Inspirational Story: నువ్వు చదివి ఉద్ధరించేది ఏముందన్నారు..? ఐఏఎస్ అయి నిరూపించా..
ఈ దేశం ప్రతి ఐఏఎస్ నుంచి ఆశించేది అదే. ప్రాంజల్ పాటిల్ అలాంటి ఐఏఎస్. ఆమెకు చూపు లేకపోవచ్చు.కాని హృదయం, బుద్ధి, మేధ, దార్శనికత ఉన్నాయి. ప్రజలకు ఏం కావాలో తెలిసిన దృష్టి ఉంది.
ఈ విజయం అసామాన్యమైనది..
మొదటి అటెంప్ట్‌లోనే ఆల్ ఇండియా 773 ర్యాంక్‌ను సాధించిన 26 ఏళ్ల అంధురాలు ప్రాంజల్ పాటిల్ స్ఫూర్తిమంతమైన కథ ఇది. ముంబై.. ఉల్లాస్‌నగర్‌లోని ఓ మధ్యతరగతి ఫ్లాట్. ఫ్లవర్ బొకేలతో హాల్ అంతా నిండిపోయింది. క్షణం తీరికలేకుండా ఆ ఇంటి అమ్మాయి ప్రాంజల్ పాటిల్ మొబైల్‌ఫోన్ రింగవుతూనే ఉంది. వచ్చేవాళ్లు వస్తున్నారు. స్వీట్‌బాక్స్‌లు, పళ్లు ఇచ్చి మనసారా ఆమెకు అభినందనలు చెప్తున్నారు. ఇంతలో లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా ఇటు ప్రింట్, అటు ఎలక్ట్రానిక్ మీడియా తలుపు తోసుకుంటూ మరీ వచ్చి ప్రాంజల్ పాటిల్ ముందు మైక్ పెట్టాయి. రికార్డర్ ఆన్ చేశాయి ఆమె విజయపథం గురించి చెప్పమని. ఎందుకంటే ఆమె సాధించిన విజయం అసామాన్యమైనది.
రోజూ లోకల్‌ట్రైన్‌లో..
నా ప్రయాణం ఉల్లాస్‌నగర్ నుంచి సీఎస్‌టీ (ముంబైలో ఒక ప్రాంతం)కి రోజూ లోకల్‌ట్రైన్‌లో వెళ్లినంత తేలికగా ఏం జరగలేదు. నిజానికి ఉల్లాస్‌నగర్, సీఎస్‌టీ ప్రయాణం కూడా ఈజీయేం కాదు. రోడ్డు దాటాలన్నా ఎవరో ఒకరు చేయిపట్టుకొని సాయం చేయాల్సిందే. ట్రైన్ ఎక్కడానికీ ఎవరో ఒకరి తోడు కావాల్సిందే. ప్రతిరోజూ ఈ సహాయానికి విసిగిపోయో లేక నా మీద జాలితోనో చాలామంది ఉల్లాస్‌నగర్ నుంచి ఇక్కడి దాకా ఇంత అవస్థపడుతూ రాకపోతే అక్కడే ఏదో ఒక కాలేజ్‌లో చేరొచ్చుకదా అనేవారు. నువ్వు చదివి ఉద్ధరించేదేముంటుంది గనక? అని సలహా కూడా ఇచ్చేవారు. రోజూ వాళ్లను ఇబ్బంది పెడుతున్నందుకు వస్తున్న విసుగో, నాలాంటి వాళ్ల మీద చిన్నచూపో తెలీదు! ఏమైనా అలాంటి మాటలు నాలో పట్టుదలను పెంచేవి. ఆ మాటలు నా మనసుకి గుచ్చుకున్నా వాళ్లకు మాత్రం నవ్వుతూ సమాధానం చెప్పేదాన్ని.
నా శక్తిని..
గుడ్డివాళ్లకూ కలలుంటాయి. సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో చదవడం నా కల అని గట్టిగా చెప్పేదాన్ని. ఆ కాలేజే నాకు సివిల్స్ గురించి, ఇండియన్ అడ్మిన్‌స్ట్రేటివ్ సర్వీస్ గురించి పరిచయం చేసింది. నా కొత్త కలకు ప్రాణం పోసింది. బ్లాక్ అండ్ వైట్ లైఫ్‌కి కలర్స్ యాడ్ చేసింది. ఇవన్నీ వాళ్లతో చెప్పాలనిపించేది. చెప్పి నా శక్తిని వృథా చేసుకోవాలనిపించక ఆ శక్తినీ సివిల్స్ ప్రిపరేషన్‌కి దాచుకునేదాన్ని.
మా క్లాస్‌మెట్ వల్లే.. నాచూపు..
జీవితం పట్ల దృష్టి, దార్శనికత పెంచడానికే నా నుంచి చూపును లాక్కున్నాడేమో ఆ భగవంతుడు (నవ్వుతూ)..! నాకు ఆరేళ్లప్పుడు మా క్లాస్‌లో మా క్లాస్‌మెట్ పొరపాటున పెన్సిల్‌తో నా కంట్లో గుచ్చాడు. దాంతో ఆ కన్ను చూపు పోయింది. అప్పుడే డాక్టర్లు ‘ఆ గాయం తాలూకు ఇన్‌ఫెక్షన్ రెండో కన్నుకీ సోకింది. నెమ్మదిగా ఆ కన్ను చూపూ పోవచ్చు’ అని మా అమ్మానాన్నలతో చెప్పారు. డాక్టర్లు చెప్పినట్టుగానే యేడాదికి రెండో కన్ను చూపూ పోయి అంధురాలినయ్యాను. అయితే అమ్మానాన్న నన్నెప్పుడూ అంధురాలిగా చూడలేదు. జీవితం పట్ల నేను కలలు కనేలా అదీ రంగురంగుల కలలు కనేలాగానే పెంచారు. ఆ ప్రోత్సాహాన్నిచ్చారు.
నా చదువు :
దాదర్‌లోని కమలా మెహతా స్కూల్ ఫర్ బ్లైండ్‌లో పాఠశాల విద్యను కంప్లీట్ చేశా. అక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు అదే స్కూల్లో ఉండేదాన్ని. కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే ఇంటికి వచ్చేదాని. చండీబాయి కాలేజ్‌లో ఇంటర్ చేశా. 82 పర్సెంటేజ్ వచ్చింది. హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (హెచ్ఎస్‌సీ) పరీక్షల్లో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ఇంటర్‌లో ఉన్నప్పటి నుంచే సెయింట్ జేవియర్స్‌లో చదవాలని నా కల.. ఆశ. మంచి మార్క్స్ రావడంతో ఈజీగానే సీట్ దొరికింది. అలా ఉల్లాస్‌నగర్ నుంచి సీఎస్‌టీ జర్నీ సాగింది. నా ఐఏఎస్ కలకు రెక్కలు తొడిగింది.
సివిల్స్ ఎలా సాధించానంటే..?
2015లో ఎమ్‌ఫిల్ చేస్తూ ఐఏఎస్‌కి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఈ రోజు సివిల్స్‌లో ఆల్ ఇండియా 773 ర్యాంక్ సాధించానంటే ఘనత టెక్నాలజీదే. ఎందుకంటే నా ప్రిపరేషన్‌లో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర. ఒఅగి (జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్) అనే సాఫ్ట్‌వేర్‌ను నా కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నా. నాలాంటి అంధుల కోసం తయారైన సాఫ్ట్‌వేర్ ఇది. తక్కువ సమయంలో ఎక్కువ మెటీరియల్‌ను చదివే అవకాశం కల్పిస్తుంది. బ్రెయిలీ లిపిలో కంప్యూటర్ స్క్రీన్‌మీద డిస్‌ప్లే అయ్యే ఈ మెటీరియల్‌ను వింటూ మననం చేసుకోవచ్చు. లేదంటే సొంతంగా చదువుకోవచ్చు. నేను వింటూ మననం చేసుకునేదాన్ని. పుస్తకాలను తెచ్చుకొని స్కాన్ చేసుకొని అందుకు వీలు కల్పించే జేఏడబ్ల్యు అనే మరో సాఫ్ట్‌వేర్ ద్వారా వినేదాన్ని.
రైల్వే ఉద్యోగం తిరస్కరణకు గురికావడంతో..
2016లో యూపీఎస్‌సీ రాసా. 773వ ర్యాంకు వచ్చింది. ర్యాంకు ఆధారంగా ఇండియన్ రైల్వేస్‌లో అకౌంట్స్ సర్వీస్‌లో ఉద్యోగం రావాలి. కానీ ఆ ఉద్యోగంలో చేరడానికి అడ్డంకి వచ్చింది. ఆ ఆటకం వచ్చి ఉండకపోయి ఉంటే ఎలా ఉండేదో తెలియదు. నా జీవితంతో రాజీ పడిపోయి ఉండే దాన్నేమో..! ఇండియన్ రైల్వేస్‌లో అకౌంట్స్ సర్వీస్‌లోని ఉద్యోగానికి ర్యాంకు ఒక్కటే సరిపోలేదు. చూపు కూడా కావలసి వచ్చింది. అప్పుడు ‘‘నా అసలు టార్గెట్ ఇది కాదు, కాబట్టి మీరు ఈ ఉద్యోగాన్ని నాకు ఇవ్వనక్కర్లేదు’’ అని మళ్లీ ఎగ్జామ్‌కి ప్రిపేరైయ్యాను. తర్వాతి ఏడాది 124వ ర్యాంక్ వచ్చింది.
థ్యాంక్స్ టు హర్..
చదవడమైతే చదివాను కాని నాలుగు గంటల్లో పరీక్ష రాయడం సవాలే. నేను చెప్పింది చెప్పినట్టు పరీక్ష రాసి పెట్టగల వాళ్లను పట్టుకోవడం కష్టమే అయింది. చివరకు విదుషీ అనే నా స్నేహితురాలిని అడిగాను. అసలు పరీక్ష కంటే ముందు ఇద్దరం కూర్చోని మాక్ ఎగ్జామ్స్ రాశాం. నా మాటకు ఆమె రాసే స్పీడ్‌కి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవడానికి. విదుషీ వేగానికి నేను తత్తరపడేదాన్ని. సరిగా చెప్పలేకపోయేదాన్ని. అప్పుడు తను నన్ను హెచ్చరించేది. అలా ఓ పదిసార్లు మాకు మేమే మాక్ టెస్ట్ పెట్టుకుని తర్ఫీదు అయ్యాం. మొత్తానికి మా కాంబినేషన్‌కి ఒక గొప్ప రిజల్ట్‌గా నా ర్యాంక్ నిలిచింది. ఇప్పుడు నా కన్నా విదుషీ హ్యాపీగా ఉంది. తనకే ఐఏఎస్ వచ్చినంత సంబరపడిపోతోంది. థ్యాంక్స్ టు హర్!
కుటుంబ నేపథ్యం:
ప్రాంజల్.. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో జన్మించారు. అమ్మా నాన్న నా వేలు పట్టుకొని నడక నేర్పించారు. మా నాన్న పేరు తండ్రి ఎల్బీ పాటిల్. భుజం తట్టి రంగుల ప్రపంచంలోకి పంపించారు. ఏ రంగైనా నలుపే కదా అని నా మొహం మీద నవ్వేసే వాళ్లకు ఒకటే సమాధానం. నలుపులో మేం ఏ రంగునైనా చూడగలం. ఇది అమ్మా నాన్న నాకు ఇచ్చిన ధైర్యం. నేర్పిన పాఠం. దానికి ప్రాక్టికల్ రిజల్టే ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం.
నా భర్త వల్ల..
నాకు రెండో ఆసరా నా భర్త కోమల్‌సింగ్ పాటిల్. ఒజర్ ఖేడాలో కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. నా లక్ష్యాన్ని ఎప్పుడూ అపహాస్యం చేయలేదు. నా ప్రయాణానికి అడ్డురాలేదు. నా ఈ విజయానికి వీళ్లిద్దరితోపాటు నా స్నేహితులు, ఉల్లాస్‌నగర్ నుంచి సీఎస్‌టీ వరకు ఎక్కడో ఒక చోట నా చేయి పట్టుకొని తోడుగా నిలిచిని ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఎందుకంటే నా ఐఏఎస్ కల పురుడు పోసుకుంది ఆ ప్రయాణంలోనే కాబట్టి’ అంటూ అందరికి ధన్యవాదాలు.
దేశంలోనే మొట్టమొదటి అంధ కలెక్టర్‌గా..
మొదట ప్రాంజల్‌కి కేరళ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎర్నాకుళంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. తర్వాత తిరువనంతపురం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోనే మొట్టమొదటి అంధ ఐఏఎస్ అధికారిణిగా ప్రాంజల్ రికార్డుల్లోకెక్కారు. త్రివేండ్రంలో సబ్‌కలెక్టర్‌గా కూడా పనిచేశారు.
ఇలా చేస్తే జీవితంలో ఓడిపోవడం అనేది ఉండదు..
‘‘ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోకూడదు. అప్పుడు జీవితంలో ఓడిపోవడం అనేది ఉండదు. మన లక్ష్యం మీద మనం పెట్టిన శ్రద్ధ, శ్రమతోనే మనం అనుకున్నది సాధించి తీరుతాం. ఓడిపోయాం... ఓడిపోతామేమో... అనే భావనలే మనల్ని ఓటమిలోకి నెట్టేస్తాయి. అలాంటి భావనలను మనసులోకి రానివ్వకూడదు’’. అని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా.. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
జీవితంలో మర్చిపోలేనని ఈ రెండే..
జీవితంలో ప్రతి సందర్భాన్ని సానుకూలంగా స్వీకరించే ప్రాంజల్ రెండు సందర్భాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఎప్పుడూ చెబుతుంటారు. ఒకటి చిన్నప్పుడు ఆపరేషన్‌లతో కలిగిన బాధ, రెండవది రైల్వే ఉద్యోగానికి అంధత్వం కారణంగా తనను దూరం పెట్టడం. ‘‘ఒకటి శారీరకంగా బాధకలిగించిన సంఘటన అయితే మరొకటి మనసును మెలిపెట్టిన సంఘటన’’ అని చెప్తుంటారామె. మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ గోపాల్ తివారీ తొలి విజువల్లీ చాలెంజ్‌డ్ ఐఏఎస్ ఆఫీసర్. సర్వేంద్రియాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవే. అయినప్పటికీ కంటిచూపు లేకపోవడం మాత్రం దేనికీ అవరోధం కాదని నిరూపించారాయన. ఆయన బాట ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు అదే బాటను మరింతగా విస్తరించిన మరో స్ఫూర్తిప్రదాయిని ప్రాంజల్.
– మంజీర
కాలేజ్‌లో జరిగే..
‘‘ప్రాంజల్ చాలా నిబద్ధత కలిగిన విద్యార్థి. కాలేజ్‌లో జరిగే స్పెషల్ లెక్చర్స్‌కు కూడా అందరికంటే ముందే వచ్చేది. డిబేట్‌లలో అనర్గళంగా మాట్లాడేది. ఒక విషయం మీద తన అభిప్రాయాన్ని సున్నితంగా, చాలా స్పష్టంగా, ఎదుటి వాళ్లు కన్విన్స్ అయ్యేలా చెప్పడం ప్రాంజల్ ప్రత్యేకత. సమస్య వచ్చినప్పుడు జారిపోకుండా నిలబడగలిగిన దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి’’ అని ప్రాంజల్ గురించి ఆమె స్నేహితురాలు సరస్వతి చెప్పింది. ప్రాంజల్, సరస్వతి ఇద్దరూ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు.
- సరస్వతి
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Smita Sabharwal, IAS : సక్సెస్ జర్నీ...ఈమె భర్త కూడా..
Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచలనమే..