గురి తప్పని కెరీర్‌కు.. గణాంక శాస్త్రం

గణాంక శాస్త్రం (స్టాటిస్టిక్స్).. 17వ శతాబ్దంలో ఆవిర్భవించిన శాస్త్రం. ప్రపంచవ్యాప్తంగా దీనికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఒక రంగానికి సంబంధించిన గణాంకాలను సేకరించి, సరైన రీతిలో విశ్లేషించి, వాస్తవాలను బహిర్గతం చేసేవారే స్టాటిస్టిషియన్స్. పొరపాట్లను గుర్తించి, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు గణాంక శాస్త్ర నిపుణులు తోడ్పడతారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన స్టాటిస్టిషియన్ల సేవలు నేడు ఎన్నో రంగాలకు విస్తరించాయి. అందుకే వీరికి ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. భారత్‌లో గణాంక నిపుణుల కొరత అధికంగా ఉండడంతో అభ్యర్థులకు స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తిచేసిన వెంటనే కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. ఆకర్షణీయమైన జీతభత్యాలతో విదేశాల్లోనూ ఉద్యోగాలు దక్కుతున్నాయి. గణాంక శాస్త్రం చదివి ఖాళీగా ఉన్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అంకెలు, సంఖ్యలు, లెక్కలు, ఎక్కాలపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి అడుగుపెట్టి ప్రొఫెషనల్ కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.

అవకాశాలు ఎన్నెన్నో...
ప్రభుత్వాలు గతంలో జనాభా లెక్కలు, బడ్జెట్ తయారీకి అవసరమైన వివరాలను సేకరించడానికి స్టాటిస్టిషియన్లను ఉపయోగించుకునేవి. ఇప్పుడు వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, డ్రగ్ టెస్టింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎకనామెట్రిక్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మార్కెట్ రీసెర్చ్, స్పోర్ట్స్.. ఇలా చాలా రంగాల్లో వీరి సేవలు అవసరమవుతున్నాయి. స్టాటిస్టిషియన్లకు కార్పొరేట్ సంస్థలు భారీ వేతనాలను ఆఫర్ చేస్తూ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. వీరికి ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఎన్నో కొలువులు ఉన్నాయి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసినవారిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌కు ఎంపిక చేస్తోంది. సోషల్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టాటిిస్టిషియన్లు సెఫాలజిస్ట్‌గా కూడా పనిచేయొచ్చు. అంతేకాకుండా బోధనపై ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు.

విశ్లేషణాత్మక దృక్పథం: స్టాటిస్టిషియన్లకు వృత్తిలో రాణించడానికి మ్యాథమెటిక్స్‌పై గట్టి పట్టు ఉండాలి. క్వాంటిటేటివ్, అనలిటికల్ స్కిల్స్ అవసరం. ప్రతి విషయాన్ని తర్కబద్ధంగా ఆలోచించగలగాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. బృంద స్ఫూర్తి కావాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకొని, అమలు చేసే సామర్థ్యం ఉండాలి. స్టాటిస్టికల్ సాఫ్ట్‌వేర్లపై పరిజ్ఞానం పెంచుకోవాలి.

అర్హతలు: భారత్‌లో స్టాటిస్టిక్స్‌లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులున్నాయి. మ్యాథమెటిక్స్‌తో ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా అభ్యసిస్తే ఉన్నతస్థాయి అవకాశాలను పొందొచ్చు. ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది.

వేతనాలు: గణాంక శాస్త్ర నిపుణులకు వార్షిక వేతన ప్యాకేజీలు భారీగా ఉంటాయి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కతా విద్యార్థికి గతంలో రూ.10 లక్షల ప్యాకేజీ దక్కింది. ఢిల్లీ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ కోర్సు అభ్యసించిన విద్యార్థికి రూ.7.5 లక్షల వేతన ప్యాకేజీ లభించింది. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తిచేసినవారికి సగటున ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.4.5 లక్షల వేతనం అందుతుంది.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.isihyd.ac.in
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.uohyd.ac.in
  • యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
    వెబ్‌సైట్:
    www.du.ac.in/du/
  • ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కతా
    వెబ్‌సైట్:
    www.isical.ac.in
  • ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరు
    వెబ్‌సైట్:
    www.isibang.ac.in
  • ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-ఢిల్లీ;
    వెబ్‌సైట్:
    www.isid.ac.in
గణనీయమైన అవకాశాలు!
సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, బీమా, నిర్మాణ తదితర రంగాలన్నింటిలోనూ స్టాటిస్టిక్స్ నిపుణులకు విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీల పనితీరును, ప్రగతిని విశ్లేషించుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికా రచనలో వీరి అవసరం తప్పనిసరి. డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా, సిక్స్‌సిగ్మా, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాల్లో స్టాటిస్టిషియన్స్‌కు డిమాండ్ ఉంది. ఆసక్తితోపాటు మంచి విశ్లేషణాత్మక నైపుణ్యాలు, గణిత సామర్థ్యాలు, అనువర్తన నైపుణ్యాలున్నవారు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారు స్టాటిస్టిక్స్‌ను అభ్యసిస్తే అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. ఈ కోర్సులు చదివినవారికి ప్రైవేటు సంస్థలతోపాటు పలు ప్రభుత్వ విభాగాల్లోనూ అవకాశాలున్నాయి.
ప్రొ.ఎస్.ఎం.సుభానీ, ఎస్‌క్యూసీ అండ్ ఓర్, ఐఎస్‌ఓ 9000, సిక్స్ సిగ్మా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్





















#Tags