ఒకే టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత ఆర్చర్?

టోక్యో ఒలిపింక్స్‌కు ముందు పాల్గొంటున్న చివరి టోర్నమెంట్లో భారత మహిళా మేటి ఆర్చర్ దీపిక కుమారి అదరగొట్టింది.
ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జూన్‌ 27న ముగిసిన ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నమెంట్‌లో దీపిక ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఐదు గంటల వ్యవధిలో దీపిక నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటా విజయం సాధించింది.

ముందుగా తన భాగస్వాములు అంకిత భకత్, కోమలిక బరిలతో కలిసి మహిళల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో పసిడి పతకం దక్కించుకున్న 27 ఏళ్ల దీపిక మిక్స్‌డ్‌ విభాగంలో తన భర్త అతాను దాస్‌తో కలిసి విజేతగా నిలిచింది. అనంతరం వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలోనూ దీపిక అద్భుతంగా రాణించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ఒకే ప్రపంచకప్‌ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.

రికర్వ్‌ టీమ్‌ ఫైనల్లో...
  • అనా వాజ్‌క్వెజ్, ఐదా రోమన్, వలెన్సియాలతో కూడిన మెక్సికో మహిళల జట్టుతో జరిగిన రికర్వ్‌ టీమ్‌ ఫైనల్లో దీపిక, అంకిత, కోమలికలతో కూడిన భారత బృందం 5–1తో నెగ్గింది.
  • రికర్వ్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో దీపిక కుమారి–అతాను దాస్‌ జంట 5–3తో గ్యాబీ ష్కాలెసర్‌–ఎస్జెఫ్‌ వాన్‌ డెన్‌ బెర్గ్‌ (నెదర్లాండ్స్‌) జోడీని ఓడించింది.
  • మహిళల రికర్వ్‌ వ్యక్తిగత ఫైనల్లో దీపిక 6–0తో ఎలెనా ఒసిపోవా (రష్యా)పై గెలిచి విజేతగా నిలిచింది.

ప్రపంచ నంబర్‌ 1 ర్యాంకు కైవసం...

తాజా విజయాల నేపథ్యంలో... దీపిక ర్యాంకింగ్‌ గణనీయంగా మెరుగైంది. జూన్‌ 28న ప్రపంచ ఆర్చరీ సంఘం ప్రకటించిన... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దీపిక కుమారి అగ్ర స్థానంలో నిలిచి నంబర్‌ వన్‌ ర్యాంకును కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో దీపిక సాధించిన మొత్తం పతకాల సంఖ్య 35. ఇందులో 11 స్వర్ణాలు, 16 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. 2012లోనే ఆమె నంబర్‌వన్‌గా అవతరించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఒకే టోర్నీలో మూడు స్వర్ణాలు(వ్యక్తిగత, బృంద, మిక్స్‌డ్‌ విభాగాలు) సాధించిన తొలి భారత ఆర్చర్‌?
ఎప్పుడు : జూన్‌ 27
ఎవరు : దీపిక కుమారి
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్‌






#Tags