికా

45

చైనా

59

శ్రీలంక

76

భారత్

77

దక్షిణాఫ్రికా

78

బంగ్లాదేశ్

79

పాకిస్థాన్

80

కామెరూన్

81

సెనెగల్

82

కోట్ డి ఐవోరీ

క్విక్ రివ్యూ:
ఏమిటి : సోషల్ మొబిలిటీ సూచీలో భారత్‌కు 76వ స్థానం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)
ఎక్కడ : ప్రపంచంలో

డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు ప్రారంభం
ప్రపంచ దేశాల అధినేతలు, విధానకర్తలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులు హాజరయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 21న ప్రారంభమైంది. జనవరి 24 వరకు జరగనున్న ఈ సదస్సు సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ మాట్లాడారు. వ్యాపార సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఫోరం ఏర్పడిందని, ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని ష్వాబ్ చెప్పారు.
పారదర్శక వాణిజ్యం కోసం కృషి : గోయల్
పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య భాగస్వామ్యాల కోసం భారత్ కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో స్పష్టం చేశారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల్లో వృద్ధికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహకారం మరింత విసృ్తతం కావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్‌సీఈపీ) ప్రస్తుత రూపంలో ఉన్నది భారత్‌కు ఆమోదనీయం కాదన్నారు.
అన్నింటిలోనూ కృత్రిమ మేధస్సు : కేటీఆర్
డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఏఐ పరిజ్ఞానంపై జరిగిన చర్చలో తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడారు. ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ప్రభావానికి లోనుకాకుండా ఏ ఒక్క వ్యాపారమూ ఉండదు. ప్రతి వ్యాపార వ్యూహం, విధాన రూపకల్పనలో ఏఐ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రభుత్వ, ప్రభుత్వేతర, ఐటీ, నాన్ ఐటీ సంస్థలైనా ఏఐను అనుసరించాల్సిందే. మా కార్యక్రమాలన్నింటిలో ఏఐను అంతర్భాగం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం 2020ను ఏఐకు అంకితం చేసింది’ అని కేటీఆర్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 21
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌తో ట్రంప్ సమావేశం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) 50 వార్షిక సమావేశాల్లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో జనవరి 22న వేరుగా సమావేశం అయ్యారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు.. అవసరమైతే బాసటగా ఉంటానంటూ ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశంలో ట్రంప్ తెలిపారు. కశ్మీర్ వివాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ఇమ్రాన్‌కు హామీ ఇచ్చారు. కాగా, కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘కశ్మీర్ అంశం భారత్-పాక్‌కు సంబంధించింది. దీంట్లో ఎవ్వరి ప్రమేయాన్ని అంగీకరించే ప్రశ్నే లేదు’ అని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశం
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
ఎందుకు : వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) 50 వార్షిక సమావేశాల సందర్భంగా

డబ్ల్యూఈఎఫ్ పారిశ్రామిక సభ్య దేశంగా భారత్
ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పునఃనైపుణ్య విప్లవాత్మక కార్యక్రమంలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశంగా చేరింది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి చేయూతగా 2030 నాటికి 100 కోట్ల మందికి మెరుగైన విద్య, నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.

దక్షిణ కొరియా మంత్రితో గోయల్ భేటీ
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సుకు హాజరైన దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూమైంగ్‌హితో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ జనవరి 22న భేటీ అయ్యారు. వీరి మధ్య ద్వైపాక్షిక వాణిజ్య అంశాలు చర్చకు వచ్చాయి. భారతీయ రైల్వే రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అంశంపైనా చర్చ నిర్వహించారు. పలు కంపెనీల సీఈవోలూ సమావేశమయ్యారు.

ఐటీ గవర్నర్ల కమ్యూనిటీ చైర్మన్‌గా విజయ్‌కుమార్
డబ్ల్యూఈఎఫ్ ఐటీ గవర్నర్ల కమ్యూనిటీకి చైర్మన్‌గా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సీ విజయ్‌కుమార్ పనిచేయనున్నారు. ఈ విషయాన్ని డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది.

ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 51వ స్థానం
ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) జనవరి 22న విడుదల చేసిన ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ-2019లో భారత్ 51వ స్థానంలో నిలిచింది. 2018తో పోలిస్తే 2019లో భారత్ పది స్థానాలు దిగజారింది. దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది. ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ అంచనాలను రూపొందించింది. 2018లో ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ భారత్‌కు 7.23 పాయింట్లు ఇవ్వగా 2019కు వచ్చేసరికి 6.90 పాయింట్లు మాత్రమే కేటాయించింది.
భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం..
ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు.. అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను ఈఐయూ రూపొందించింది. ఈ అంశాల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆయా దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ పాయింట్లు), బలహీన ప్రజాస్వామ్యం(6 పాయింట్ల కంటే ఎక్కువ.. 8 లేదా అంతకంటే తక్కువ), మిశ్రమ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ), నియంతృత్వం (4 లేదా అంతకంటే తక్కువ పాయింట్లు). ఇందులో 8 కంటే తక్కువ 6 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం ఉందని తేల్చింది.
ఈఐయూ ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ-2019

ర్యాంకు

దేశం

1

నార్వే

2

ఐస్‌ల్యాండ్

3

స్వీడన్

4

న్యూజిలాండ్

5

ఫిన్‌లాండ్

51

భారత్

52

బ్రెజిల్

69

శ్రీలంక

80

బంగ్లాదేశ్

108

పాకిస్థాన్

134

రష్యా

153

చైనా

163

చాద్

164

సిరియా

165

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

166

రిపబ్లిక్ ఆఫ్ కాంగో

167

ఉత్తరకొరియా

క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 51వ స్థానం
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ)
ఎక్కడ : ప్రపంచంలో

బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. హౌజ్ ఆఫ్ కామన్స్ లో జనవరి 9న జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. దీంతో 2020 జనవరి 31న ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు అవకాశం కలిగింది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు.
వాదోపవాదాలు..
బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోదం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : బ్రిటన్ పార్లమెంటు

విమానాన్ని పొరపాటున కూల్చేశాం : ఇరాన్

ఉక్రెయిన్ విమానాన్ని తాము పొరపాటున కూల్చేశామని ఇరాన్ తెలిపింది. మానవ తప్పిదం కారణంగా పేలిన క్షిపణులు బోయింగ్ 737ను ఢీకొన్నాయని, ఫలితంగా అది కుప్పకూలిపోయి 176 మంది మరణాలకు కారణమైందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ జనవరి 11న ప్రకటించారు. ఈ సంఘటన క్షమించరాని తప్పిదం అని అంగీకరించారు. తాము జరిపిన సైనిక విచారణలో తప్పిదం విషయం తెలిసిందని చెప్పారు. ఇరాన్ ఒప్పుకోలుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేయగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్‌స్కీ బాధ్యులను శిక్షించాలని, మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరారు.
2020, జనవరి 8న టెహ్రాన్‌లోని ఎయిర్‌పోర్ట్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయలుదేరిన ఉక్రెయిన్ ప్రయాణికుల విమానం టేకాఫ్ తీసుకున్న రెండు నిమిషాల్లో కూలడం, అందులోని 176 మంది మరణించడం తెల్సిందే. అయితే ఈ ప్రమాదానికి తమకు సంబంధం లేదని ఇరాన్ ఇన్నిరోజులూ చెప్పింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉక్రెయిన్ విమానాన్ని తాము పొరపాటున కూల్చేశాం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ

ఖతార్ ఎమిర్‌తో ఇరాన్ అధ్యక్షుడు భేటీ
ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానితో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భేటీ అయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జనవరి 13 జరిగిన ఈ సమావేశంలో ప్రాంతీయంగా నెలకొన్న సంక్షోభం, ఉద్రిక్తతల గురించి ఇరువురు నేతలు చర్చించారు. అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గాలనే తాము కోరుకుంటున్నామని రౌహానీ ప్రకటించారు. అయితే, అగ్రరాజ్యంతో చర్చలు మాత్రం అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసిన తరువాతేనని స్పష్టం చేశారు. ‘ఉద్రిక్తతలు తగ్గేందుకు, చర్చలు జరిగేందుకు అంతా కృషి చేయాలి. అదొక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారం’ అని ఖతార్ ఎమిర్ వ్యాఖ్యానించారు. ఖతార్ అమెరికాకు, ఇరాన్‌కు నమ్మకమైన మిత్రదేశం. ఈ ప్రాంతంలో అమెరికా అతి పెద్ద మిలటరీ బేస్ ఖతార్‌లోనే ఉంది.
అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి
ఇరాక్‌లోని అమెరికా సైనికులున్న స్థావరం లక్ష్యంగా ఇరాన్ మళ్లీ దాడికి దిగింది. బాగ్దాద్‌కు 80 కి.మీ.ల దూరంలోని అల్ బలాద్ వైమానిక దళ స్థావరంపై జనవరి 13న 8 ‘కాట్యూషా’ తరహా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో ఇరాక్ సైన్యానికి చెందిన ఇద్దరు అధికారులు, ఇద్దరు ఎయిర్‌మెన్ గాయపడ్డారు. అల్ బలాద్ ఇరాక్ ఎఫ్ 16 యుద్ధ విమానాల ప్రధాన కేంద్రం. ఇక్కడ అమెరికా వైమానిక దళానికి చెందిన చిన్న బృందం, కొందరు అమెరికా కాంట్రాక్టర్లు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానితో భేటీ
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ
ఎక్కడ : టెహ్రాన్, ఇరాన్
ఎందుకు : ప్రాంతీయంగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో

అమెరికా దాడుల్లో ఇరాన్ జనరల్ సులేమాని మృతి
ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు. బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో జనవరి 3న సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించారు.
2018లో అమెరికా ఇరాన్‌తో అణుఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది.
ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్
విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్ అల్ ఖుద్‌‌స చీఫ్ జనరల్ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాక్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకి, వేలాది మంది అమెరికన్ సిబ్బంది మృతికి సులేమాని కారకుడన్నారు.
ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్
సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు. ఇస్మాయిల్ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్‌‌స బలగాల చీఫ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్ రౌహని హెచ్చరించారు.
మరో యుద్ధం భరించలేం: ఐరాస
గల్ఫ్‌లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ వ్యాఖ్యానించారు. సులేమాని మృతి నేపథ్యంలో గ్యుటెరస్ పై విధంగా స్పందించారు.
ఎవరీ ఖాసీం సులేమాని?
1955లో ఇరాన్‌లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో సులేమాని 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రివ్యల్యూషనరీ గార్డ్‌లో చేరారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో కీలకమైన నిఘా విభాగం అయిన ఖుద్‌‌స ఫోర్స్‌కి 1998 ఏడాది నుంచి సులేమాని మేజర్ జనరల్‌గా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడానికి, దానిని బలమైన దేశంగా నిలపడానికి చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఇరాన్ సుప్రీం నాయకుడు తర్వాత దేశంలో అంతటి శక్తిమంతుడిగా సులేమానికి పేరుంది. విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించడంలో దిట్ట అయిన సులేమాన్‌ను ఇరాన్ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 2017లో టైమ్ మ్యాగజైన్ ఆయనని అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చింది. మరోవైపు ఎన్నో దేశాల్లో మిలటరీ దాడుల వ్యూహకర్త అయిన సులేమానిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ మృతి
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ఖాసీం సులేమాని
ఎక్కడ : బాగ్దాద్ విమానాశ్రయం, ఇరాక్
ఎందుకు : అమెరికా క్షిపణి దాడుల కారణంగా

లిబియాలో వైమానిక దాడి
లిబియా రాజధాని ట్రిపోలీలోని సైనిక శిక్షణ కేంద్రంపై జనవరి 4న వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 30 మంది మృతి చెందగా మరో 33 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులేనని లిబియా అధికారులు వెల్లడించారు. లిబియన్ నేషనల్ ఆర్మీ(ఎల్‌ఎన్‌ఏ) చీఫ్‌గా ప్రకటించుకున్న జనరల్ ఖలీఫా హిఫ్తర్, ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొనసాగుతున్న ప్రభుత్వంపై దాడులు ఉధృతం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లిబియా సైనిక శిక్షణ కేంద్రంపై వైమానిక దాడి
ఎప్పుడు : జనవరి 4
ఎక్కడ : ట్రిపోలీ, లిబియా

ఇరాన్, అమెరికాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు
ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ జనవరి 4న ట్రంప్ ట్వీట్ చేశారు. చాన్నాళ్ల క్రితం 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టిన ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ట్రంప్ నిర్ధారించారని యూఎస్ రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జనవరి 3న అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్‌‌స ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన చేసింది.
ఇది యుద్ధ నేరం : ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘పశ్చిమాసియాలో అమెరికా ద్వేషపూరిత ఉనికి అంతమయ్యేందుకు ఇదే ప్రారంభం. సాంస్కృతిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామనడం యుద్ధ నేరం కిందకు వస్తుంది. మా మిలటరీ ఉన్నతాధికారిని దొంగదెబ్బ తీసి చంపడం పిరికి చర్య. అది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్ ట్వీట్ చేశారు. తమతో యుద్ధం ప్రారంభించే ధైర్యం అమెరికాకు లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి వ్యాఖ్యానించారు.
ఇరాక్ నుంచి యూఎస్ బలగాలు వెనక్కు
తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు పంపాలని ఇరాక్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఐఎస్‌పై పోరులో సాయపడేందుకు ఇరాక్‌లో 5,200 మంది అమెరికా సైనికులున్నారు.
కెన్యా బేస్‌పై దాడి
కెన్యా తీరంలోని అమెరికా, కెన్యా సైనికులున్న స్థావరంపై సొమాలియాకు చెందిన అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ జనవరి 5న దాడి చేసింది. ఈ దాడిని తిప్పికొట్టి నలుగురిని హతమార్చామని కెన్యా దళాలు తెలిపాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రికి జైశంకర్ ఫోన్
యూఎస్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జనవరి 4న ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్‌తో మాట్లాడారు. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఆయనకు వివరించారు.

సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి: యునెస్కో
అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న తరుణంలో ఇరుదేశాలకు యునెస్కో జనవరి 6న కీలక సూచన చేసింది. దేశాల్లోని చారిత్రాత్మక, సాంస్కృతిక కట్టడాలను ఇరు దేశాలు పరిరక్షించాలని కోరింది. ఈ మేరకు యునెస్కో డెరైక్టర్ జనరల్ ఆడ్రే అజౌల్ ఇరాన్ దౌత్యవేత్తతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇరాన్, అమెరికాలు 1972లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం సాంస్కృతిక కట్టడాలకు ఎటువంటి నష్టం చేకూర్చకుండా ఉండాలని చెప్పారు. అమెరికా బలగాలపై దాడులు చేస్తే ఇరాన్‌లోని నిర్దిష్ట ప్రాంతాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : యునెస్కో డెరైక్టర్ జనరల్ ఆడ్రే అజౌల్
ఎందుకు : అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న తరుణంలో

యురేనియం నిల్వలను పెంచుకుంటాం : ఇరాన్
ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో 2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పట్టించుకోబోమని జనవరి 6న ఇరాన్ ప్రకటించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని, ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విసృ్తతం చేస్తామని తెలిపింది. అణ్వాయుధాలను తయారు చేయబోమన్న మునుపటి హామీకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. 2018లో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో ఈ ఒప్పందం అమలు ప్రమాదం పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ తలకు రూ.575 కోట్లు
ఇరాన్ జనరల్ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలకు ఇరాన్ వెలకట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు రూ.575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. ఇరాన్‌లోని 8 కోట్ల మంది పౌరుల నుంచి ఒక్కో అమెరికా డాలర్(సుమారు రూ.71.79) చొప్పున రూ.575 కోట్లు చందాగా వసూలు చేసి ట్రంప్‌ను చంపిన వారికి అందజేస్తామని తెలిపింది.

క్రొయేషియా అధ్యక్ష ఎన్నికల్లో మిలనోవిక్ విజయం
క్రొయేషియా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో క్రొయేషియా మాజీ ప్రధాని, సోషల్ డెమోక్రట్ పార్టీ నేత జోరన్ మిలనోవిక్ విజయం సాధించారు. జనవరి 6న వెల్లడైన ఫలితాల ప్రకారం.. మిలనోవిక్‌కు 52.7 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన సమీప రాజకీయ ప్రత్యర్థి, సిట్టింగ్ ప్రెసిడెంట్ కొలిండా గ్రాబర్ కిటారోవిక్‌కు 47.3శాతం ఓట్లు వచ్చాయి. మితవాద భావజాలమున్న కిటారోవిక్ కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 40 లక్షలకు పైగా జనాభా కలిగిన క్రొయేషియా 1991లో స్వతంత్య్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రొయేషియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : జోరన్ మిలనోవిక్

కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో-2020 ప్రారంభం
అమెరికాలోని లాస్ వెగాస్‌లో జనవరి 7న ‘2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)’ ప్రారంభమైంది. పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను సీఈఎస్‌లో ప్రదర్శనకు ఉంచాయి.
శాంసంగ్ డిజిటల్ అవతార్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సీఈఎస్‌లో కృత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే ‘డిజిటల్ మనిషి’(డిజిటల్ అవతార్)ని ఆవిష్కరించింది. నియోన్ అనే ఈ టెక్నాలజీతో డిజిటల్ అవతార్‌లను సృష్టించవచ్చని, డిస్‌ప్లేలు లేదా వీడియో గేమ్స్‌లో ఉపయోగించవచ్చని శాంసంగ్ తెలిపింది. డిజిటల్ అవతార్ మనుషుల్లాగే సంభాషించడం, భావాలను వ్యక్తపర్చడం వంటివి చేయగలదని పేర్కొంది.
ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారు
హాలీవుడ్ సినిమా అవతార్ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారును మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. ఈ అటానమస్ వాహనంలో స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివి ఉండవు. సెంటర్ కన్సోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
ఎయిర్ ట్యాక్సీలను ఎస్-ఏ1
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్ ట్యాక్సీలను ఎస్-ఏ1 పేరిట ఆవిష్కరించింది. విద్యుత్‌తో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే ప్రాంతాలకు నడిపే ట్యాక్సీ సర్వీసుల కోసం వీటిని వినియోగించేందుకు హ్యుందాయ్‌తో ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) ప్రారంభం
ఎప్పుడు : జనవరి 7
ఎక్కడ : లాస్ వెగాస్, అమెరికా
ఎందుకు : ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థల నూతన ఉత్పత్తుల ప్రదర్శనకు

యూఎస్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ దాడి
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జనవరి 7న క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా సైనికులు, సంకీర్ణ దళాలు ఉన్న అల్ అసద్, ఇర్బిల్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని అమెరికా చంపినందుకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ అధికార టీవీ పేర్కొంది. దాడిలో ఇరాకీ సైనికులకు గాయాలు కాలేదని ఇరాక్ మిలటరీ వెల్లడించింది.
తాజా దాడి అమెరికాకు చెంపపెట్టులాంటిదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ‘అమెరికాకు భయపడి వెనక్కువెళ్లబోం’ అని ఈ దాడి ద్వారా స్పష్టం చేశామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ స్పష్టం చేశారు.
కొంత నష్టం : ట్రంప్
ఇరాన్ క్షిపణి దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని, తమ మిలటరీ స్థావరాలకు కొంత నష్టం మాత్రం వాటిల్లిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 8న వెల్లడించారు. శాంతిని కోరుకునే అందరితో శాంతియుత సంబంధాలనే కోరుకుంటామన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థను నిర్మూలించేందుకు కలసిరావాలని ఇరాన్‌ను కోరారు. దీంతో, తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు కొంతమేరకు చల్లబడ్డాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ఇరాన్
ఎక్కడ : అల్ అసద్, ఇర్బిల్ మిలటరీ స్థావరాలు

ఇరాన్‌లో కూలిన ఉక్రెయిన్ పౌర విమానం
అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్‌లో ఓ విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ కి చెందిన పౌర విమానం బోయింగ్ 737 టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 176 మంది మృతి చెందారు. ఈ విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇరాన్‌కి చెందినవారు 82 మంది, కెనడా దేశస్తులు 63 మంది ఉన్నారు.
కూలిపోయిందా ? కూల్చేశారా ?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం సాగుతోంది. ఇరాన్ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని ప్రచారం మొదలైంది.

ఆస్ట్రేలియాలో పదివేల ఒంటెల కాల్చివేత
ఆస్ట్రేలియాని విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలో కరువు కరాళనృత్యం చేస్తోంది. కరువు నెలకొన్న ప్రాంతంలో ఒంటెల సంఖ్య అధికంగా ఉంది. ఇవి అధికంగా నీరు తాగుతున్నాయి. దీని కారణంగా కరువు ప్రాంతంలో తీవ్ర నీటి కోరత నెలకొంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పదివేల ఒంటెలను కాల్చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ పొందిన షూటర్లతో హెలికాప్టర్ల నుంచి కాల్చడం ద్వారా ఒంటెల సామూహిక హనన కార్యక్రమం చేపట్టనుంది. నీళ్లకోసం వెంపర్లాడుతున్న ఒంటెలు గుంపులుగా మానవ ఆవాసాల వద్దకు వచ్చేస్తున్నాయని, ఫలితంగా అక్కడి గిరిజన తెగల ప్రజలకు ముప్పు ఏర్పడుతోందని ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాను కార్చిచ్చు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్చిచ్చు కారణంగా కంగారూలు, కోలాలు, అడవి గొర్రెలు, వివిధ రకాల పక్షులు లక్షలాదిగా ప్రాణాలు కోల్పోయాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పదివేల ఒంటెల కాల్చివేత
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : ఆస్ట్రేలియా ప్రభుత్వం
ఎక్కడ : దక్షిణ ఆస్ట్రేలియా
ఎందుకు : కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు























































































































































































































#Tags