ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ: ఉన్నత విద్యామండలి

అనంతపురం విద్య: విద్యార్థుల్లో ఆధునిక సాంకేతికత, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరిచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.
పరిశ్రమలు, ఇతర సంస్థల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవతో ఆధునిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) సహకారంతో వృత్తి విద్య, నైపుణ్య సర్టిఫికెట్‌ కోర్సులను అందించనుంది. ఈ తరహా కోర్సులను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం. ఈ శిక్షణను జేఎన్‌టీయూ(ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే వారు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ క్రమంలోనే జేఎన్‌టీయూ(ఏ)పరిధిలోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ విద్యార్థులు 40వేల మంది ఈ కోర్సులకు నమోదు చేయించుకున్నారు.

చదవండి: 1,62,000 మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ నైపుణ్య శిక్షణ

అధ్యాపకులకూ అవకాశం
ఏఐసీటీఈ, నాస్కామ్‌ సహకారంతో ప్రవేశపెట్టిన వృత్తి, ఉద్యోగ నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో కేవలం విద్యార్థులకే కాకుండా అధ్యాపకులకు సైతం శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం https://lifeskillsprime.in/ (లైఫ్‌స్కిల్స్‌ప్రైమ్‌.ఇన్‌) వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి రిజిష్టర్‌ చేసుకోవచ్చు. నేరుగా వారివారి గూగుల్‌ అకౌంట్‌ ద్వారా వెబ్‌పేజీలోని ఆయా కోర్సులను క్లిక్‌ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో అభ్యసన పూర్తి చేయవచ్చు. అయితే ప్రతి కోర్సులోనూ వారి అభ్యసన ఫలితాలను, నైపుణ్యాలను గుర్తించేందుకు తుది పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. అభ్యసన సమయంలో అభ్యాసకుడికి సహాయపడేందుకు ‘మై గైడ్‌’ ఆప్షన్‌ కింద నిపుణుడైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఏఐసీటీఈ– నాస్కామ్‌ ధ్రువీకరణతో సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ప్రతి కోర్సులోనూ నిర్దేశించిన కాలంలో వారు సాధించిన నైపుణ్యాలు, ప్రమాణాల ఆధారంగా క్రెడిట్లు ఇస్తారు. ఈ క్రెడిట్లు విద్యార్థుల రెగ్యులర్‌ కోర్సులకు కలుపుతారు. ఫలితంగా విద్యార్థుల అకడమిక్‌ క్రెడిట్లు మరింత పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ కోర్సులు అభ్యసించాలనుకునే ఆసక్తి ఉన్న వారు ఈ ఏడాది జూన్‌ 21 లోపు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
శిక్షణ ఇచ్చే ప్రొఫెషనల్‌ కోర్సులు ఇవే..
  •  ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌
  •  బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ
  •  బిగ్‌డేటా అనాలసిస్‌
  •  సైబర్‌ సెక్యూరిటీ
  •  క్లౌడ్‌ కంప్యూటింగ్‌
  •  ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌
  •  రోబోటెక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌
  •  వెబ్‌ మొబైల్‌ డెవలప్‌మెంట్‌
  • మార్కెటింగ్‌ వర్చువల్‌ రియాలటీ
  •  3డీ ప్రింటింగ్‌

ఇవే కాకుండా ప్రాబ్లెమ్‌ సాల్వింగ్, డిజైన్‌ థింకింగ్, నిరంతర అభ్యాసం, ప్రాజెక్ట్‌ నిర్వహణ, ఉత్పత్తి నిర్వహణ, ప్రోగ్రామ్‌ నిర్వహణ, డిజిటల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, స్టోరీ టెల్లింగ్‌ వంటి అంశాల్లో తర్పీదు ఇవ్వనున్నారు.





#Tags