ఉద్యోగాల గని.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ

నేటి సాంకేతిక ప్రపంచంలో దూసుకొస్తున్న మరో విప్లవాత్మక టెక్నాలజీ.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ! ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటైజేషన్ విస్తరిస్తున్న తరుణంలో ప్రతి లావాదేవీ పారదర్శకంగా, భద్రంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత!
  మరోవైపు హ్యాకర్ల బెడద పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ తప్పనిసరిగా మారుతోంది. అదే ఇప్పుడు ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు బ్లాక్‌చైన్ టెక్నాలజీ వైపు దృష్టిపెట్టేలా చేస్తుంది! ఫలితంగా రానున్న అయిదేళ్లలో లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా!! ఈ నేపథ్యంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ స్వరూపం.. ఆ టెక్నాలజీలో నైపుణ్యం సాధించేందుకు అవసరమైన కోర్సులు, అందుబాటులో ఉన్న మార్గాలపై విశ్లేషణ..

బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంటే?
  • బ్లాక్‌చైన్ టెక్నాలజీ.. ఒక కట్టుదిట్టమైన డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్. ఇదో వికేంద్రీకృత టెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో విస్తరించిన సమర్థవంతమైన సర్వర్ల వ్యవస్థ ఇది.
  • హ్యాకర్లు సర్వర్‌ను హ్యాక్ చేసి.. అందులోని విలువైన సమస్త సమాచారం తస్కరిస్తుంటారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా దీనికి అడ్డుకట్ట వేయొచ్చు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ విధానంలో సమాచారాన్ని పలు సర్వర్లలో, ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో నిక్షిప్తం చేస్తారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అనేక సర్వర్లను హ్యాక్ చేయడం సాధ్యంకాదు. కాబట్టి విలువైన సమాచారం హ్యాకర్ల బారిన పడకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీ కాపాడుతుంది. అంతేకాదు ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలన్నా.. విభిన్న ప్రాంతాల్లోని అనేక సర్వర్లు సమ్మతించాల్సి ఉంటుంది.
  • బ్యాంకింగ్ రంగాన్నే తీసుకుంటే.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా కింది నుంచి పైస్థాయి వరకూ.. ఆయా కార్యకలాపాల్లో ఏ దశలో ఎలాంటి పొరపాటు చోటుచేసుకున్నా, అవకతవకలు జరిగినా.. అది సదరు వ్యవస్థలోని సంబంధిత అధికారులందరికీ తెలిసిపోతుంది. తద్వారా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడొచ్చు.
  • అదే విధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. ఒక స్థలం లేదా ఇంటి కొనుగోలుకు సంబంధించిన రికార్డులు సబ్ రిజి్ట్రార్, లేదా రిజి్ట్రార్ పరిధిలో ఉంటాయి. ఉద్దేశపూర్వకంగానో లేదా అనుకోకుండానో.. పొరపాట్లు జరగడానికి ఆస్కారం ఎక్కువ. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇలాంటి సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.
  • మొత్తం వ్యవస్థను బ్లాక్‌చైన్ టెక్నాలజీ పరిధిలోకి తెస్తే.. ఒక లావాదేవీకి సంబంధించి ఎక్కడ ఎలాంటి మార్పులు జరిగినా.. వివిధ స్థాయిల్లోని అధికారులు చూసే అవకాశం ఉంటుంది. పై స్థాయిలో అవకతవకలు జరిగినా.. లేదా కింది స్థాయిలో తప్పులు దొర్లినా.. వెంటనే ఆ నెట్‌వర్క్ పరిధిలోని ఇతర అధికారులు లేదా వ్యక్తులకు తెలిసిపోతుంది. ఫలితంగా పొరపాట్లకు ఆస్కారం తగ్గుతుంది. పారదర్శకత పెరుగుతుంది.

డిజిటైజేషన్ దిశగా..
అన్ని రంగాల్లో డిజిటైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. పేపర్‌లెస్ విధానంతోపాటు పారదర్శకతకు పెద్దపీట వేయడంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ విధానం దోహదపడుతుంది. ఇదే ఇప్పుడు యువతకు కెరీర్ పరంగా కలిసొచ్చే అంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు బ్లాక్‌చైన్ టెక్నాలజీ అవసరాన్ని ఇప్పటికే గుర్తించాయి. విదేశాల్లో ఇప్పటికే ఈ టెక్నాలజీ విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. మనదేశంలోనూ మరో రెండేళ్లలో ఈ టెక్నాలజీ విస్తరిస్తుందని భావిస్తున్నారు. రానున్న అయిదేళ్లలో ఐటీ రంగంలో అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల్లో పదిశాతం బ్లాక్‌చైన్ టెక్నాలజీ విభాగంలోనే ఉంటాయని నిపుణుల అంచనా.

ఫైనాన్షియల్ సెక్టార్:
పస్తుతం బ్లాక్‌చైన్ టెక్నాలజీ సొల్యూషన్స్ వినియోగంలో ఫైనాన్షియల్ సెక్టార్ ముందంజలో ఉంది. కారణం.. వర్చువల్ కరెన్సీ బిట్‌కాయిన్‌లకు ఆధారం బ్లాక్‌చైన్ టెక్నాలజీ. మన దేశంలో ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్, హెల్త్‌కేర్, టెలికం తదితర రంగాల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ తన తాజా నివేదికలో పేర్కొంది.

సీఎస్‌ఈ విద్యార్థులకు అనుకూలం..
బ్లాక్‌చైన్ టెక్నాలజీ సీఎస్‌ఈ విద్యార్థులకు అనుకూలమనేవాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ ఆధారిత ఒక ప్రొడక్ట్. దీని రూపకల్పనకు అవసరమైన ప్రోగ్రామింగ్, అల్గారిథమ్స్, డేటాస్ట్రక్చర్‌‌స, జావా, ఆర్, పైథాన్ వంటి లాంగ్వేజెస్‌ను సీఎస్‌ఈ విద్యార్థులు సులువుగా నేర్చుకోగలరు.

ఆన్‌లైన్ కోర్సులు..
బ్లాక్‌చైన్ టెక్నాలజీకి సంబంధించి పలు ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అవి..
1. https://www.udemy.com/blockchain101/
2. https://www.courseera.org/learn/cryptocurrency
3. https://edx.org/course/blockchain-business-introduction-linuxfoundation-lfs171x

ప్రధాన విభాగాలు..
  1. క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్స్: ప్రస్తుతం సర్వర్లన్నింటినీ ‘క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్స్’ నిర్వహిస్తున్నాయి. ఈ విధానంలో సింగిల్ స్టోరేజ్ ప్రొవైడర్ సమాచారం మొత్తాన్ని నియంత్రిస్తుంది. బ్లాక్‌చైన్ టె క్నాలజీలో సమాచారాన్ని డీసెంట్రలైజ్ చేస్తారు.
  2. డిజిటల్ ఐడెంటిటీ: డిజిటల్ సెక్యూరిటీ.. ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. ప్రతి ముగ్గురిలో ఒకరు సైబర్ దాడికి గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. బ్లాక్‌చైన్ టెక్నాలజీ సైబర్ నేరాలను అరికట్టడం కోసం డిజిటల్ ఐడెంటిటీ కల్పించి సమాచారాన్ని సురక్షితంగా ఉండేలా చేస్తుంది. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, నేషనల్ సెక్యూరిటీ, సిటిజన్‌షిప్ డాక్యుమెంటేషన్, పాస్‌పోర్ట్, ఈ-రెసిడెన్సీ, వెడ్డింగ్ సర్టిఫికెట్స్, ఆన్‌లైన్ రిటైలింగ్, ఐడెంటిటీ అథెంటికేషన్ వంటి విభాగాల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది.
  3. స్మార్ట్ కాంట్రాక్ట్స్: ప్రస్తుతం ప్రపంచం స్మార్ట్ కాంట్రాక్ట్స్ వైపు అడుగులు వేస్తోంది. కరెన్సీ మార్పిడి, ఆస్తుల బదలాయింపు, కొనుగోలు, షేర్స్ వంటి ఆర్థిక పరమైన అంశాల్లో పారదర్శకత తీసుకురావడంలో ఈ స్మార్ట్ ఒప్పందాలు బాగా ఉపయోగపడతాయి. దీనివల్ల అనేక రకమైన నేరాలను, మోసాలను అరికట్టవచ్చు.
  4. డిజిటల్ ఓటింగ్: ఎన్నికల సమయంలో డిజిటల్ ఓటింగ్ ఉంటే బాగుంటుందని చాలా దేశాలు అభిప్రాయపడుతున్నాయి. దీనివల్ల ఓటర్లు భయపడకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఇష్టమొచ్చిన వారికి ఓటెయొచ్చు. అలాగే కౌంటింగ్ మోసాలను అరికట్టవచ్చు అన్నది వారి వాదన. 2014 ఎన్నికల్లో డెన్మార్క్‌లోని లిబరల్ అలయెన్స్ అనే పొలిటికల్ పార్టీ ప్రయోగాత్మకంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ ఓటింగ్ నిర్వహించింది. దీనివల్ల ఎన్నికల ప్రక్రియతోపాటు మొత్తం ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత వస్తుందని భావిస్తున్నారు.
  5. నోటరీ విభాగం: ప్రస్తుతం మనమేదైనా ధృవీకరణ పత్రాలను పొందాల నుకుంటే రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి. కారణం.. సమాచారమంతా సెంట్రలైజ్డ్ అయి ఉండటమే. అలాకాకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించి సమాచారాన్ని డీసెంట్రలైజ్డ్ చేయడం వల్ల వీలైనంత వేగంగా పౌరులకు అవసరమైన ధృవీకరణ పత్రాలను అందించవచ్చు.

అవగాహన పెరగాలి..

 బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత వస్తుంది. మరో రెండేళ్లలో ఐటీ రంగ  కొలువుల్లో పదిశాతం బ్లాక్‌చైన్ నిపుణులకే అనడంలో సందేహం లేదు. క్రిప్టోగ్రఫీ, వర్చువల్ కరెన్సీ లావాదేవీలతోపాటు ఐటీ సర్వీస్ సంస్థలు కూడా బ్లాక్‌చైన్ సొల్యూషన్స్ను వినియోగించడం ప్రారంభిస్తే ఈ అవకాశాల సంఖ్య మరింత పెరుగుతుంది.
- బాబు మునగాల, సీఈఓ, జెబీ బ్లాక్ చైన్ సొల్యూషన్స్














#Tags