చూపులేని వ్యక్తి...విధికే సవాలు విసిరాడు...గెలిచాడు : రాజేశ్ సింగ్, ఐఏఎస్

ఓ ఐఏఎస్ అధికారి రాసిన పుస్తకాన్ని మాజీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆవిష్కరించారు. ఇందులో గొప్పేముందనుకుంటున్నారా... ఆ పుస్తకం రాసిన అధికారి వందశాతం కంటిచూపులేని వ్యక్తి. పేరు రాజేశ్ సింగ్. చూపులేని వ్యక్తి ఐఏఎస్ ఎలా అయ్యాడు? పుస్తకం ఎలా రాశాడు? తెలుసుకోవాలనుంది కదూ.. అయితే చదవండి.
విధికే సవాలు విసిరాడు...
ఐఏఎస్... సకల సదుపాయాలున్నవారికి కూడా సాధ్యం కాని చదువు. అలాంటిదాన్ని పూర్తి చేసి.. విధికే సవాలు విసిరాడో అంధుడు. కళ్లు లేకపోయినా పట్టుదలగా చదివి ఐఏఎస్‌ను పూర్తి చేశాడు. అయితే ఓ అంధుడు ఐఏఎస్ అధికారిగా ఎలా బాధ్యతలు నిర్వర్తించగలడని ప్రశ్నించిన అధికారులు అఖిల భారత సర్వీసుల్లో అతనికి స్థానం కల్పించలేదు. అయినా నిరాశ పడని ఆ యువకుడు న్యాయం కోసం పోరాడాడు. సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. 100 శాతం అంధత్వం ఉన్నవారు కూడా ఐఏఎస్ పదవులకు అర్హులే అవుతారని కోర్టు ఇచ్చిన తీర్పుతో చివరకు ఉద్యోగంలో చేరాడు.

సమర్థవంతంగా విధులు...
జార్ఖండ్‌లో జాయింట్ సెక్రటరీగా, మహిళా శిశు సంక్షేమ అధికారిగా, ఏకీకృత శిశు సంరక్షణ పథక ప్రాజెక్టు డెరైక్టర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనే పట్నాకు చెందిన రాజేశ్‌సింగ్. తాను ఈ స్థాయికి రావడానికి చేసిన కృషికి, సాగించిన పోరాటానికి అక్షరరూపం ఇచ్చాడు. 1998 నుంచి 2006 వరకు మూడు అంధుల క్రికెట్ ప్రపంచ కప్‌లకు భారత్ తరఫున రాజేష్ ప్రాతినిధ్యం వహించాడు. సీఎన్‌ఎన్-ఐబీఎన్ ప్రకటించే సిటిజన్ జర్నలిస్టు అవార్డుకు నామినేట్ అయ్యాడు.

ఇది నా ఆత్మకథ కాదు..
చిన్నప్పుడే కంటిచూపును కోల్పోయా. అయినా కలను సాకారం చేసుకునేందుకు దృష్టిలోపం అడ్డుగా మారకూడదని పట్టుదలతో చదివా. స్నేహితుల సహకారంతో ఐఏఎస్‌ను పూర్తి చేశాను. ఇదంతా ఒకమెట్టయితే... ఉద్యోగం సంపాదించుకోవడం మరోమెట్టు. ఈ నా ప్రయాణాన్నంతా పుస్తక రూపంలోకి మార్చాను. అయితే ఇది నా ఆత్మకథ కాదు. చూపులేనివారిలో కూడా ధైర్యం నింపేందుకే రాశాను. ఆలోచనలపై పరిశోధనలకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఓ లాబోరేటరీ లాంటిది. అక్కడ ఎన్నో నేర్చుకోవచ్చు. జాతి వ్యతిరేక కార్యకలాపాలను ఎవరైనా వ్యతిరేకించాల్సిందే.
#Tags