యూకేలో ఉన్నత విద్యను అభ్యసించడానికి కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..

యునెటైడ్ కింగ్‌డమ్(యూకే)లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక చేయూతనిచ్చే కామన్‌వెల్త్ మాస్టర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విదేశాల్లో పీజీ చేసేందుకు అయ్యే పూర్తి వ్యయాన్ని పొందే వీలుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 21వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కామన్‌వెల్త్ మాస్టర్స్ స్కాలర్‌షిప్..
యూకేలో మాస్టర్స్ చేయాలనుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించేందుకు ప్రారంభించిందే.. కామన్ వెల్త్ మాస్టర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. యూకేకు చెందిన కామన్‌వెల్త్ కమిషన్ ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. దీనిద్వారా యూకేలో మాస్టర్ కోర్సు పూర్తి చేసుకునేందుకు అయ్యే మొత్తం ఖర్చును పొందే అవకాశం ఉంటుంది. అర్హత ఉండి, అభ్యర్థి ఎంచుకున్న ఏడాది వ్యవధిగల పీజీ కోర్సులో ప్రవేశం ఖరారు చేసుకునే వారికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్‌లను ప్రతీఏటా అందిస్తారు. 2021గాను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది.

అర్హతలు..
  • ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు భారతీయ పౌరుడై ఉండి.. భారతదేశంలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి.
  • బ్యాచిలర్ డిగ్రీని అక్టోబర్ 21నాటికల్లా పూర్తి చేసుకోవాలి. ఈ సంవత్సరం సెప్టెంబర్/అక్టోబర్ 2021లో యూకేలో విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అక్కడ కోర్సులో చేరడానికి విద్యార్థి అందుబాటులో ఉండాలి. అలాంటి అభ్యర్థులు కామన్‌వెల్త్ మాస్టర్స్ స్కాలర్‌షిప్ 2021కు దరఖాస్తు చేసుకోవచ్చు. యూకేలో చదవడానికి ఆర్థిక స్తోమత లేని వారు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
  • ఇది వరకే విదేశాలకు ఎడ్యుకేషన్/ట్రైనింగ్/స్పెషలైజేషన్లను సొంత ఖర్చులతో పూర్తిచేసినవారు కూడా ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తుకు అర్హులు. ఆయా కోర్సుల కాల వ్యవధి.. ఆరు నెలలకు మించకుండా ఉండాలి. అలాగే గత రెండేళ్లుగా భారత్‌లోనే నివాసం ఉండటం తప్పనిసరి.
  • 2020 సెప్టెంబర్/అక్టోబర్‌లలో ప్రవేశం పొంది.. డిఫర్ అయిన అభ్యర్థులు కూడా ప్రస్తుత దరఖాస్తుకు అర్హులే.

ఇంకా చదవండి: part 2: కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్ పొందేందుకు అవకాశం ఉన్న కోర్సులు ఇవే..