సామాజిక సేవ మీ లక్ష్యమైతే...ఇవిగో మార్గాలు !

ఇంజనీరింగ్... ఆ తరవాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. సౌకర్యవంతమైన జీవితం. మెడిసిన్... డాక్టర్‌గా చక్కని ప్రాక్టీస్. జాబ్ చేయకున్నా లక్షలు పోగేయొచ్చు.
ఎంబీఏ కోర్సు చేస్తే... కార్పొరేట్ కంపెనీల్లో లక్షల ప్యాకేజీలతో ఉద్యోగం. అందరూ ఇలానే ఆలోచించరు!!. ఇతరులకు సాయపడటంలో సంతృప్తిని వెదుక్కునేవారు మనలో చాలా మందే ఉన్నారు. అందుకే ఇపుడు ఆకలేసిన నిరుపేదలకూ అన్నం దొరుకుతోంది. నిరాశ్రయులకు ఆశ్రయం... నిర్భాగ్యులకు చదువు... ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇప్పటికీ వైద్య సౌకర్యం లేని పల్లెల్లో ఉచిత వైద్య శిబిరాలు వెలుస్తున్నాయి. ఎందుకంటే... సమాజంలోని అన్ని వర్గాలూ బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచన వీరిది. ఆ దిశగా అడుగులు వేస్తున్న యువత పెరుగుతుండటంతో... వారికి కావాల్సిన కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి.ఈ నేపథ్యంలో సోషల్ సెక్టార్ సంబంధిత కోర్సులు, ఉద్యోగావకాశాల వివరాలు ఇవే...

సేవ ద్వారా సమాజ ప్రగతికి పాటుపడాలనే సంకల్పం బలంగా ఉంటే.. సంబంధిత నైపుణ్యాలను అందించేందుకు ఇప్పుడు అకడమిక్ స్థాయిలో ఎన్నో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా సామాజిక సమస్యలపై అవగాహనతో పాటు సమస్య పరిష్కార నైపుణ్యం సొంతం చేసుకోవచ్చు. టిస్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్), యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వంటి కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ పేరిట ప్రత్యేక కోర్సులు అందిస్తున్నాయి. మరెన్నో వర్సిటీల్లో బీఏ గ్రూప్ సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్‌గా సోషల్ వర్క్‌ను అందిస్తున్నారు.

మెప్పించే నైపుణ్యాలు..
గ్రామీణ ప్రజలను, నిరక్షరాస్యులను మార్పు దిశగా ఒప్పించడం అంత తేలికకాదు. దీనికి అవసరమైన నైపుణ్యాలు పొందేందుకు సోషల్ వర్క్‌లో పీజీ స్థాయిలో స్పెషలైజ్డ్ కోర్సుల్లో చేరొచ్చు. ఎంఏ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్‌లలో ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్, రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ స్పెషలైజేషన్స్ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

క్షేత్ర స్థాయి సమస్యలు :
సోషల్‌వర్క్ కోర్సును అభ్యసించడం ద్వారా రూరల్ డెవలప్‌మెంట్, హెల్త్ అండ్ శానిటేషన్, ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ వంటి సామాజిక సమస్యలు.. వాటి పరిష్కారం దిశగా రూపొందించాల్సిన ప్రణాళికలపై అవగాహన లభిస్తుంది. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్ వర్క్స్ తప్పనిసరి. ఫలితంగా విద్యార్థులకు అకడమిక్ స్థాయిలోనే క్షేత్ర స్థాయి సమస్యల గురించి తెలుస్తుంది. అంతేకాకుండా వాటి పరిష్కారానికి అవసరమైన నేర్పు అలవడుతుంది.

ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్ :
సోషల్ డెవలప్‌మెంట్ అంటే.. మనకు టక్కున గుర్తొచ్చేది స్వచ్ఛంద సంస్థలే (ఎన్‌జీఓలే)! వీటి నిర్వహణ నైపుణ్యాలు అందించేందుకు ఇప్పుడు ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్ కోర్సు కూడా ఉంది. వీటిని పూర్తిచేసిన వారు ఎన్‌జీఓల్లో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. సొంతగా ఎన్‌జీఓనూ స్థాపించొచ్చు.

రూరల్ డెవలప్‌మెంట్ :
గ్రామీణాభివృద్ధి.. మన దేశంలో నేటికీ అత్యంత ప్రధానమైంది. గ్రామీణాభివద్ధికి సంబంధించి కూడా అకడమిక్‌గా ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్(గుజరాత్) వంటి సంస్థలు రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులకు కేరాఫ్‌గా చెప్పొచ్చు. వీటితోపాటు పలు యూనివర్సిటీల్లోనూ పీజీ స్థాయిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

ఉపాధి వేదికలు :
సోషల్ సెక్టార్ కోర్సులు పూర్తిచేసినవారు ఎన్‌జీవోలు, కార్పొరేట్ కంపెనీలు, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్థలు.. ఇలా.. పలురకాల వేదికల ద్వారా ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సోషల్ వర్క్, ఎన్‌జీవో మేనేజ్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఎన్‌జీవోలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, రూరల్ హెల్త్ మిషన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో అవకాశాలు లభిస్తాయి. మరోవైపు సామాజిక ప్రగతిలో పాల్పంచుకున్న సంతృప్తి సైతం లభిస్తుంది.

కార్పొరేట్ కొలువులు సైతం :
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్)కి సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి కార్పొరేట్ సంస్థ తమ లాభాల్లో రెండు శాతం మేరకు సామాజిక అభివృద్ధి కార్యకలాపాలకు వెచ్చించాలి. దాంతో పలు కార్పొరేట్ కంపెనీలు.. విద్యా సంస్థలు, ఇతర వృత్తి శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతున్నాయి. వాటి సక్రమ అమలుకు సోషల్ వర్క్, రూరల్‌డెవలప్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారిని ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డెరైక్టర్ వంటి ఉద్యోగాల్లో నియమిస్తున్నాయి.

యూఎన్‌వోలో ఇంటర్న్‌షిప్ :
ఐక్యరాజ్య సమితి(యూఎన్‌వో) అనుబంధ సంస్థలైన యునెస్కో, యూనిసెఫ్, యూఎన్ ఉమెన్ వంటి విభాగాల్లో పరిమిత కాల వ్యవధిలో ఉండే ఇంటర్న్‌షిప్స్ చేయొచ్చు.

ఆకర్షణీయ వేతనాలు..
అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులకు ప్రారంభంలోనే రూ.30 వేల వేతనం అందుకునే వీలుంది. ఆపై సామర్థ్యాలు, పనితీరు ఆధారంగా రెండు, మూడేళ్లలో మిడిల్ లెవల్ హోదాలో దాదాపు రూ.50 వేల వేతనం లభిస్తోంది.

ప్రగతికి చేయూత :
వైట్ కాలర్ జాబ్స్‌తో ప్రొఫెషనల్ కెరీర్‌లో స్థిరపడిన కొందరికి సామాజిక సేవ చేయాలనే తపన ఉంటుంది. ఇలాంటి వారికి ఇప్పుడు.. పార్ట్‌టైమ్ విధానంలో సామాజిక సేవ చేసేందుకు పలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఈ ధోరణి మరింత ఎక్కువనే చెప్పొచ్చు. ఉదాహరణకు టీచ్ ఫర్ ఇండియా సంస్థ పార్ట్ టైమ్ లేదా స్వల్ప కాలిక వ్యవధిలో ఫెలో మెంబర్స్‌ను నియమించుకొని... తాము ఒప్పందం చేసుకున్న పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పే అవకాశం కల్పిస్తోంది.

సోషల్ వర్క్.. బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్..
1. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్
2. ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
3. ఎం.ఎస్.యూనివర్సిటీ బరోడా
4. మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్
5. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
6. ఆంధ్రా యూనివర్సిటీ
7. దేవి అహల్య విశ్వవిద్యాలయం
8. బెనారస్ హిందూ యూనివర్సిటీ
9. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ
10. రోడా మిస్ట్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్

ఉద్యోగావకాశాలు...
ఎన్‌జీఓలు:
సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు అనగానే మనకు గుర్తొచ్చేవి.. స్వచ్ఛంద సంస్థలే (ఎన్‌జీఓ: నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్). వీటిలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, కౌన్సెలర్స్, ట్రైనర్స్, ప్రోగ్రామ్ మేనేజర్/ఎగ్జిక్యూటివ్, ఫండ్ రైజర్, మానిటరింగ్/ ఎవాల్యుయేషన్ ఆఫీసర్, రీసెర్చర్, ప్రోగ్రామ్ డెరైక్టర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి.

ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్:
ఏదైనా ఒక ప్రాంతంలో అభివృద్ధి చేపడుతున్న సంస్థ.. వాటిని ప్రాథమిక స్థాయిలో పర్యవేక్షించే విధంగా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ను నియమించుకుంటోంది. ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగాలు అందుకోవచ్చు. సగటున నెలకు రూ.8 వేల వేతనం లభిస్తోంది.

కౌన్సెలర్ :
ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఒక విభాగాన్ని అభివృద్ధి చేయాలంటే.. ముందుగా ఆ ప్రాంత ప్రజలను మెప్పించడం, ఒప్పించడం ఎంతో ముఖ్యం. అందుకోసం ఎన్‌జీవోలు కౌన్సెలర్స్‌ను నియమిస్తున్నాయి. వీరు చేయాల్సిందల్లా తాము చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, వాటి లక్ష్యాలు, అందులో సంబంధిత ప్రాంత ప్రజలు పాల్పంచుకోవాల్సిన తీరుపై అవగాహన కల్పించడం. వాస్తవానికి ఇది అత్యంత కీలకమైన ఉద్యోగంగా చెప్పొచ్చు. సంప్రదాయ పద్ధతులకు అలవాటు పడిన ఒక ప్రాంత ప్రజలు ఒక్కసారిగా కొత్త వ్యక్తులతో కలిసి పనిచేయడానికి కొంత వెనుకడుగు వేస్తారు. అందుకే కౌన్సెలర్స్ కీలకంగా నిలుస్తున్నారు. సంస్థలు కూడా ఈ స్థాయి ఉద్యోగాలకు సోషల్ వర్క్, సోషియాలజీ, సైకాలజీ వంటి కోర్సులు అభ్యసించిన వారినే ఎక్కువగా నియమించుకుంటున్నాయి. వేతనాలు కూడా నెలకు సగటున రూ. 20 వేల వరకు లభిస్తున్నాయి.

ట్రైనర్:
సామాజిక సేవా రంగంలో మరో కీలకమైన ఉద్యోగం.. ట్రైనర్. ముఖ్యంగా వ్యవసాయం, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాలు, స్వయం ఉపాధి కార్యక్రమాల పరంగా.. ఒక ప్రాంతంలోని లక్షిత వర్గాల ప్రజలకు సంబంధిత అంశాలపై శిక్షణనివ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే.. ఆ రంగంలో ఆధునిక సాగు పద్ధతులు ద్వారా అధిక దిగుబడి పొందే విధానాలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించడం. సంస్థలు, ఆయా విభాగాల్లో పీజీ డిగ్రీ పొందిన వారిని (ఉదాహరణకు ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంఏ ఎకనామిక్స్ తదితర) నియమిస్తున్నాయి. వీరికి నెలకు సగటున రూ. 30 వేల వరకు వేతనం అందిస్తున్నాయి.

ప్రోగ్రామ్ మేనేజర్/ఎగ్జిక్యూటివ్ :
ఒక ప్రాంతంలో ఒక విభాగంలో అభివృద్ధి కార్యక్రమాల కార్యాచరణ దిశగా వాటిని సమర్థంగా నిర్వహించేందుకు ప్రోగ్రామ్ మేనేజర్స్‌ను సంస్థలు నియమిస్తున్నాయి. వీరు చేయాల్సిందల్లా.. సంబంధిత క్లస్టర్లలో అమలవుతున్న ప్రోగ్రామ్స్‌ను క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్వహిస్తున్న తీరును పరిశీలించడం, అవసరమైతే మార్పు, చేర్పులు సూచించడం. ఈ హోదాలోనూ నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం లభిస్తుంది.

ఫండ్ రైజర్ :
సామాజిక అభివృద్ధి దిశగా కార్యక్రమాలు చేపట్టే సంస్థలకు ప్రధానంగా ఎదురయ్యే సమస్య.. ఆర్థిక నిధులు. ఫండ్ రైజర్స్ తమ సంస్థలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇతర వ్యాపార సంస్థలు, వ్యక్తులకు తెలియజేసి వారి నుంచి నిధులు సమీకరించాల్సి ఉంటుంది.

మానిటరింగ్/ఎవాల్యుయేషన్ ఆఫీసర్ :
ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను నిరంతరం సమీక్షించడం, వాటికి సంబంధించిన నివేదికలను సంస్థ ఉన్నతాధికారులకు అందించడం మానిటరింగ్/ఎవాల్యుయేషన్ అధికారుల ప్రధాన బాధ్యత.

రీసెర్చర్ :
ఒక సంస్థ.. నిర్ణీత ప్రాంతంలో ఏదైనా విభాగంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే.. దానికి సంబంధించి.. ఆ ప్రాంతంలోని వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం, చేపట్టే కార్యక్రమాల పరంగా.. నిర్దిష్టంగా ప్రణాళికలు రూపొందించడం, లక్షిత వర్గాలను గుర్తించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ హోదాలో సోషల్ వర్క్, సోషియాలజీలో మాస్టర్ కోర్సులు పూర్తిచేసిన వారికి సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. నెలకు సగటున రూ.35 వేల వరకు వేతనం లభిస్తుంది.

ప్రోగ్రామ్ డెరైక్టర్ :
నిర్దిష్టంగా ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు నిర్వర్తించాల్సిన విధులు, సదరు కార్యక్రమం అమలు చేయడంపై దిశానిర్దేశం చేయడం ప్రోగ్రామ్ డెరైక్టర్స్ ప్రధాన విధులుగా ఉంటున్నాయి. ప్రోగ్రామ్ డెరైక్టర్‌కు సంస్థ స్థాయిని బట్టి నెలకు రూ.50వేల వరకు... ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్లకు రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం లభిస్తోంది. ఈ హోదాల్లోనూ సోషల్ వర్క్, సోషియాలజీలో నిపుణులకే సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి.





































#Tags