జేఈఈ, నీట్‌ ఏటా రెండు సార్లు.. ప్రయోజనమెంత?

దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతిష్టాత్మక ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, నిట్‌ల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్... దేశంలోని మెడికల్ కాలేజీల్లో వైద్య కోర్సుల్లో అడ్మిషన్స్కు జరిపే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లను ఏటా రెండుసార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంతో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు.. ప్రతికూలతలు.. ఆయా పరీక్షలకు విద్యార్థులు ఎలా సన్నద్ధమవ్వాలో తెలుసుకుందాం...
కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. జేఈఈ మెయిన్, నీట్‌తోపాటు యూజీసీ నెట్, సీమ్యాట్, జీప్యాట్ తదితర ప్రవేశ పరీక్షలను కూడా ఎన్‌టీఏ నిర్వహించనుంది. ఎన్‌టీఏ.. ఇప్పటికే వివిధ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. జేఈఈ-మెయిన్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో.. నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో... అలాగే యూజీసీ నెట్‌ను డిసెంబర్‌లో.. సీమ్యాట్, జీప్యాట్‌లను జనవరిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్ (కంప్యూటర్) విధానంలోనే జరపనుంది.

ప్రయోజనాలు..
  • ఐఐటీల్లో సీటు ఆశించే విద్యార్థులకు, ఎంబీబీఎస్‌లో సీటే లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తున్న విద్యార్థులకు ఏటా రెండుసార్లు పరీక్ష నిర్వహణ సానుకూలం కానుంది.
  • పోటీ అధికంగా ఉండే ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీటు.. అలాగే మెడికల్ కాలేజీలో ప్రవేశం కోసం లాంగ్‌టర్మ్ ప్రిపరేషన్ సాగించే విద్యార్థుల సంఖ్య ఎక్కువే. ఏటా రెండుసార్లు పరీక్ష నిర్వహించడం ఇలాంటి విద్యార్థులకు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. ఎందుకంటే... ఒకసారి తడబడినా... మరోసారి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసే వీలుంటుంది. రెండుసార్లు జేఈఈ మెయిన్ రాస్తే .. అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.
  • విద్యార్థులు రెండుసార్లు తప్పనిసరిగా పరీక్ష రాయాలనే నిబంధన లేదు. మొదటిసారే మంచి ర్యాంకు సాధిస్తే.. మరోమారు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఒక విద్యార్థి జనవరిలో జేఈఈ మెయిన్‌లో రాణిస్తే.. మరోసారి మెయిన్‌కు కాకుండా.. నేరుగా జేఈఈ అడ్వాన్స్డ్‌కు సిద్ధమవడానికి అవసరమైన సమయం లభిస్తుంది. ఐఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మాత్రం ఇప్పటిలాగే ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు.
  • పరీక్ష సమయాన్ని నిర్దేశిత తేదీల్లో విద్యార్థి తన వెసులుబాటు మేరకు ఎంచుకునే అవకాశముంది. నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తారు.
ప్రతికూల అంశాలు...
  • జనవరి, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్.. ఫిబ్రవరి, మేలో నీట్ నిర్వహించనున్నారు. కాబట్టి విద్యార్థులు ఇంటర్‌లో చేరిన మొదటి రోజు నుంచే ప్రవేశ పరీక్షల కోణంలో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. దాంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  • ఏడాదికి రెండుసార్లు జేఈఈ మెయిన్, నీట్ నిర్వహించనున్న నేపథ్యంలో... ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ కళాశాలలు ఆగస్టు 5 లోపు అకడమిక్ సిలబస్ మొత్తం పూర్తిచేయాలని బోధనా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని కాలేజీలు సెప్టెంబర్ 15లోగా ఇంటర్ సిలబస్ పూర్తిచేయాలని సూచించినట్లు సమాచారం. ఇది ఒకరకంగా విద్యార్థులపై ఒత్తిడి పెంచడమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
  • ఇప్పటికే ఒత్తిడితో చిత్తవుతున్న విద్యార్థులు.. ఇకపై ఏటా రెండుసార్లు పరీక్ష అంటే... నిరంతరం కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల ఒత్తిడిని మరింతగా ఎదుర్కొవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆన్‌లైన్ విధానం.. తిప్పలు తప్పవు !
  • జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండడం విద్యార్థులకు ప్రతికూల అంశమని నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో.. ఆన్‌లైన్ టెస్టులకు హాజరైన విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. ఎప్పుడూ 10 శాతానికి మించి విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలు రాసిన దాఖలాలు లేవు. గతేడాది కూడా 11 లక్షల మందికిపైగా జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుంటే... వీరిలో దాదాపు 10 లక్షల మంది పెన్, పేపర్ విధానంలోనే పరీక్ష రాయడానికి మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు ఈ పరీక్ష తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలనే నిబంధనతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
  • ఎన్‌టీఏ.. ప్రత్యేక కేంద్రాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఆన్‌లైన్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కల్పించనుంది. కంప్యూటర్లు ఉన్న పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలను గుర్తించి శని, ఆదివారాల్లో ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని ఎన్‌టీఏ చెబుతోంది. సెప్టెంబర్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆగస్టు మూడో వారం నుంచే ఉచితంగా ప్రాక్టీస్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఇవి విద్యార్థులకు ఏ మేరకు ఉపయోగపడతాయనేది ప్రశ్నార్థకమే. ముఖ్యంగా తరగతులు జరిగే సమయంలో బయటికి వచ్చి ఆన్‌లైన్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మార్పులు లేవు :
జేఈఈ మెయిన్, నీట్ పరీక్ష సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అలాగే పరీక్ష విధానం, మాధ్యమం, ఫీజు తదితర వాటిల్లోనూ ఎటువంటి మార్పులు ఉండవని పేర్కొంది. సాంకేతికపరంగా ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా.. అత్యంత భద్రతాపరమైన ఐటీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు ఎన్‌టీఏ ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రిపరేషన్ విధానం :
ఏటా రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంతో విద్యార్థులు తమ సన్నద్ధత వ్యూహాంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు చదువుతూనే.. జేఈఈ మెయిన్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు... జేఈఈ/నీట్‌ల కోసం ఫస్ట్ ఇయర్, సెకండియర్ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. కాబట్టి సెకండియర్‌లో చేరినప్పటి నుంచే ముందుగా ఇంటర్ సిలబస్ పూర్తిచేసుకొని.. జేఈఈ/నీట్ సిలబస్‌పై దృష్టిపెట్టాలి. జేఈఈ మెయిన్ జనవరి/ఏప్రిల్‌లో...నీట్ ఫిబ్రవరి/మేలో ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకోవాలి.

పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ :
జేఈఈ మెయిన్- 2019 :
జనవరి:
దరఖాస్తుల స్వీకరణ: 2018, సెప్టెంబర్ 1-సెప్టెంబర్ 30.
పరీక్ష తేదీలు: 2019, జనవరి 6 నుంచి జనవరి 20.
ఫలితాలు: ఫిబ్రవరి తొలి వారం.
ఏప్రిల్:
దరఖాస్తుల స్వీకరణ: 2019, ఫిబ్రవరి రెండో వారం.
పరీక్ష తేదీలు: 2019, ఏప్రిల్ 7-ఏప్రిల్ 21.
ఫలితాలు: మే తొలి వారం.

నీట్-2019
ఫిబ్రవరి:
దరఖాస్తుల స్వీకరణ: 2018, అక్టోబర్ 1-అక్టోబర్ 31.
పరీక్ష తేదీలు: 2019, ఫిబ్రవరి 3-ఫిబ్రవరి 17.
ఫలితాలు: మార్చి తొలి వారంలో.
మే:
దరఖాస్తుల స్వీకరణ: మార్చి రెండో వారం.
పరీక్ష తేదీలు: 2019, మే 12-మే 26.
ఫలితాలు: జూన్ తొలివారం.
వెబ్‌సైట్: https://nta.ac.in