Vishwanath Ravinder, IPS: నా కెరీర్‌లో గుర్తుండిపోయే సంఘటన ఇదే...

మిస్టర్‌ కూల్‌గా కనిపించే డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ రూల్స్‌ విషయంలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరు గడించారు.
Vishwanath Ravinder, IPS

1991లో గ్రూప్‌–1లో విజయం సాధించి డీఎస్పీగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. ఆయన ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు.

వద్దనుకుంటూనే ఈ ఉద్యోగానికి...
డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ స్వస్థలం సిద్ధిపేట. తండ్రి రాజేశ్వర్, తల్లి అనసూయబాయి (లేట్‌). డిగ్రీ వరకు అక్కడే చదివారు. తర్వాత ఎమ్మెస్సీ ఎంట్రన్స్‌లో 18వ ర్యాంకు సాధించి 1982లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లో చేరారు. అనంతరం వెంటనే పీహెచ్‌డీ పూర్తి చేశారు. అది పూర్తవుతుండగానే ఒకేసారి లెక్చరర్, గ్రూప్‌–1 రాశారు. చిన్నప్పటి నుంచి పోలీస్‌ జాబ్‌ అంటే భయం ఉండడంతో ఇటువైపు రావొద్దని మొదట అనుకున్నారు.

ఈ ఉద్యోగాన్ని పక్కనపెట్టి...
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచనలతో లెక్చరర్‌ జాబ్‌ను పక్కనపెట్టి 1991లో డీఎస్పీగా చేరారు. తొలుత తెనాలి, బాపట్ల, గుంటూరులో డీఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత అడిషనల్‌ ఎస్పీగా చిత్తూరు, ఓఎస్‌డీగా కర్నూలు, నల్లగొండలో, డీసీపీగా విశాఖపట్నంలో, ఇంటలిజెన్స్‌శాఖలో ఎస్పీగా, తిరుపతి అర్బన్‌ ఎస్పీగా, కరీంనగర్‌ ఎస్పీగా, హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా, హైదరబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ ట్రాఫిక్‌ బాధ్యతలు నిర్వర్తించారు.

వీరే స్ఫూర్తి...
స్నేహితులు, సన్నిహితుల నుంచి స్ఫూర్తి పొందినట్లు పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ చెబుతున్నారు. వాళ్ల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. పట్టుదలతో శ్రమించి చదువులో, కాంపిటేటివ్‌ పరీక్షల్లో విజయం సాధించానని అంటున్నారు. ‘సానుకూల దృక్పథంతో కష్టపడితే ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు. ఏదైనా లక్ష్యం కోసం మంచి మనసుతో కష్టపడితే తప్పక ఫలితం ఉంటుంది. ఇది నాచురల్‌ సీక్రెట్‌’ అని పేర్కొంటున్నారు.

ఇష్టాయిష్టాలు..
టీ షర్ట్స్‌ ధరించడంపై మక్కువ ఉన్నా, వృత్తిరీత్యా ఎక్కువగా ఖాకీ యూని ఫామ్‌లోనే కనిపిస్తానని.. పనిఒత్తిడి కారణంగా పార్టీలు, ఫంక్షన్లకు హాజరయ్యేది తక్కువేనని.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతిరోజు ఉదయం షటిల్‌ ఆడుతానని తన ఇష్టాయిష్టాలను వెల్లడించారు. చదువుకునే రోజుల్లో సాగర సంగమం సినిమాను అనేకసార్లు చూశానంటూ తన గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు.

మరిచిపోలేని సంఘటన ఇదే...
తెనాలిలో పనిచేస్తుండగా ఓ యువకుడి మిస్సింగ్‌ కేసును ఛేదించడం తన వృత్తి జీవితంలో మరిచిపోలేనిదని విశ్వనాథ రవీందర్‌ ఆ ఘటన గురించి వివరించారు. ‘తెనాలిలో పని చేస్తున్నప్పుడు ఓ మహిళ నా దగ్గరకు వచ్చింది. ఒక్కగానొక్క కొడుకు కనిపించడం లేదని, బంధువులతో కలిసి సినిమాకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి రాత్రి వేళ బయటకు వెళ్లిన కొడుకు తిరిగి రాలేదంటూ రోదించింది. కొడుకు కోసం ఏడాదిన్నరగా అన్ని చోట్ల తిరిగినా.. ఫలితం లేదని కన్నీరుమున్నీరైంది. చేతికి అందివచ్చిన కొడుకు ఏమైపోయాడో అంటూ ఆ తల్లి పడిన బాధ చూస్తే నా మనసు చలించిపోయింది.

కేసు విచారణ మొదలుపెట్టాను. తప్పిపోయిన కొడుకును సినిమాకు తీసుకెళ్లిన బంధువులను పిలిపించి మాట్లాడాను. ‘నా అక్క కొడుకు సార్‌. రాత్రి సినిమా చూసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్లం వెళ్లిపోయాం. అప్పటి నుంచి వాడు కనిపించడం లేదు’ అంటూ చెప్పాడు. దీంతో కేసు ముందుకు కదలలేదు. బాగా ఆలోచించగా.. ఆ తల్లి చెప్పిన మాటల్లో కొడుకు కనిపించకుండా పోయిన తర్వాత ఏడు నెలలకు ఓ చోట కొడుకు షర్ట్‌ కనిపించిందని చెప్పిన అంశం గుర్తుకొచ్చింది. ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించాం.

షర్ట్‌ దొరికిన ప్రదేశం చుట్టూ అర కిలోమీటరు వరకు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి అంశాన్ని పరిశీలించినా.. ఫలితం లేదు. చివరగా షర్ట్‌ దొరికిన ప్రదేశానికి సమీపంలో నాలుగైదు వ్యవసాయబావులు కనిపించాయి. మోటార్లతో అందులో ఉన్న నీరు అంతా బయటకు తోడించాం. ఒక బావిలో ఎముకలు కనిపించాయి. వాటిని బయటకు తీసి.. పేరిస్తే మనిషికి సంబంధించినవిగా తేలింది. వెంటనే మరోసారి సినిమాకు తీసుకెళ్లిన బంధువులను పిలిపించి గట్టిగా ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నాడు.

ఆస్తి కోసమే అల్లుడిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ‘అక్కకు ఒక్కడే కొడుకు.. బావ చనిపోయాడు. ఆమె పేరు మీద నాలుగెకరాల పొలం ఉంది. దాని విలువ కోట్లలో ఉంది. అల్లుడి అడ్డు తొలగిస్తే వార సులు లేకుండా పోయి.. అక్క తర్వాత ఆ ఆస్తి అంతా తనపరం అవుతుందని... అందుకే ఈ నేరం చేశా.’ అని చెప్పాడు. తమ్ముడే తన కొడుకును హత్య చేసిన విషయం తెలుసుకుని ఆ తల్లి గుండె పగిలేలా ఏడ్చింది. ఇంతకాలం నా కొడుకు ఏమయ్యాడో అని ఏడ్చాను. నా కొడుకు తిరిగి రాడు. కానీ.. దోషులను పట్టుకున్నారని ఆమె ఉద్వేగంగా మాట్లాడింది. ఈ సంఘటన నా కెరీర్‌లో గుర్తుండిపోయేదిగా నిలిచింది.

సీపీ రవీందర్‌ కుటుంబం...
భార్య : నిర్మల
కూతురు : నిఖిల
అల్లుడు : డాక్టర్‌ మధునారాయణ, డీఎన్‌బీ సర్జికల్‌ అంకాలజీ
కొడుకు : అభిజిత్‌ బీటెక్‌
ఇష్టమైన క్రీడ : టెన్నీస్‌
ఇష్టమైన నటులు : కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్‌

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌.

#Tags