ఐపీఎస్ స్వాతి లక్రా స‌క్సెస్ స్టోరీ...

యూనిఫామ్‌ తొడుక్కుంటే సమాజానికి తెలుస్తుంది తన పవర్‌ ఏంటో! సమాజానికి తోడుగా ఉంటే ఖాకీకి అర్థమవుతుంది తన పవర్‌ ఏంటో!!
సహనం, సంయమనం, నాయకత్వ లక్షణాలతో యూనిఫామ్‌కే వన్నెతెచ్చిన స్వాతి లక్రా ఐపీఎస్‌తో ఇంటర్వ్యూ...
చిన్నప్పుడు మీ ఇంట్లో ఏమైనా వివక్ష ఉండేదా?
లేదు. మా ఇంట్లో అసలు అలాంటి వాతావరణమే లేదు. మా బ్రదర్‌కి ఎన్ని అవకాశాలిచ్చారో మాకూ అన్నే అవకాశాలిచ్చారు మా ఇంట్లో. ఇక్కడ మీకో విషయం చెప్పాలి.. రాంచీలో కాలేజీలు సరిగ్గా లేవు. అంటే ఆ విశ్వవిద్యాలయాల పనితీరు తాత్సారంగా ఉండేది. దానివల్ల అక్కయ్య నష్టపోయింది. ఆమెకు కోల్‌కతా ఐఐఎమ్‌లో సీట్‌ వచ్చింది. కానీ అప్పటికి ఇంకా డిగ్రీ ఫలితాలను విడుదల చేయలేదు. దాంతో ఆమె ఆ సీటును వదులుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత మా నాన్న నన్ను, మా అన్నయ్యను ఢిల్లీ పంపించారు పై చదువుల కోసం. అక్కడ నన్ను ‘లేడీ శ్రీరామ్‌ కాలేజీ’లో చేర్పించారు. ఇది ఎందుకు చెప్పానంటే.. మా అక్కకు జరిగిన నష్టం మా ఇద్దరికీ జరగకూడదని ఆయన తీసుకున్న శ్రద్ధను వివరించడానికి. ఆ టైమ్‌లో మా కుటుంబం నుంచి, మా బంధువులందరిలో ఢిల్లీకి వెళ్లి చదువుకుంది మేమే. వివక్ష లేదు కాబట్టే మా నాన్న మా అన్నయ్యతోపాటు నన్నూ పంపించగలిగారు.

సివిల్స్‌ రాయడానికి మీకు స్ఫూర్తి ఎవరు?
మా నాన్నగారు, లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌లోని నా స్నేహితులు. డిగ్రీలో నాది ఆర్ట్స్‌. పొలిటికల్‌ సైన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాను. పీజీలోనే సివిల్స్‌కి ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను. అయితే సీరియస్‌గా తీసుకోలేదు. ఏమీ చదవకుండానే ప్రిలిమ్స్‌ అయితే పాస్‌ అయ్యాను కానీ ఫైనల్స్‌ కుదరలేదు (నవ్వుతూ). మా నాన్న ఫోన్‌ చేశారు. ఏమైంది? అని. దేని గురించీ అన్నాను. సివిల్స్‌ అన్నారు. రాలేదు అని చెప్పాను. పర్వాలేదు. ఈసారి ప్రయత్నించు అన్నారు. అప్పుడనిపించింది.. మా నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అని. సీరియస్‌గా చదివాను. ఐపీఎస్‌ సాధించాను.

ఫస్ట్‌ టైమ్‌ పోలీస్‌ యూనిఫామ్‌ చూసినప్పుడు ఎలా ఫీలయ్యారు?
గర్వంగా. అప్పుడే కాదు ఇప్పటికీ గర్వంగానే ఉంటుంది. అదే నా గుర్తింపు. స్వాతి లక్రా అంటే నథింగ్‌. స్వాతిలక్రా ఐపీఎస్‌ అంటేనే కదా నాకు ఒక బాధ్యత.. దానివల్ల ఈ గుర్తింపు.

పోలీస్‌ ఉద్యోగం అంటే ఇరవై నాలుగు గంటల సర్వీస్‌.. రకరకాల మనుషులతో డీల్‌ చెయ్యాలి! ఇలాంటి ఉద్యోగాన్ని, అటు ఇంటిని ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు?
సీ.. ఏ ఉద్యోగం అయినా దానికి తగ్గ సమస్యలు ఉంటాయి. ఇదీ అంతే. ఇవన్నీ ఉంటాయని తెలిసే ఈ ఉద్యోగంలోకి వచ్చాను కాబట్టి ఐ హావ్‌ టు డు! అయితే నేను ఇంటిని, ఆఫీస్‌ను కలపను. ఇంటికి ఆఫీస్‌ ఫైల్స్‌ తీసుకెళ్లను. ఇంట్లో కంప్లీట్‌గా నా పిల్లలకు మదర్‌లాగే ఉంటాను. అలాగే విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఇంట్లో వాళ్లకు చెప్పను. నేను పరిష్కరించు కోగలను. మా అమ్మానాన్న, ఇన్‌ లాస్, భర్త అందరూ చాలా సపోర్టివ్‌గానే ఉన్నారు. మా వారు (బెన్‌హర్‌ మహేష్‌దత్‌ ఎక్కా) కూడా ఐఏఎస్‌. నా బ్యాచ్‌మేటే! నా చాలెంజెస్, నా ఉద్యోగ నియమాలు, బాధ్యతలు అన్నీ అర్థం చేసుకుంటారు. కాబట్టి ప్రాబ్లమ్‌ లేదు.

మీవారు ఐఏఎస్, మీరు ఐపీఎస్‌.. ఒకరి విషయాల్లో ఇంకొకరి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉంటుందా?
ఉండదు. మా ఇద్దరికీ స్పష్టత ఉంది. ఒకరికొకరం సహకరించుకుంటూ ఎవరి పనిలో వాళ్లం ఉంటాం. మా ప్రొఫెషనల్‌ స్పేస్‌నూ కాపాడుకుంటాం.

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అమ్మాయిలకు సపోర్టివ్‌గా ఉందంటారా?
మార్పు అయితే వచ్చింది. ఇంతకుముందు ఏ అమ్మాయికైనా వేధింపులు ఎదురైతే పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వడానికి భయపడేవాళ్లు. పోలీస్‌ల మీద నమ్మకం లేకో.. వాళ్ల వివరాలను గోప్యంగా ఉంచలేమనో.. ఇలా రకరకాల కారణాల వల్ల ఫిర్యాదు చేసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ధైర్యంగా ముందుకొస్తున్నారు. మేము (పోలీసులు) కూడా ‘పీపుల్‌ ఫ్రెండ్లీ’ కావడానికి ట్రై చేస్తున్నాం. అలాగే మహిళల హక్కుల పట్ల కూడా మగవాళ్లలో కొంత అవేర్‌నెస్‌ వచ్చింది. ‘షీ టీమ్స్‌’ ద్వారా చూస్తున్నాం కదా.. బయట తమకెంత హక్కు ఉందో మహిళలకూ అంతే ఉందని అర్థం చేసుకుంటున్నారు మగవాళ్లు. మర్యాదగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా అవగాహన కల్పించాలి.

నేటి మహిళ ఎలా ఉండాలి?
చాలా కాన్ఫిడెంట్‌గా.. భయంలేకుండా ఉండాలి. చేస్తున్న పని పట్ల ప్యాషన్‌ ఉండాలి. మన హక్కులు తెలుసుకోవాలి.. కాపాడుకోవాలి. అలాగే మగవాళ్లు కూడా ఆలోచించాలి. ప్రకృతిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉన్నప్పుడు ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయని!

ఇంట్లో... స్కూల్లో..
మేం ముగ్గురం. అక్క, అన్న. నేనే చిన్నదాన్నవడం వల్ల ఇంట్లో కొంచెం గారం ఎక్కువగానే ఉండేది. మా నాన్న (సుబోద్‌ లక్రా) రైల్వేలో ఇంజనీరు. ఆయనకు తరచు బదిలీలు అవుతుండేవి. మా సొంతూరు రాంచీ. చదువుల కోసం మమ్మల్ని రాంచీలోనే ఉంచి ఆయన మాత్రమే వెళ్లేవారు. ఇంటిని, మమ్మల్ని మా అమ్మే (లూసీ లక్రా) చూసుకునేది. ఎల్‌కేజీ నుంచి టెన్త్‌ వరకు నేను ఒకే స్కూల్‌లో చదివాను. అది మిషనరీ స్కూల్‌. దాంతో క్రమశిక్షణ బాగా అలవడింది. అక్కడి టీచర్స్, సిస్టర్స్‌ దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నాను.
#Tags