Forensic Science: నేరాలకు చెక్.. ఫోరెన్సిక్ సైన్స్‌తో కెరీర్ అవకాశాలు..
నిత్యం ఎక్కడో ఒక చోట.. నేరాలు,ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి! నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడం అంత తేలిక కాదు. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యాలు అవసరం! ఈ స్కిల్స్‌ను అందించే కోర్సు.. ఫోరెన్సిక్ సైన్స్!! అందుకే.. ఇటీవల కాలంలో.. ఫోరెన్సిక్ సైన్స్ కోర్సుల ఉత్తీర్ణులకు డిమాండ్ పెరుగుతోంది! ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ)లో అర్హత సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో ప్రవేశం పొందొచ్చు. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ తీరుతెన్నులు, ఫోరెన్సిక్ సైన్స్‌తో కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
- ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులకు పెరిగిన డిమాండ్
- ఏఐఎఫ్‌ఎస్‌ఈటీతో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో ప్రవేశం
- కోర్సు పూర్తి చేసుకుంటే నిఘా సంస్థలు, నేర పరిశోధన విభాగాల్లో కొలువులు
- 2022 విద్యా సంవత్సరానికి మొదలైన ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ ప్రక్రియ
టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. మరోవైపు అదే సాంకేతికత ఆధారంగా జరుగుతున్న నేరాలు అనేకం. భౌతిక దాడులు, హత్యలు, దోపిడీలే కాకుండా.. సైబర్ నేరాల సంఖ్య సైతం పెరుగుతోంది. నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు చట్టానికి దొరక్కుండా.. అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నేర పరిశోధన సవాల్‌గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేరస్తులను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.. ఫోరెన్సిక్ సైన్స్. అందుకే ఇటీవల కాలంలో ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ స్కిల్స్ సొంతం చేసుకునేందుకు ప్రత్యేక కోర్సులు చదవాల్సి ఉంటుంది. బ్యాచిలర్ స్థాయిలోనే పలు యూనివర్సిటీలు ఫోరెన్సిక్ సైన్స్‌ను అందిస్తున్నాయి. ఆయా ఫోరెన్సిక్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం.. ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్(ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ). ఇంటర్మీడియెట్ బైపీసీ, ఎంపీసీతో ఈ పరీక్షకు హాజరుకావచ్చు.
జాతీయ స్థాయి పరీక్ష
ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ ద్వారా జాతీయ స్థాయిలోని పలు యూనివర్సిటీల్లో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో ప్రవేశం పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఎంట్రన్స్ స్కోర్ ఆధారంగా వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ, ఇన్‌వర్టిస్ యూనివర్సిటీ, అలక్ ప్రకాశ్ గోయల్ సిమ్లా యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలు బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
వంద మార్కులకు పరీక్ష
ఏఐఎఫ్‌ఎస్‌ఈటీని జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం వంద ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,బయాలజీ,కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు.వీటితోపాటు ఫోరెన్సిక్ సైన్స్ నిర్వచనం, నేపథ్యం, నేరాలు, పోలీస్ వ్యవస్థ, నేర ఘటనాస్థలి, జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ విభాగాల నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి.
గ్రూప్ సబ్జెక్టులపై పట్టు
- ఏఐఎఫ్‌ఎస్‌ఈటీలో అడిగే ప్రశ్నలు ఇంటర్మీడియెట్ బైపీసీ, ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌ల సిలబస్ అంశాల నుంచే ఉంటాయి. కాబట్టి విద్యార్థులు తమ గ్రూప్ సబ్జెక్ట్‌లపై పట్టు సాధిస్తే.. పరీక్షలో మెరుగైన స్కోర్ సొంతం చేసుకోవచ్చు.
- బోటనీ: లివింగ్ అండ్ నాన్ లివింగ్; జెనిటిక్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్, ఆరిజన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ లైఫ్, హ్యూమన్ డిజార్డర్స్, యానిమల్ ఫిజియాలజీ, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ప్లాంట్ ఫిజియాలజీ, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ఎకాలజీ అండ్ ఎకో సిస్టమ్స్ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి.
- ఫిజిక్స్: యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్, మెకానిక్స్, హీట్ ట్రాన్స్‌ఫర్, లైట్ అండ్ సౌండ్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజమ్, మోడ్రన్ ఫిజిక్స్ వంటి వాటి నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- కెమిస్ట్రీ: అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మేటర్, మిక్చర్స్ సొల్యూషన్స్ అండ్ సాల్యుబిలిటీ, పిరియాడిక్ టేబుల్, వాటర్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ఎన్విరాన్‌మెంట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
- ఈ చాప్టర్లకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధ్యయనం చేస్తే ఎంట్రన్స్‌లో మంచి స్కోర్ సాధించి.. బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో ప్రవేశం ఖరారు చేసుకోవచ్చు.
చదవండి: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ తో బహుళ ప్రయోజనాలెన్నో...
ఉజ్వల భవిష్యత్తు
- బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం పలు సంస్థల నివేదికలు, గణాంకాల ప్రకారం–దేశంలో ఫోరెన్సిక్ నిపుణుల కొరత నెలకొంది. కాబట్టి బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ పూర్తి చేసుకుని సర్టిఫికెట్‌తో బయటికి వస్తే..చక్కటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
- బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువులు లభిస్తున్నాయి.
- ప్రభుత్వ రంగంలో..సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలు, ఫింగర్ ప్రింట్ బ్యూరోలు, ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్, సీబీఐ, ఐబీ వంటి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు దక్కుతాయి.
- ప్రైవేట్ రంగంలో ఫార్మాస్యుటికల్ సంస్థలు, ఆçసుపత్రులు, ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వీటితోపాటు విద్యా రంగంలోనూ అధ్యాపకులుగా కెరీర్ ప్రారంభించొచ్చు. ఇందుకోసం పీజీ, ఆపై స్థాయిలో ఫోరెన్సిక్ సైన్స్‌ను స్పెషలైజేషన్‌గా చదవాల్సి ఉంటుంది.
ఉన్నత విద్య
బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ పూర్తి చేసుకున్న వారికి ఉన్నత విద్య అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పలు సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర డీమ్డ్ యూనివర్సిటీలు.. ఎమ్మెస్సీ ఫోరెన్సిక్ సైన్స్ స్పెషలైజేషన్‌ను అందిస్తున్నాయి. ఈ కోర్సులో భాగంగా క్రిమినాలజీ, ఫోరెన్సిక్ ఆంత్రోపాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ,అనలిటికల్ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ టాక్సికాలజీ తదితర సబ్జెక్ట్‌లను కరిక్యులంలో భాగంగా బోధిస్తారు. ఫలితంగా నేర పరిశోధన,నిఘాకు సంబంధించి మరిన్ని నైపుణ్యాలు సొంతమవుతాయి.
వేతనాలు
నేర నిర్ధారణ,నిందితుల గుర్తింపులో కీలకంగా వ్యవహరిస్తున్న ఫోరెన్సిక్ నిపుణులకు వేతనాలు కూడా భారీగానే లభిస్తున్నాయి. బ్యాచిలర్ అర్హతతో ఈ రంగంలో అడుగు పెట్టిన అభ్యర్థులు నెలకు రూ.50వేల వరకు అందుకునే వీలుంది. పీజీ, పీహెచ్‌డీ పట్టాలతో ఫోరెన్సిక్ లేబొరేటరీల్లో పని చేసే వారికి రూ.లక్ష వరకు వేతనం అందుతోంది.
ఫోరెన్సిక్ కొలువులు
బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుతం లభిస్తున్న కొలువుల వివరాలు...
క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్
ఏదైనా నేరం జరిగినప్పుడు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్.. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, నేరం జరిగిన తీరును అంచనా వేయడం, ఆధారాలను ల్యాబొరేటరీల్లో శాస్త్రీయంగా విశ్లేషించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్
వీరు నేరస్థుల మానసిక పరిస్థితిని విశ్లేషిస్తారు. తద్వారా విచారణ పరంగా వారి మానసిక సన్నద్ధతకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. దీని ఆధారంగా సదరు విచారణ చేపట్టే విషయంలో నిర్దిష్ట చర్యలు తీసుకుంటారు.
ఫోరెన్సిక్ టాక్సికాలజిస్ట్
హత్యలు జరిగినప్పుడు ముఖ్యంగా ఎలాంటి భౌతిక దాడుల ఉనికి లేని సందర్భాల్లో.. హతులు ఏదైనా విష ప్రయోగంతో చనిపోయారా.. లేదంటే ఇతర డ్రగ్స్ కారణంగా మరణించారా.. వంటి విషయాలను పరిశీలిస్తారు.
ఫోరెన్సిక్ స్పీచ్ ఎక్స్‌పర్ట్స్
వీరు ఏదైనా నేరం జరిగినప్పుడు.. సదరు ఘటనా స్థలంలో లభించిన పత్రాలు, సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఆడియో టేప్‌లను పరిశీలిస్తారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తిస్తారు.
ఫోరెన్సిక్ ఆడిటింగ్
ఇటీవల కాలంలో ఆర్థిక నేరాలు కూడా పెరుగుతుండటంతో..ఫోరెన్సిక్ ఆడిటింగ్ కీలకంగా మారుతోంది. ఆర్థిక అవకతవకతలకు పాల్పడిన సంస్థలకు సంబంధించిన పత్రాలను విశ్లేషించడం, అక్రమాలు జరిగిన విభాగాలను లేదా వ్యక్తులను గుర్తించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
చదవండి: కెరీర్‌కు లైఫ్‌లైన్...లైఫ్‌సెన్సైస్ కోర్సులు
ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ–2022.. ముఖ్య సమాచారం
- అర్హత: ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లతో ఇంటర్మీడియెట్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 2022లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 29.01.2022
- ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ పరీక్ష తేదీ: జనవరి 30, 2022
- ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 1, 2022
- వెబ్‌సైట్: https://aifset.com
సునిశిత పరిశీలన, నిఘా నేత్రం
ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో రాణించాలనుకునే వారికి సహజంగా రెండు లక్షణాలు ఉండాలి. అవి.. సునిశిత పరిశీలన, నిఘా నేత్రంతో చూసే లక్షణం. ఏదైనా నేరం జరిగినప్పుడు ఆధారాలను అన్వేషించే క్రమంలో ప్రతి వస్తువును సునిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అదే విధంగా కొన్ని సందర్భాల్లో అతి సూక్ష్మమైన వస్తువులు సైతం నేరాన్ని ఛేదించేందుకు ఉపయోగపడతాయి. ఒకట్రెండు అక్షరాలు, అంకెల మార్పుతోనూ సైబర్ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వాటన్నింటినీ కనిపెట్టేలా సూక్ష్మ దృష్టి, నిఘా నేత్రంతో చూసే తత్వం ఉండాలి. ఈ రంగంలో కెరీర్ అవకాశాల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
–ప్రొ‘‘ కె.వి.కె.శాంతి, కోర్స్ కోఆర్డినేటర్, పీజీ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, నల్సార్, హైదరాబాద్
చదవండి: కెరీర్ గైడెన్స్...మైక్రోబయాలజీ