ఫార్మసీలో మాస్టర్స్.. కేరాఫ్ నైపర్

ఫార్మసీ కోర్సు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. కారణం.. మారుతున్న ప్రజల జీవన శైలి.. వెలుగు చూస్తున్న కొత్త వ్యాధులు.. వీటి నిర్మూలనకు అవసరమైన ఔషధాల తయారీ.. వాటి కోసం చేసే పరిశోధనలు.. ఈ క్రమంలో ఇమిడి ఉన్న ఎన్నో విభాగాలు.. వాటన్నింటిపై నైపుణ్యాలను అందించే కోర్సు.. ఫార్మసీ. ఫార్మసీ కోర్సులను అందించడంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ విద్యాసంస్థ... నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్). హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు క్యాంపస్‌ల ద్వారా ఫార్మసీలో ఉన్నత విద్యనందిస్తున్న నైపర్‌లలో.. ప్రత్యేక ముద్ర వేసుకున్న నైపర్-హైదరాబాద్ క్యాంపస్‌పై ఇన్‌స్టిట్యూట్ వాచ్...

దేశంలో ఫార్మసీ రంగంలో కొత్త ఔషధాల తయారీ.. పరిశోధనల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 1998లో మొహాలీ ప్రధాన కేంద్రంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు రూపకల్పన చేసింది. ఆ తర్వాత క్యాంపస్‌ల విస్తరణలో భాగంగా 2007లో ప్రారంభమైన నైపర్-హైదరాబాద్ అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకుంటోంది. మౌలిక సదుపాయాలు మొదలు.. మెరుగైన పరిశోధనల వరకు అన్ని కోణాల్లో ప్రత్యేకత నిరూపించుకుంటోంది.

మాస్టర్స్ కోర్సులు ప్రధానంగా
కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన నైపర్ ప్రధాన ఉద్దేశం.. ఫార్మసీలో ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్ది ఈ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించడం. ఈ క్రమంలో నైపర్-హైదరాబాద్‌లో మాస్టర్స్ (పీజీ) స్థాయిలో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి..
  • ఎంఎస్ ఫార్మసీలో మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, రెగ్యులేటరీ టాక్సికాలజీ స్పెషలైజేషన్లు.
  • అదే విధంగా ఫార్మసీలో టెక్నాలజీ అంశాలను సమ్మిళితం చేస్తూ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ(ప్రాసెస్ కెమిస్ట్రీ) స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ను అందిస్తోంది.
  • దాంతోపాటు ఫార్మాస్యూటికల్ విభాగాల్లో నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సునూ ఆఫర్ చేస్తోంది.
పరిశోధనలకూ ప్రాధాన్యం
నైపర్-హైదరాబాద్ క్యాంపస్.. అకడెమిక్ కోర్సులకే పరిమితం కాకుండా.. పరిశోధనలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్ విభాగాల్లో నిరంతర పరిశోధనలు చేస్తోంది. దీనిలో భాగంగా స్పాన్సర్డ్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ ఆధారిత రీసెర్చ్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తోంది. 2009లో ప్రారంభమైన రీసెర్చ్ విభాగంలోని ఫ్యాకల్టీ ఇప్పటివరకు దాదాపు వందకుపైగా అంతర్జాతీయ పబ్లికేషన్స్ ప్రచురించడమే నైపర్-హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ ప్రాధాన్యతకు నిదర్శనం. వీటికి అదనంగా ఈ ఇన్‌స్టిట్యూట్ సొంతంగా సైంటిఫిక్ జర్నల్ ఆఫ్ నైపర్-హైదరాబాద్ పేరుతో ఫార్మా రంగంలోని తాజా పరిణామాలతోఇన్‌హౌస్ మ్యాగజైన్‌ను కూడా ప్రచురిస్తోంది. ఇలా అన్ని విధాలుగా విద్యార్థులకు తాజా సమాచారం, సరికొత్త అంశాలపై విసృ్తతమైన అవగాహన కల్పిస్తోంది.

టాప్ క్లాస్ లేబొరేటరీ
ఫార్మసీ విద్యలో నైపుణ్యం సాధించడంలో కీలక పాత్ర లేబొరేటరీలదే. దీనికి సంబంధించి డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్‌లో అవసరమైన సాంకేతిక సదుపాయాలు కలిగిన ఆధునిక లేబొరేటరీ నైపర్-హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా నెలకొన్న ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లతో విద్యార్థులు అనుసంధానమయ్యే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులకు క్షేత్ర స్థాయిలోని తాజా పరిణామాలపై అవగాహన కలిగించేలా నిరంతరం జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. క్లాస్ రూం టీచింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. టీచర్- స్టూడెంట్ నిష్పత్తి 1:8 ఉండేలా వ్యవహరిస్తూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన బోధన లభించేందుకు కృషి చేస్తోంది.

సగటున 80 శాతం ప్లేస్‌మెంట్స్
సాధారణంగా ఇన్‌స్టిట్యూట్, కోర్సు ఏదైనా విద్యార్థుల లక్ష్యం.. ఉన్నతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవడం. ఈ విషయంలోనూ నైపర్-హైదరాబాద్ ముందంజలో నిలుస్తోంది. ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా సగటున 80 శాతం మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. అరబిందో ఫార్మా, రెడ్డీ ల్యాబ్స్ వంటి జాతీయ స్థాయి సంస్థలతోపాటు యూఎస్ ఫార్మాకోపియా, పెర్కిన్ ఎల్మర్ వంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కూడా ఏటా నిర్వహించే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో పాల్గొంటున్నాయి.

పవేశం పొందాలంటే
నైపర్-హైదరాబాద్‌లోని పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే.. ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నైపర్-మొహాలీ ప్రతి ఏటా నిర్వహించే నైపర్-జేఈఈలో ర్యాంకు సాధించాలి. ఆ తర్వాత నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా నైపర్- క్యాంపస్‌లలో సీట్ల భర్తీ జరుగుతుంది. పీహెచ్‌డీ ఔత్సాహిక అభ్యర్థులు నైపర్ పీహెచ్‌డీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్‌లో అర్హత సాధించాలి.
వెబ్‌సైట్: www.niperhyd.ac.in

ఫార్మసీ కోర్సులకు చిరునామా
‘‘నైపర్ క్యాంపస్‌లు ఫార్మసీ కోర్సులకు చిరునామాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ క్యాంపస్ వేగంగా విస్తరిస్తోంది. విద్యార్థులకు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు సొంతమయ్యేందుకు నగర పరిసరాల్లో ఏర్పాటైన బల్క్ డ్రగ్ సంస్థలు, ఇతర డ్రగ్ డెవలప్‌మెంట్ సంస్థలు కూడా దోహదపడుతున్నాయి. అంతేకాకుండా పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఇతర యూనివర్సిటీల్లోని పీజీ ఫార్మసీ కోర్సులతో పోల్చితే నైపర్ కరిక్యులం, బోధన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రాక్టికల్ ఓరియెంటేషన్, రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమిచ్చేలా ఉండే కరిక్యులం ద్వారా విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునే సమయానికి ఫార్మసీ రంగంలో పరిపూర్ణత సాధిస్తారు. ఫార్మసీలో నాణ్యమైన మానవ వనరులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడినందున నైపర్‌లో ప్రవేశాలు కూడా జీప్యాట్ కాకుండా నైపర్-జేఈఈలో ర్యాంకు ఆధారంగా జరుగుతాయి’’
ప్రొఫెసర్ ఎన్.సత్యనారాయణ, రిజిస్ట్రార్, నైపర్-హైదరాబాద్















#Tags