New AI Centres: కొత్త ఏఐ సెంటర్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురంటౌన్‌: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌స్కూల్‌) ఏఐ సెంటర్‌లకు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా విద్యా శాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా ఓపెన్‌ స్కూల్‌ సమన్వయకర్త సీహెచ్‌. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పొందిన ఉత్తీర్ణత సర్టిఫికెట్లు అందించామన్నారు. కొత్త ఏఐ సెంటర్లు కావలసిన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గల అన్ని ఏఐ సెంటర్‌లలో తరగతులు క్రమమైన పద్ధతిలో జరగాలని, ఓపెన్‌ స్కూల్స్‌లో రాష్ట్రం విధించిన అడ్మిషన్‌ల లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. బడి ఈడు గల పిల్లలందరినీ బడిలో చేర్పించాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం 6నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరినీ వయసుకు తగిన తరగతిలో బడిలో చేర్పించే బాధ్యతను మనమందరం తీసుకోవాలని తెలియజేశారు. గత సంవత్సరాలలో ఫెయిల్‌ అయిన అభ్యర్ధులందరూ ఏఐ సెంటర్‌లను సంప్రదించి ఓపెన్‌ స్కూల్‌లో చేరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐ సమన్వయకర్తలు, సెక్టోరల్‌ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ఓపెన్‌ స్కూల్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పాల్గొన్నారు.
 

AP schools: పాఠశాలల్లో జాగ్రత్తలు తీసుకోవాలి

#Tags