నిఫ్ట్‌.. ఫ్యాషన్‌ డిజైన్‌ కెరీర్‌కు లిఫ్ట్‌

ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ లంటే టక్కున గుర్తొచ్చేది ఐఐటీలు, ఐఐఎంలు మాత్రమే. కానీ.. ఈ కోవలోకి చెందిన మరో ఇన్‌స్టిట్యూట్‌ ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ’. రెండున్నర దశాబ్దాలకుపైగా చరిత్రతో కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌ల ద్వారా బ్యాచిలర్‌, మాస్టర్స్‌ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సుల్లో మొత్తం 2680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైన నేపథ్యంలో నిఫ్ట్‌ అందించే కోర్సులపై ఫోకస్‌..

నిఫ్ట్‌ క్యాంపస్‌లు: బెంగళూరు, రాయ్‌బరేలి, హైదరాబాద్‌, గాంధీనగర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, చెన్నై, కాంగ్రా, కన్నూర్‌, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, షిల్లాంగ్‌, పాట్నా.

కోర్సులు:
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులు:
యాక్సెసరీ డిజైన్‌ (సీట్లు-390), నిట్‌వేర్‌ డిజైన్‌ (సీట్లు-210), ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌ (సీట్లు-270), లెదర్‌ డిజైన్‌ (సీట్లు-120), ఫ్యాషన్‌ డిజైన్‌ ( సీట్లు-390), టెక్స్‌టైల్‌ డిజైన్‌ (సీట్లు-390).
వ్యవధి: నాలుగేళ్లు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి 10+2 ఉత్తీర్ణత.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీ.ఎఫ్‌టెక్‌) కోర్సులు:
అపరెల్‌ ప్రొడక్షన్‌ (సీట్లు-330).
వ్యవధి: నాలుగేళ్లు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.
వయోపరిమితి: బ్యాచిలర్‌ ప్రోగ్రామ్స్‌ అన్నింటికి అక్టోబర్‌ 1, 2013 నాటికి 23 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు, శారీరక వికలాంగులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

మాస్టర్స్‌ కోర్సులు:
మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌;
సీట్లు- 90
వ్యవధి: రెండేళ్లు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా నిఫ్ట్‌ లేదా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఉత్తీర్ణత.

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌; సీట్లు-390
వ్యవధి:
రెండేళ్లు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్‌/నిడ్‌ నుంచి మూడేళ్ల యూజీ డిప్లొమా ఉత్తీర్ణత.

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ; సీట్లు - 100
వ్యవధి:
రెండేళ్లు
అర్హత: నిఫ్ట్‌ లేదా ఇతర గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.
వయోపరిమితి: మాస్టర్స్‌ కోర్సులకు వయోపరిమితి లేదు.

ఇలా.. అన్ని కోర్సుల్లో కలిపి మొత్తం 2680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీ (నాన్‌ క్రిమిలేయర్‌)లకు 27 శాతం, శారీరక వికలాంగులకు 3 శాతం సీట్లు కేటాయించారు.

ప్రవేశ పరీక్ష:
కంప్యూటర్‌ బేస్డ్‌/పేపర్‌ బేస్డ్‌:
నిఫ్ట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష రెండు పద్ధతుల్లో ఉంటుంది. అవి.. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌; పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులకు దరఖాస్తు చేసేవారు రెండు అంచెల్లో జరిగే పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌కు హాజరుకావాలి. బీఎఫ్‌టెక్‌, ఎంఎఫ్‌టెక్‌, ఎం.ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ అభ్యర్థులు పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌-1తోపాటు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)రాయాలి.

క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌ (సీఏటీ): అటు బ్యాచిలర్‌ .. ఇటు మాస్టర్‌ డిజైన్‌ కోర్సులకు నిఫ్ట్‌ తొలిదశలో నిర్వహించే మొదటి దశ క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌ మొత్తం ఒకే విభాగంలో సాగుతుంది. ఇందులో అభ్యర్థి పరిశీలనను, డిజైనింగ్‌, క్రియేటివ్‌ ఇన్నోవేషన్‌ను పరీక్షిస్తారు. పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు.

జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (జీఏటీ): రెండో దశలో నిర్వహించే జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ నాలుగు విభాగాల్లో జరుగుతుంది. అవి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ; కమ్యూనికేషన్‌ ఎబిలిటీ-ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌; అనలిటికల్‌ ఎబిలిటీ; జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ (25 ప్రశ్నలు) మినహాయించి మిగిలిన అన్ని విభాగాల్లో 30 చొప్పున ప్రశ్నలుంటాయి. మొత్తం 150 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు.

బీఎఫ్‌టెక్‌, ఎంఎఫ్‌ఎం, ఎంఎఫ్‌టెక్‌ కోర్సులకు నిర్వహించే జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌లో క్వాంటేటిటివ్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ అండ్‌ ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, కేస్‌ స్టడీలపై ప్రశ్నలుంటాయి. మూడు కోర్సులకు విభాగాల వారీగా ప్రశ్నల సంఖ్యలో మార్పులుంటాయి. మొత్తం మీద 150 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు.

మాస్టర్స్‌ కోర్సుల ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులకు తదుపరి దశల్లో సిట్యువేషన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

వెయిటేజ్‌:
బ్యాచిలర్‌ డిజైన్‌ కోర్సులు:
జీఏటీ 30 శాతం; సీఏటీ 50 శాతం; సిట్యుయేషన్‌ టెస్ట్‌ 20 శాతం.
బీఎఫ్‌టెక్‌: జీఏటీ స్కోర్‌ నూరు శాతం వెయిటేజీ.

మాస్టర్స్‌ ప్రోగ్రామ్స్‌:
డిజైన్‌ కోర్సు:
జీఏటీ 30 శాతం; సీఏటీ 40 శాతం; గ్రూప్‌ డిస్కషన్‌ 15 శాతం; ఇంటర్వ్యూ 15 శాతం.
ఎం.ఎఫ్‌.ఎం/ఎం.ఎఫ్‌టెక్‌: జీఏటీ 70 శాతం; గ్రూప్‌ డిస్కషన్‌ 15 శాతం; ఇంటర్వ్యూ 15 శాతం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మన రాష్ట్రంలో పీబీటీ-1 పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్‌, విశాఖపట్నం
పీబీటీ-2, సీబీటీ పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్‌ 4, 2013
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 10, 2014
ఫేజ్‌-1 (పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌): ఫిబ్రవరి 9, 2014
ఫేజ్‌-2 (పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌
(బి.డిజైన్‌, ఎం.డిజైన్‌ కోర్సులకు)): ఫిబ్రవరి 23, 2014
ఫేజ్‌-2 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (మిగిలిన అన్ని కోర్సులకు): ఫిబ్రవరి 23, 2014
సిట్యువేషన్‌ టెస్ట్‌/జీడీ/పర్సనల్‌ ఇంటర్వ్యూ:
ఏప్రిల్‌ - మే 2014
వెబ్‌సైట్‌: www.nift.ac.in

మెరుగైన స్కోర్‌కు మార్గాలు
బ్యాచిలర్‌ స్థాయి కోర్సులకు నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత స్థాయి పదో తరగతి, ఇంటర్‌ స్థాయిలో, మాస్టర్స్‌ కోర్సులకు ఎంట్రెన్‌‌సలో ప్రశ్నల క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఎంచుకున్న కోర్సు ఆధారంగా విభాగాలవారీగా ప్రిపరేషన్‌ సాగించి మెరుగైన స్కోర్‌కు మార్గం వేసుకోవాలి.

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: ఇది ప్రధానంగా అభ్యర్థిలో గణిత సామర్థ్యాన్ని, అర్థమెటిక్‌ అవేర్‌నెస్‌ను పరీక్షించే విభాగం. ఈ క్రమంలో అయిదంకెల సంఖ్యల హెచ్చవేతలు-గుణింతాలు-శేషాలు-నిశ్శేష సంఖ్యలు; కూడికలు, తీసివేతలు, భాగహారాలు వంటి ప్రాథమిక గణిత అంశాలపై దృష్టి సారించాలి. అర్థమెటిక్‌కు సంబంధించి పని-సమయం, కాలం-దూరం; వడ్డీరేట్లు; నిష్పత్తులు-విలోమాలు; శాతాలు, భాగస్వామ్యం-పెట్టుబడులు; నిష్పత్తి-విలోమం వంటి అంశాలపై ప్రాక్టీస్‌ చేయడం ఉపయుక్తం.

కమ్యూనికేషన్‌ ఎబిలిటీ: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన విభాగమిది. ఇందులో ప్రశ్నలు ప్రధానంగా వొకాబ్యులరీ, యూసేజ్‌ ఆధారితంగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌, యాంటానిమ్స్‌-సినానిమ్స్‌, సింగ్యులర్‌-ప్లూరల్‌ వర్డ్స్‌ వంటి వాటిపై పట్టు సాధిస్తే ఈ విభాగాన్ని సులభంగానే ఎదుర్కోవచ్చు.

ఇంగ్లిష్‌ కాంప్రెహెన్షన్‌: ఇది ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు అడిగే విభాగం. ఒక ప్యాసేజ్‌ను ఇచ్చి దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సదరు ప్రశ్నకు.. ప్యాసేజ్‌లో సరితూగే సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ విభాగంలో రాణించాలంటే వేగంగా చదవడం, రాయడం, చదివిన విషయ సారాన్ని గుర్తించడం వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. నిరంతరం ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం, రేడియోలో వార్తలు వినడం వంటివి చక్కటి మార్గాలు.

జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్‌‌స: కేవలం సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ కాకుండా విద్యార్థికి సామాజిక అంశాలపై అవగాహన, జనరల్‌ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. దీంతో ఔత్సాహిక అభ్యర్థులు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ-రాజ్యాంగం వంటి విభాగాలపై ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. వాటిలోని ముఖ్యాంశాలను పాయింట్స్‌ రూపంలో పొందుపర్చుకోవడం ద్వారా ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే జీఏటీలో సులువుగా రాణించొచ్చు.

కేస్‌ స్టడీ టెస్ట్‌:
జీఏటీలో ప్రత్యేకంగా రూపకల్పన చేసిన విభాగం కేస్‌ స్టడీ టెస్ట్‌. నిర్దేశిత సమస్య పేర్కొని దానికి జవాబును ఆశిస్తారు. అంటే.. సదరు అంశంపై అవగాహన, తార్కిక విశ్లేషణ నైపుణ్యం ఉంటేనే కేస్‌ స్టడీ టెస్ట్‌లో నెగ్గే అవకాశం.

డ్రాయింగ్‌, క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌:
క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌.. నిఫ్ట్‌ ఎంట్రెన్స్‌లో రెండో విభాగం. ఫ్యాషన్‌ టెక్నాలజీ అంటే వినూత్న ఆవిష్కరణలకు పెట్టింది పేరు. దానికి ముందు ఎంతో పరిశ్రమ ఉంటుంది. అది పేపర్‌పై డ్రాయింగ్‌తో మొదలై ప్రొడక్ట్‌ మార్కెట్లో విడుదలతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్యాషన్‌ టెక్నాలజీ ఔత్సాహికులకు డ్రాయింగ్‌లో ప్రాథమిక నైపుణ్యాన్ని, సృజనాత్మక, ఊహాత్మక, సమయస్ఫూర్తి నైపుణ్యాలు పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం సీఏటీ. ఏదైనా ఒక ప్రదేశానికి చిత్రరూపం ఇవ్వమని అడుగుతారు. ఉదా: రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాలు.

సిట్యుయేషన్‌ టెస్ట్‌:
ఇది కూడా సృజనాత్మక శక్తిని పరీక్షించే విభాగంగానే పేర్కొనొచ్చు. డ్రాయింగ్‌ టెస్ట్‌ పేపర్‌ ఆధారితంగా ఉంటే.. ఈ సిట్యుయేషన్‌ టెస్ట్‌ భౌతిక ఆకృతులు రూపకల్పన చేసే విధంగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని పరికరాలు లేదా సామగ్రి లేదా వస్తువులు అందజేసి వాటి ద్వారా ఒక నిర్ణీత ఆకృతిని రూపొందించమని అడుగుతారు. ఉదా: రెండు అట్టముక్కలు ఇచ్చి వాటి ద్వారా కంప్యూటర్‌ను రూపొందించమని అడగడం. అకడెమిక్‌గా ఎలాంటి నేపథ్యం ఉండని విభాగమిది. కాబట్టి దీనికి మార్గం సొంత ప్రాక్టీస్‌ మాత్రమే.

పీజీ కోర్సులకు జీడీ, పర్సనల్‌ ఇంటర్వ్యూ:
నిఫ్ట్‌ పీజీ కోర్సుల ప్రవేశ ప్రక్రియలో కీలక దశలు గ్రూప్‌ డిస్కషన్‌(జీడీ), ఇంటర్వ్యూ. 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఉండే జీడీలో కొందరు అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పరచి నిర్దిష్ట అంశంపై చర్చించమంటారు. ప్రధానంగా కొత్త ఆలోచనలు, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆలోచనల్లో స్పష్టత, లీడర్‌షిప్‌ స్కిల్స్‌, చొరవ వంటి అంశాలను పరీక్షిస్తారు. కాబట్టి దీనికోసం మాక్‌ గ్రూప్‌ డిస్కషన్స్‌కు హాజరు కావడం, రిటెన్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌పై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇంటర్వ్యూలో భాగంగా కెరీర్‌ ఓరియెంటేషన్‌, ఈ రంగంపై విద్యార్థి ఆసక్తి, అకడెమిక్స్‌- కోకరిక్యులర్‌ కార్యక్రమాల్లో వ్యక్తిగత విజయాల గురించి ప్రశ్నలడుగుతారు. అంతేకాకుండా అభ్యర్థి జనరల్‌ అవేర్‌నెస్‌, సృజన్మాతక ఆలోచనలు తెలుసుకునేలా ఇంటర్వ్యూ ఉంటుంది.

----------------------------------------------------------------------------------------------
సృజనాత్మకత ఉంటే విజేతలు మీరే
కొత్త పుంతలు తొక్కుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా ఫ్యాషన్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. అయితే ఫ్యాషన్‌ అనగానే కేవలం డ్రెస్సింగ్‌ ఒక్కటే అనే అపోహ నుంచి బయటపడాలి. మొబైల్‌ పౌచ్‌ నుంచి కళ్లజోడు వరకూ న్యూలుక్‌ ఇచ్చేదంతా డిజైనర్లే. గ్లోబలైజేషన్‌ ప్రభావంతో ఫ్యాషన్‌, డిజైనింగ్‌ రంగాల్లో బోలెడు అవకాశాలున్నాయి. దీనికి కావాల్సింది ఆసక్తి, సృజనాత్మకత ఈ రెండూ మీ దగ్గరుంటే చాలు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ను కెరీర్‌కు ఎంచుకోవచ్చు. మారుతున్న ప్రపంచ అవసరాలకు తగినట్లుగా కోర్సులను ఎంపికచేసుకునే దిశగా ఆలోచన చేయాలి. రిటైల్‌ మార్కెటింగ్‌ పెరుగుతున్న కొద్దీ ఈ రంగంలో కెరీర్‌ అద్భుతంగా ఉంటుంది. ఎంప్లాయిమెంట్‌ అవకాశాలూ గతంతో పోల్చితే 100 శాతం పెరిగాయి. సొంతంగా బొటిక్‌, డిజైనింగ్‌ స్టూడియో ఏర్పాటుచేసుకుని మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు. కళల పట్ల ఇష్టం ఉన్న ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ కూడా ఫ్యాషన్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. ఫ్యాషన్‌ పట్ల ఆసక్తి ఉండి ఆర్థిక ఇబ్బందులున్న వారికి బ్యాంకు రుణాలు కూడా అందిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి.
-డాక్టర్‌ ఎన్‌.జె.రాజారామ్‌,
డెరైక్టర్‌, నిఫ్ట్‌, హైదరాబాద్‌






















































#Tags