UGC Latest Guidelines: పీహెచ్‌డీకి యూజీసీ తాజా మార్గదర్శకాలు, అర్హతలు, ప్రవేశ మార్గాలు..

పీహెచ్‌డీ అభ్యర్థులకు యూజీసీ శుభవార్త చెప్పింది. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతోనే.. పీహెచ్‌డీలో చేరేందుకు అవకాశం కల్పిస్తూ.. నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. డిగ్రీ సర్టిఫికెట్‌తోనే..ఆరేళ్ల వ్యవధిలో పీహెచ్‌డీ పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు.. ఈ మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించింది!! దీనికి సంబంధించి యూజీసీ (మినిమమ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ ప్రొసీజర్‌ ఫర్‌ అవార్డ్‌ ఆఫ్‌ పీహెచ్‌డీ డిగ్రీ) రెగ్యులేషన్స్‌-2022 పేరుతో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. పీహెచ్‌డీకి యూజీసీ తాజా మార్గదర్శకాలు, అర్హతలు, ప్రవేశ మార్గాలు, ఫెలోషిప్స్, స్కాలర్‌షిప్స్‌ తదితర అంశాలపై విశ్లేషణ..
  • యూజీసీ సరికొత్త మార్గదర్శకాలు విడుదల
  • పీహెచ్‌డీ ప్రవేశాలకు కనీస అర్హతలపై నూతన విధానం
  • గెజిట్‌ నోటిఫికేషన్‌ సైతం విడుదల చేసిన యూజీసీ
  • ప్రవేశ అర్హతలు, పీహెచ్‌డీ వ్యవధిపైనా స్పష్టత

నాలుగేళ్ల వ్యవధి లేదా ఎనిమిది సెమిస్టర్ల బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు.. నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ).. తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. తమ బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సు 75శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కొత్త విధానంతో విద్యార్థులకు కెరీర్‌ పరంగా ఎంతో విలువైన సమయం ఆదా అవనుంది. ఇంతకాలం అమల్లో ఉన్న విధానం ప్రకారం-డిగ్రీ తర్వాత పీజీ పూర్తి చేసి.. ఆ అర్హతతో యూజీసీ-నెట్, సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్, గేట్, సీడ్‌ వంటి పరీక్షల్లోనూ మంచి స్కోర్‌ సాధిస్తేనే పీహెచ్‌డీలో ప్రవేశం లభించేది.

పీజీ, ఎంఫిల్‌ విద్యార్థులు

  • పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి పీజీ, ఎం.ఫిల్‌ విద్యార్థుల అర్హతల విషయంలోనూ యూజీసీ స్పష్టమైన మార్గదర్శకాలు పేర్కొంది. 
  • వీరు నాలుగేళ్ల డిగ్రీ తర్వాత ఏడాది లేదా రెండు సెమిస్టర్ల వ్యవధిలోని పీజీని 55 శాతం మార్కులతో పూర్తి చేసుకుని ఉండాలి.
  • మూడేళ్ల డిగ్రీ తర్వాత రెండేళ్లు లేదా నాలుగు సెమిస్టర్ల వ్యవధిలోని పీజీ కోర్సులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 55 శాతం మార్కులతో ఎం.ఫిల్‌ పూర్తి చేసుకున్న వారు కూడా ప్రవేశాలకు అర్హులే. 
  • నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు పైన పేర్కొన్న అర్హతలున్న వారందరూ పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హులేనని యూజీసీ స్పష్టం చేసింది.

చ‌ద‌వండి: Higher Education: డిగ్రీతోనే పీహెచ్‌డీలో చేరేలా..!

ఆరేళ్లలో పీహెచ్‌డీ

పీహెచ్‌డీ పూర్తి చేసేందుకు కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఆరేళ్లను వ్యవధిగా యూజీసీ పేర్కొంది. కోర్స్‌ వర్క్, ప్రాజెక్ట్‌ వర్క్‌కు ఈ వ్యవధిని నిర్దేశించింది. ప్రవేశాలు కల్పించిన ఇన్‌స్టిట్యూట్‌ల నిబంధనలకు అనుగుణంగా అదనంగా మరో రెండేళ్ల గడువు పొడిగించే అవకాశం కల్పించింది. మొత్తంగా చూస్తే అన్ని సడలింపులు, పొడగింపులతో కలిపి ఎనిమిదేళ్ల వ్యవధిలో పీహెచ్‌డీ పూర్తి చేయాల్సి ఉంటుందని తాజా మార్గదర్శకాల్లో యూజీసీ స్పష్టం చేసింది.

ప్రవేశాలు ఇలా

  •  పీహెచ్‌డీ ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేసే విషయంలో యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు అనుసరించాల్సిన విధి విధానాలను కూడా యూజీసీ వెల్లడించింది.
  • జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న యూజీసీ నెట్‌ స్కోర్‌ లేదా ఆయా యూనివర్సిటీలు స్వయంగా నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లలో ఉత్తీర్ణత ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. 
  • ఇన్‌స్టిట్యూట్‌లు స్వయంగా నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారినే ఇంటర్వ్యూకు ఎంపిక చేసి.. అందులోనూ ప్రతిభ చూపిన వారికే పీహెచ్‌డీ ప్రవేశం ఖరారు చేయాల్సి ఉంటుంది. 
  • యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లో 50 శాతం సబ్జెక్ట్‌ సంబంధిత అంశాలు, మరో 50 శాతం రీసెర్చ్‌ మెథడాలజీ సంబంధిత సిలబస్‌ ఉండాలని సూచించింది. 
  • ఎంట్రన్స్‌ టెస్ట్‌లో మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు 30 శాతం వెయిటేజీ కల్పిస్తూ ప్రవేశాలు ఖరారు చేయాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Higher Educationలో సమూల మార్పులు... యూకే వర్సిటీల సహకారంతో రూపకల్పన

కనీస క్రెడిట్స్‌ విధానం

  • పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన తర్వాత అభ్యర్థులు కచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది క్రెడిట్‌ కోర్సులను తీసుకోవాలని.. వాటిలో రీసెర్చ్‌ టెక్నిక్స్, డొమైన్‌ సంబంధిత సబ్జెక్ట్‌ ఉండాలని పేర్కొంది. 
  • సదరు కోర్సు సమయంలో కనీసం 12 క్రెడిట్స్‌ను.. గరిష్టంగా 16 క్రెడిట్స్‌ను సొంతం చేసుకోవాలి. 
  • రీసెర్చ్‌ మెథడాలజీకి కనీసం నాలుగు క్రెడిట్స్‌ విధానాన్ని అమలు చేయాలని.. అవి కూడా క్వాంటిటేటివ్‌ మెథడ్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, రీసెర్చ్‌ ఎథిక్స్, సంబంధిత రంగంలో పబ్లిష్‌ అయిన రీసెర్చ్‌ సమీక్ష, ఫీల్డ్‌ వర్క్‌ తదితర అంశాలకు కేటాయించాలని యూనివర్సిటీలకు స్పష్టం చేసింది. 
  • కోర్స్‌ వర్క్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని.. అప్పుడే సర్టిఫికెట్‌ పొందేందుకు అర్హులవుతారని స్పష్టం చేసింది.

నిరంతర సమీక్ష

పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన తర్వాత అభ్యర్థుల పనితీరును నిరంతరం సమీక్షించాలని యూజీసీ పేర్కొంది. ఇన్‌స్టిట్యూట్‌ లేదా యూనివర్సిటీ స్థాయిలో రీసెర్చ్‌ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయాలి. ప్రతి సెమిస్టర్‌లో రీసెర్చ్‌ విద్యార్థులు రీసెర్చ్‌ అడ్వైయిజరీ కమిటీ ముందు తమ కోర్స్‌ వర్క్‌కు సంబంధించి ప్రజెంటేషన్, నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రమాణాలు పాటించాలి

  • పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలని యూజీసీ స్పష్టం చేసింది. 
  • నాలుగేళ్ల డిగ్రీ కోర్సును అందిస్తున్న పీజీ కళాశాలలు; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని కళాశాలలు, పరిశోధన సంస్థలు పీహెచ్‌డీ కోర్సు నిర్వహించొచ్చు. 
  • వీటిలో ఇవి నిర్దిష్ట సంఖ్యలో పీహెచ్‌డీ అర్హత కలిగిన ఫ్యాకల్టీ ఉండాలి.

చ‌ద‌వండి: Higher Education Loans: కనిష్టంగా రూ.4 లక్షలు.. గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణం

ఫెలోషిప్‌

పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన వారికి ప్రస్తుతం ఫెలోషిప్‌ పేరిట ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తోంది. పీహెచ్‌డీలో అడుగుపెట్టాక తొలి రెండేళ్లు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) పేరుతో నెలకు రూ.31వేలు, ఆ తర్వాత మూడేళ్లపాటు సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(ఎస్‌ఆర్‌ఎఫ్‌) పేరుతో నెలకు రూ.35 వేలు చొప్పున అందిస్తారు. వీటికి అదనంగా జేఆర్‌ఎఫ్‌ సమయంలో ఏడాదికి రూ.12 వేలు, ఎస్‌ఆర్‌ఎఫ్‌ సమయంలో ఏడాదికి రూ.25 వేలు కాంటిజెన్సీ గ్రాంట్‌ అందిస్తారు.

పీహెచ్‌డీతో ప్రయోజనాలివే

  • పీహెచ్‌డీ పూర్తి చేయడం వల్ల సదరు స్కాలర్స్‌కు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. 
  • ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలు ఐఐసీటీ, సీఎస్‌ఐఆర్, ఐసీఏఆర్, ఎన్‌జీఐఆర్‌ఐ, ఇక్రిశాట్‌ తదితరాల్లో జూనియర్‌ సైంటిస్ట్‌లుగా ఉద్యోగం లభిస్తుంది. 
  • బోధన రంగంలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీగా కెరీర్‌ ప్రారంభించే వీలుంది. 
  • ప్రైవేటు సంస్థల ఆర్‌ అండ్‌ డీ విభాగాల్లో సైంటిస్ట్‌లుగా ప్రారంభంలోనే నెలకు రూ. 2 లక్షల వేతనం అందుకోవచ్చు.
  • పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత సొంత రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు సైతం అవకాశం లభిస్తుంది. ఇలాంటి అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డ్‌.. ఎక్స్‌ట్రా మ్యూరల్‌ రీసెర్చ్‌ ఫండింగ్, ఎర్లీ కెరీర్‌ రీసెర్చ్‌ అవార్డ్, నేషనల్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ పేరుతో పలు పథకాలు అందుబాటులో ఉంచింది. ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు రీసెర్చ్‌ గ్రాంట్, నెలకు రూ.55 వేల ఫెలోషిప్, ఇతర రీసెర్చ్‌ ఖర్చుల కోసం ఓవర్‌హెడ్స్‌ పేరుతో ఏడాదికి రూ.లక్ష వరకూ ఆర్థిక ప్రోత్సాహకాలు లభిస్తాయి. 

చ‌ద‌వండి: Higher Education: సెంట్రల్‌ యూనివర్సిటీస్‌.. ఉమ్మడి ఎంట్రన్స్‌!

యూజీసీ.. తాజా మార్గదర్శకాలు

  • నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా పీహెచ్‌డీలో ప్రవేశం. 
  • యూజీసీ-నెట్,సీఎస్‌ఐఆర్,గేట్, తదితర ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపిక చేయాలనే నిబంధన.
  • ఇన్‌స్టిట్యూట్‌లు స్వీయ ఎంట్రన్స్‌లు నిర్వహించే అవకాశం.
  • రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులు ఎంపిక.
  • కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఆరేళ్ల వ్యవధిలో పీహెచ్‌డీ పూర్తి చేసుకునేలా మార్గదర్శకాలు
  • 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే పీహెచ్‌డీ పట్టా.
     

#Tags