Make in India: ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కి పదేళ్లు.. దీంతో పెరిగిన ఎగుమతులు

‘మేక్‌ ఇన్‌ ఇండియా’ (భారత్‌లో తయారీ)తో భారత్‌ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

తయారీకి భారత్‌ను కేంద్రంగా మలిచే లక్ష్యంతో 2014 సెప్టెంబర్‌ 25న మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు ప్రారంభించింది. పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా దీనిపై ‘ఎక్స్‌’లో ప్రధాని ఓ పోస్ట్‌ పెట్టారు. 
 
‘వివిధ రంగాల్లో ఎగుమతులు ఎలా పెరిగాయన్నది గమనించాలి. సామర్థ్యాలు ఏర్పడ్డాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. సాధ్యమైన అన్ని విధాలుగా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంస్కరణల విషయంలో భారత పురోగతి సైతం కొనసాగుతుంది’ అని తన పోస్ట్‌లో ప్రధాని పేర్కొన్నారు. 

మేక్‌ ఇన్‌ ఇండియాకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద 14 రంగాల్లో అదనపు సామర్థ్యాలపై ప్రోత్సాహకాలు కల్పించడం గమనార్హం. నిబంధనల అమలు, ఎఫ్‌డీఐ విధానాలు సులభంగా మార్చడం, మెరుగైన వ్యాపార వాతావరణానికి సంబంధించి సానుకూల చర్యలు ఇందుకు మద్దతుగా నిలిచినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

దీనికితోడు అవినీతి పట్ల కఠిన వైఖరి, ఎల్రక్టానిక్స్‌ తదితర వర్ధమాన రంగాల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం మేక్‌ ఇన్‌ ఇండియా విజయవంతానికి, దేశ, విదేశీ పెట్టుబడులు పెరగడానికి సాయపడినట్టు చెప్పారు. ‘మనం గొప్ప విజయం సాధించాం. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో దేశంలో తయారీకి అద్భుతమైన భవిష్యత్‌ ఉంది’ అని గోయల్‌ పేర్కొన్నారు.

India Growth: మూడో భారీ ఎకానమీ దిశగా భారత్‌!

తయారీ వాటా పెరుగుతుంది..
మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ వాటా పెరుగుతుందని మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. దేశ అవసరాలు తీర్చడంతోపాటు ఎగుమతులు 2023–24లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 778 బిలియన్‌ డాలర్లకు చేరుకునేలా ఈ కార్యక్రమం సాయపడినట్టు మంత్రి తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి గోయల్‌ తెలిపారు. గడిచిన పది ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐ రాక, అంతకుముందు పదేళ్ల (యూపీఏ హయాం) కాలంతో పోల్చి చూస్తే 119 శాతం పెరిగి 667 బిలియన్‌ డాలర్లకు చేరుకుందన్నారు.

100 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు
‘ఏటా 70–80 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏటా 100 బిలియన్‌ డాలర్లకు పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’ అని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్‌ సింగ్‌ భాటియా సైతం ప్రకటించారు. ఎఫ్‌డీఐ దరఖాస్తుల అనుమతుల ప్రక్రియను గాడిలో పెడుతున్నట్టు చెప్పారు. దేశంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలుగా రక్షణ, రైల్వేలు, బీమా, టెలికం తదితర రంగాలకు సంబంధించి నిబంధనలను సరళతరం చేసినట్టు తెలిపారు.

Asia Power Index: శక్తిమంతంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్‌కు మూడో స్థానం

#Tags