Dubai Education: భారతీయులకు ఉన్నత విద్య మరియు జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులు గమ్యస్థానంగా దుబాయ్‌ నగరం

Dubai Education: భారతీయులకు ఉన్నత విద్య మరియు జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులు గమ్యస్థానంగా దుబాయ్‌ నగరం

ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటి. ఆకాశహర్మ్యాలతో మెట్రోపాలిటన్‌ సంస్కృతికి అద్దం పట్టేలా నైట్‌ లైఫ్‌. అబ్బురపరిచే షాపింగ్‌ ఫెస్టివల్స్‌. ఒంటెలపై సఫారి. వీటితోనే ఎడారి దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ నగరం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇంతకాలం టూరిస్ట్‌ స్పాట్‌గా వెలుగొందిన దుబాయ్‌ ఇప్పుడు అంతర్జాతీయ ఉన్నత విద్యకు గమ్యస్థానంగా మారుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో దుబాయ్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు పయనమవుతున్నారు. 60కి పైగా విదేశీ వర్సిటీలు, కాలేజీల క్యాంపస్‌లకు దుబాయ్‌ నిలయంగా ఉంది. ఇప్పటికే యూఎస్, యూకేకు చెందిన వర్సిటీలు సైతం దుబాయ్‌లో క్యాంపస్‌లను నెలకొల్పగా.. మరిన్ని సంస్థలు సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. 

భారతీయ సంస్కృతితో ముడిపడి..
భారతీయులకు అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యలో ప్రపంచస్థాయి గమ్యస్థానంగా దుబాయ్‌ మారుతోంది. గత ఏడాది 2.43 లక్షల మంది విద్యార్థులు చదువు కోసం అక్కడికి వెళ్లారు. భారత్‌కు దుబాయ్‌ మూడు గంటల ప్రయాణ దూరంలో ఉండటం ఎక్కువగా విద్యార్థులకు కలిసివస్తోంది. ప్రధాన భారతీయ నగరాల నుంచి నేరుగా విమాన సౌకర్యాలు అందుబాటులో ఉండటం మరో అంశం. దుబాయ్‌ కృత్రిమ మేధస్సు, సుస్థిరత, నిర్మాణం, పర్యాటక రంగంలో వినూత్న ప్రాజెక్టులు రూపొందిస్తోంది. ఈ తరుణంలో దుబాయ్‌ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మానవ వనరులు ఎంతో కీలకం.

Also Read: DSC Merit Lists: జిల్లాలకు డీఎస్సీ మెరిట్‌ జాబితాలు.. ఒక్కో పోస్టుకు ఇంత‌ మంది చొప్పున ఎంపిక

అందుకే అకడమిక్‌–పరిశ్రమల మధ్య భాగస్వామ్యం పెంచుతూ తరగతి గదికి మించిన విజ్ఞానాన్ని అందించేందుకు దుబాయ్‌ అవకాశాలు కల్పిస్తోంది. చాలామంది విద్యార్థులు తమ చదువు సమయంలో దుబాయ్‌లో ఉపాధి సైతం పొందుతున్నారు. దుబాయ్‌లోని బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 95 దేశాలకుపైగా విద్యార్థులు ప్రాతినిధ్యం వహించే అధ్యయన గమ్యస్థానంగా పేరొందింది. అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. దుబాయ్‌లో భాష, ఆచారాలు, వంటకాలు, సంస్కృతితో భారతీయుల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నందున అక్కడకు వెళ్లేందుకు విద్యార్థులు ఇష్టపడుతున్నారు

గోల్డెన్‌ వీసాతో..
దుబాయ్‌ వృద్ధికి గోల్డెన్‌ వీసా కీలకంగా మారింది. యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసా విదేశీ ప్రతిభను, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. గోల్డెన్‌ వీసా పెట్టుబడిదారులు, ఎంట్రపెన్యూర్స్, ప్రత్యేక ప్రతిభావంతులు, పరిశోధకులు, అత్యుత్తమ విద్యార్థులు, సైన్స్, ఇంజినీరింగ్, ఆరోగ్యం, విద్య, కళల వంటి రంగాలలో అసాధారణ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఈ వీసాను సాధారణంగా 5–10 సంవత్సరాలకు జారీ చేస్తారు. మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. గోల్డెన్‌ వీసా హోల్డర్‌లను జాతీయ స్పాన్సర్‌ అవసరం లేకుండా యూఏఈలో నివసించడానికి, పని చేయడానికి చదువుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పటివరకు దుబాయ్‌లో పోస్ట్‌–స్టడీ ఉపాధి వీసాలు లేవు. అయితే.. అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యను పూర్తిచేసిన తర్వాత అక్కడే ఉండేందుకు గోల్డెన్‌ వీసా కాకుండా ఉపాధి వీసా, ఉద్యోగార్థుల వీసా, ఫ్రీలాన్స్‌ వీసా, ఇన్వెస్టర్‌ వీసా, ఫ్యామిలీ స్పాన్సర్‌షిప్‌ ద్వారా రెసిడెన్సీ వీసాలను తీసుకొచ్చారు. 

భద్రతలోనూ ఇదే టాప్‌
భద్రతా ప్రమాణాలు, వ్యక్తులకు సురక్షితమైన దేశాలలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది. అబుదాబి, దుబాయ్‌లలో నేరాల శాతం చాలా తక్కువగా ఉంది. ఇది సురక్షితమైన విద్యార్థి వాతావరణానికి దోహదం చేస్తుంది. గతేడాది అబుదాబి 11.5 క్రైమ్‌ ఇండెక్స్, 88.5 సేఫ్టీ ఇండెక్స్‌తో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ర్యాంక్‌ పొందింది. దుబాయ్‌ నేరాల సూచిక 16.5, భద్రతా సూచిక 83.5గా ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు హాయిగా విద్యపై దృష్టి పెట్టొచ్చు.

జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులు
దుబాయ్‌లోని చాలా విశ్వవిద్యాలయాలు వ్యాపార రంగంలోని మానవ వనరుల కొరతను అధిగమించేందుకు జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులను అందిస్తున్నాయి. మనస్తత్వ శాస్త్రం, వ్యాపారం, మార్కెటింగ్, ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్‌తోపాటు అత్యధికంగా కంప్యూటర్‌ సైన్స్, బయో మెడికల్‌ సైన్సెస్‌పై భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ వంటి ప్రోగ్రామ్‌లు సైతం అక్కడ క్రమంగా విస్తరిస్తున్నాయి.

అంతర్జాతీయంగా పేరొంచిన పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌ హెల్త్‌ సైన్సెస్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), కంప్యూటర్‌ సైన్స్‌–ఇంజనీరింగ్, ఐటీ వంటివి ఉన్నాయి. ఉద్యోగాలను సృష్టించే ఎంట్రపెన్యూరల్‌ వాతావరణాన్ని ప్రఖ్యాత ప్రపంచ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లతో దుబాయ్‌లో చదువుకునేందుకు అవకాశాలు పెరిగాయి. దుబాయ్‌లో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు అనేక స్కాలర్‌షిప్‌ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అకాడెమిక్‌ ఎక్స్‌లెన్స్‌ స్కాలర్‌షిప్‌లు, మల్టీ కల్చరల్‌ స్టూడెంట్‌ స్కాలర్‌షిప్, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ట్యూషన్‌ స్కాలర్‌షిప్‌లు పొందొచ్చు.

#Tags