నవంబర్ 2018 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు ఒప్పందాలు
పరస్పర సహకారాన్ని పెంచుకునే లక్ష్యంతో భారత్, ఆస్ట్రేలియా దేశాలు ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో నవంబర్ 22న సంబంధిత పత్రాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. దివ్యాంగులకు సేవలందించడం, పెట్టుబడులు, శాస్త్రీయ తోడ్పాటు-నవకల్పనలు, సంయుక్త పీహెచ్‌డీ, వ్యవసాయ పరిశోధనలు-విద్య అంశాలకు సంబంధించి ఈ ఒప్పందాలు చేసుకున్నాయి.
గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెర్త్‌లోని వెస్టర్న్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం మధ్య వ్యవసాయ పరిశోధనలు-విద్య అంశంలో పరస్పరం సహకారానికి ఉద్దేశించిన ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్‌తో సమావేశమైన కోవింద్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. సిడ్నీలో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు ఒప్పందాలు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్- ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్
ఎక్కడ : సిడ్నీ, ఆస్ట్రేలియా

సింగపూర్ రక్షణ మంత్రితో నిర్మలా సమావేశం
సింబెక్స్ నావికా విన్యాసాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సింగపూర్ రక్షణ మంత్రి ఎంగ్ ఇంగ్ హెన్‌తో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రంలో నవంబర్ 20న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్, సింగపూర్ రక్షణ బంధం మరింత దృఢమయ్యేందుకు దోహదపడే డిఫెన్స్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(డీసీఏ)పై ఇరుదేశాల రక్షణ మంత్రులు సంతకాలు చేశారు. పాతికేళ్ల ద్వైపాక్షిక బంధానికి ప్రతీకగా సింబెక్స్-2018 పేరుతో భారత్, సింగపూర్ దేశాలు విశాఖతీరంలో నావికా విన్యాసాలను నిర్వహించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగపూర్ రక్షణ మంత్రి ఎంగ్ ఇంగ్ హెన్‌తో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం
ఎప్పుడు : నవంబర్ 20
ఎక్కడ : తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

యుద్ధనౌకలపై భారత్, రష్యా మధ్య ఒప్పందం
భారత నావికా దళంకోసం దాదాపు రూ.3,500 వేల కోట్ల ఖర్చుతో రెండు యుద్ధ నౌకలు నిర్మించేలా భారత్-రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రక్షణ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, రష్యా ప్రభుత్వ రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థలు నవంబర్ 20న ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందంలో భాగంగా భారత్‌లో 2 యుద్ధనౌకల నిర్మాణం కోసం జీఎస్‌ఎల్‌కు డిజైన్లు, సాంకేతికత, ఇతర పరికరాలను రష్యా సరఫరా చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యుద్ధనౌకలపై భారత్, రష్యా మధ్య ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, రష్యా ప్రభుత్వ రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థలు

సింగపూర్ ప్రధాని లీ సీన్‌తో మోదీ భేటీ
ఆసియాన్-ఇండియా సదస్సుకు హాజరయ్యేందుకు రెండు రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 14న సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సాంకేతికత, ప్రాంతీయ అనుసంధానత, ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై ఇరుదేశాల నేతలు చర్చించారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-ఓ-చాలతోనూ మోదీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగపూర్ ప్రధాని లీ సీన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
ఎప్పుడు : నవంబర్ 14
ఎక్కడ : సింగపూర్

ఇండియా-జింబాబ్వే బిజినెస్ ఫోరంలో ఉపరాష్ట్రపతి
జింబాబ్వే రాజధాని హరారేలో నవంబర్ 3న నిర్వహించిన ఇండియా-జింబాబ్వే బిజినెస్ ఫోరం సదస్సులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. భారతదేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని, తమ దేశంలో వ్యాపార వాతావరణం నానాటికీ మెరుగుపడుతోందని ఈ సందర్భంగా ఆయన ఉపరాష్ట్రపతి అన్నారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అభివృద్ధి పధం ప్రయోజనాలను పొందాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా-జింబాబ్వే బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : వెంకయ్యనాయుడు
ఎక్కడ : హరారే, జింబాబ్వే






























#Tags