Daily Current Affairs in Telugu: ఏప్రిల్‌ 4, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu April 4th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

CBI Diamond Jubilee: సీబీఐ వజ్రోత్సవ వేడుకలు.. న్యాయానికి తిరుగులేని బ్రాండ్‌ అంబాసిడర్‌ సీబీఐ 

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఏర్పాటై 60 సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా ఏప్రిల్ 3వ తేదీ ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో వజ్రోత్సవ వేడుక‌లు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనాసరే కర్తవ్య దీక్షలో ముందడుగువేసి పోరాడాలని సీబీఐ అధికారులకు మోదీ క‌ర్తవ్యబోధ చేశారు. ‘ప్రజాస్వామ్యం, న్యాయాలకు అవినీతే అతిపెద్ద అవరోధం. అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన బాధ్యత సీబీఐ పైనే ఉంది. అవినీతిపరులను వదలొద్దని ప్రజలు కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా అవినీతితో లబ్ధిపొందిన నేతలు నేడు ఏకంగా సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపైనే విమర్శలు చేసే పరిస్థితులు సృష్టించారు. పక్కదోవ పట్టించే వీళ్లను పట్టించుకోకుండా విధి నిర్వహణపై దృష్టిపెట్టండి. మన ప్రయత్నంలో అలసత్వం, నిర్లక్ష్యం వద్దు. ఇదే దేశం, దేశ ప్రజలు కోరుకునేది. దేశం, చట్టం, రాజ్యాంగం మీ వెన్నంటే ఉన్నాయి’ అని అధికారులకు భరోసా ఇచ్చారు.

PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?


అందరి నోటా సీబీఐ
‘ఏదైనా కేసు సంక్షిష్టంగా, సమస్యాత్మకంగా ఉందంటే పరిష్కారం కోసం ప్రజల నోట వినిపించే ఒకే ఒక పేరు సీబీఐ. 60 ఏళ్లుగా న్యాయం, సత్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సీబీఐ నిలుస్తోంది. పంచాయతీ స్థాయిలో జరుగుతున్న ముఖ్య నేరాలనూ సీబీఐకి అప్పజెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవినీతి చిన్నదిగా కనిపించొచ్చు. కానీ అది పేదల హక్కులను లాగేసుకుంటుంది. కొత్తగా ఎన్నో నేరాలకు అంటుకడుతుంది’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్స్‌ను, చక్కని దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులకు బంగారు పతకాలను ప్రధాని ప్రదానం చేశారు. స్మారక తపాలా బిళ్ల, నాణేలను ఆవిష్కరించారు. కాగా ఏప్రిల్‌ 1, 1963న సీబీఐ ఏర్పాటైంది.

Assembly Elections: దేశంలో తొలిసారి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం.. ఎవరెవరికంటే?

Money Laundering: ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసిన ఈడీ 
దేశంలో అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసింది. వీరిలో పలు కార్పొరేట్‌ సంస్థల డైరెక్టర్లున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఏప్రిల్ 3న‌ లోక్‌సభకు ఈ మేరకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ‘కార్పొరేట్‌ మోసాలకు సంబంధించి స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తదితరులపై ఈడీ కేసులు పెట్టింది. రూ.33,862.20 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. వీటిలో రూ.15,113 కోట్ల ఆస్తులను ప్రభుత్వ బ్యాంకులు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈడీ అప్పగించిన ఆస్తులను ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టీయం విక్రయించి రూ.7,975.27 కోట్లు ఆర్జించింది’ అని మంత్రి వివరించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Twitter Logo: పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్‌ లోగోను మార్చిన మస్క్!
ఎలాన్ మస్క్ ట్విటర్ లోగోను మార్పు చేశాడు.  ఏప్రిల్‌ 3న ఇప్పటి వరకూ ఉన్న పక్షి (బ్లూబర్డ్‌) లోగోకు బ‌దులుగా కుక్క (డాగీ) లోగోను పెట్టాడు. అయితే ఇది మొబైల్‌ యాప్‌లో కాదు. డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మాత్రమే.. ట్విటర్‌ వెబ్‌సైట్‌లో హోం బటన్‌గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డాగీ కాయిన్‌ (Dogecoin) క్రిప్టోకరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్‌ ప్రత్యక్షమైంది. దీన్ని గమనించిన యూజర్లు అవాక్కయ్యారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్‌ లోగోలో ఉపయోగించిన డాగీ (షిబా ఇను డాగ్) చిత్రం చాలా కాలంగా అనేక వైరల్ మీమ్స్‌లో కనిపిస్తోంది. 
ట్విటర్‌ లోగో మార్పుపై ఎలాన్‌ మస్క్‌ తనదైన శైలిలో ఓ హాస్యభరితమైన మీమ్‌ను జోడిస్తూ ట్విటర్‌లో షేర్‌ చేశారు. అలాగే 2022 మార్చి 26 నాటి తన ట్విటర్‌ చాట్‌ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. అందులో ఓ అజ్ఞాత యూజర్‌ ట్విటర్‌ బర్డ్ లోగోను ‘డాగ్’గా మార్చమని అడగ్గా దానికి మస్క్‌ సరే అని బదులిచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు. 
క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్‌ను నిర్వహిస్తున్నారని ఎలాన్‌ మస్క్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. మస్క్‌ ట్విటర్ లోగోను డాగీ లోగోగా మార్చిన తర్వాత డాగీకాయిన్‌ విలువ 20 శాతం వరకు పెరిగింది.

Elon Musk: మ‌రోసారి నంబ‌ర్ 1 స్థానానికి చేరుకున్న మ‌స్క్‌... అదానీ స్థానం ఎక్క‌డో తెలుసా..?

Daniil Medvedev: మయామీ ఓపెన్‌ విజేతగా మెద్వెదెవ్‌.. ఈ ఏడాది నాలుగో ఏటీపీ టైటిల్‌..   
రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ఈ ఏడాది తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ నాలుగో ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నీలో మెద్వెదెవ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 7–5, 6–3 స్కోరుతో జనిక్‌ సిన్నర్‌ (ఇటలీ)ని ఓడించాడు. 1 గంటా 34 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్‌ 9 ఏస్‌లు కొట్టగా, సిన్నర్‌ 6 ఏస్‌లు బాదాడు. రష్యా ఆటగాడు 6 డబుల్‌ ఫాల్ట్‌లు చేసినా ఆ ప్రభావం ఫలితంపై పడకుండా సత్తా చాటడం విశేషం. 2023లో 24 మ్యాచ్‌లలో గెలిచి ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిన మెద్వెదెవ్‌ ఖాతాలో ఇది నాలుగో టైటిల్‌ కాగా ఓవరాల్‌గా ఐదో ఏటీపీ మాస్టర్స్‌ టైటిల్‌.

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే..

ATP Rankings: ఏటీపీ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్‌  
ఏటీపీ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మళ్లీ తన అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఏప్రిల్ 3వ తేదీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇటీవ‌ల అతను తన టాప్‌ ర్యాంక్‌ను కోల్పోగా స్పెయిన్‌కు చెందిన అల్‌కరాజ్ నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచాడు. అయితే మయామీ ఓపెన్‌లో అల్‌కరాజ్‌ సెమీస్‌లోనే ఓడటంతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. జొకోవిచ్‌ కెరీర్‌ నంబర్‌వన్‌గా ఇది 381వ వారం కావడం విశేషం.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

స్పైస్‌జెట్‌ కార్గో, లాజిస్టిక్స్‌ విభాగం విడదీత 
విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ తమ కార్గో, లాజిస్టిక్స్‌ వ్యాపార విభాగం స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక విభాగంగా విడదీసింది. ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లాజిస్టిక్స్‌ వ్యాపార విభాగం స్వతంత్రంగా నిధులను సమీకరించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. 2022–23 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య వ్యవధిలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ రూ.51 కోట్ల నికర లాభం నమోదు చేసింది. డీల్‌ ప్రకారం స్పైస్‌జెట్‌కు స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ రూ.2,556 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు జారీ చేయనుంది. కార్లైల్‌ ఏవియేషన్‌ పార్ట్‌నర్‌ చెల్లించాల్సిన 100 మిలియన్‌ డాలర్ల రుణాన్ని గత నెల పునర్‌వ్యవస్థీకరించుకున్నామని అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. తాజాగా లాజిస్టిక్స్‌ విభాగం విడదీతతో స్పైస్‌జెట్‌ బ్యాలెన్స్‌ షీటు మరింత పటిష్టంగా మారగలదని, కంపెనీ నెగటివ్‌ నికర విలువ భారం గణనీయంగా తగ్గగలదని ఆయన వివరించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Direct Tax Collection: 2022–23లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.61 లక్షల కోట్లు 
భారత్‌ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 18 శాతం పెరిగి, రూ.16.61 లక్షల కోట్లకు ఎగశాయి. ఆర్థిక శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2021–22లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.12 లక్షల కోట్లు. రిఫండ్స్‌ను సర్దుబాటు చేయకుండా స్థూలంగా చూస్తే, పన్ను వసూళ్లు రూ.19.68 లక్షల కోట్లని ఆర్థికశాఖ వివరించింది. వీటిలో నుంచి మార్చి 31 వరకూ రూ.3.07 లక్షల కోట్ల రిఫండ్స్‌ జరిగాయి. 

UPI Payments: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. కానీ వారికి మాత్రం..

ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ప్రారంభం.. 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. 3, 5, 6 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ మహావీర్‌ జయంతి సందర్భంగా సెలవు. ఈ సమావేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్‌ 8, ఆగస్టు 5, సెప్టెంబర్‌ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్‌ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. 

Richard Verma: అమెరికా ప్ర‌భుత్వంలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

 

#Tags