ఇంజనీరింగ్.. క్రేజ్ తగ్గుతోందా?

ఇంజనీరింగ్ విద్యకు క్రమంగా ఆదరణ తగ్గుతుంది. విద్యార్థులు ఎందుకు అసక్తి కనబరచడం లేదు? అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది...? కారణాలేమిటి..? వాస్తవాలపై విశ్లేషణ...
భర్తీకానివి.. దాదాపు ముప్ఫై శాతం :
రాష్ట్రాల స్థాయిలో ఇంజనీరింగ్‌లో సీట్ల మిగులు దాదాపు ముప్ఫై శాతం మేర నమోదవుతోంది. నాలుగైదేళ్లుగా ఇదే పరిస్థితి. చివరికి కన్వీనర్ కోటా సీట్లు సైతం భర్తీ కావడం లేదు.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే...
ఒకప్పుడు బీటెక్ అనగానే విద్యార్థులు రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇప్పుడు ఇంజనీరింగ్‌లో చేరాలంటే.. ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి. ఇండస్ట్రీ అవసరాల్లో రోజురోజుకీ మార్పులు వస్తుండటం.. నిరంతరం కొత్త నైపుణ్యాలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత.. కోర్సు పూర్తయ్యే నాటికి ఎలా ఉంటుందో తెలియని జాబ్ మార్కెట్ ట్రెండ్ . ఈ కారణాలతోనే విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారని నిపుణులు అంటున్నారు.

మారని కరిక్యులం...
ఇంజనీరింగ్‌కు ఆదరణ తగ్గడానికి మూస ధోరణి కరిక్యులం కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఓ వైపు విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటే.. సంబంధిత నియంత్రణ సంస్థలు టీచింగ్, కరిక్యులంలలో పాత పద్ధతులు వీడటం లేదనే వాదన ఉంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో కరిక్యులంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నాయి. కాని యూనివర్సిటీలకు అనుబంధంగా, ఏఐసీటీఈ పరిధిలోని కళాశాలల్లో భిన్నమైన పరిస్థితి ఉంది.

ఆందోళన కలిగిస్తున్న సర్వేలు :
ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో రానున్న రోజుల్లో ఐఓటీ పాత్ర పెరిగి పర్యవసానంగా మానవ వనరుల ప్రమేయం తగ్గనుంది. దీని ప్రభావం మానవ వనరుల నియామకాలపైనా పడుతుందని.. కంపెనీలు ఉన్న ఉద్యోగాలను కూడా తగ్గించే ఆస్కారముందంటూ వస్తున్న పలు సర్వేలు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సంస్థలు సైతం తమ వార్షిక నియామకాల ప్రణాళికల్లో తగ్గుదల ఉంటుందని చెబుతున్నాయి. తాజా నైపుణ్యాలు అందుకునే దిశగా కరిక్యులం ఉండటంలేదు. స్వయంగా నేర్చుకోవాలనుకున్నా సంబంధిత వేదికల గురించి అవగాహన కల్పించేవారు లేరు. దాంతో విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని విద్యావేత్తలు అంటున్నారు.

మౌలిక సదుపాయాల సమస్య :
ఇంజనీరింగ్‌లో చేరుదాం అనుకునే విద్యార్థులకు ఎదురవుతున్న మరో సమస్య.. కళాశాలల్లో మౌలిక సదుపాయాల లేమి. కొన్నిచోట్ల ఏఐసీటీఈ నిబంధనలకు సరితూగే సదుపాయాలు మచ్చుకైనా కనిపించని పరిస్థితి. కళాశాలకు గుర్తింపు కొనసాగుతుందో లేదో తెలియదు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలనే పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు 40 కాలేజీలకు ఏఐసీటీఈ గుర్తింపు ఇచ్చినా.. జేఎన్‌టీయూ మాత్రం రద్దు చేసింది.

నచ్చిన బ్రాంచ్‌లో సీటు రాకపోవడం :
వ్యక్తిగత కోణంలో విశ్లేషిస్తే పలువురు విద్యార్థులకు సీటు వచ్చినా.. కోరుకున్న బ్రాంచ్ రాకపోవడంతో చేరేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఈ ఏడాది పదుల సంఖ్యలోని కళాశాలల్లో కొన్ని బ్రాంచ్‌ల్లో ఒక్క సీటూ భర్తీ కాలేదు.

ప్రత్యామ్నాయాలపై చూపు...
విద్యార్థులు ఇంజనీరింగ్‌కు ప్రత్యామ్నాయంగా, సుస్థిర కెరీర్ అందించే విభాగాలవైపు దృష్టిసారిస్తున్నారు. వాటి ద్వారా ఉద్యోగ సాధనకు కొంత ఎక్కువ సమయం పట్టినప్పటికీ.. ఒక్కసారి కుదురుకుంటే సుదీర్ఘకాలం మనుగడ సాగించొచ్చనే అభిప్రాయంలో ఉన్నారు.

పరిశోధనల దిశగా.. తొలి మెట్టుగా సైన్స్..
భవిష్యత్తులో పరిశోధనలకు తొలి మెట్టుగా భావిస్తూ, ముఖ్యంగా ఇంటర్మీడియెట్‌లో కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవైపీవై) ప్రోగ్రామ్‌లలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు సైన్స్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంలోనూ ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో (ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌ఈఆర్ తదితర) ప్రవేశమే లక్ష్యంగా సాగుతున్నారు.పస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సైన్స్ పరిశోధన ఔత్సాహికులకు పలు ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా కారణంగా పరిశోధనలకు, స్టార్టప్‌లకు అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం కనిపిస్తోంది. ఈ కారణంతోనే విద్యార్థులు సైన్స్‌ను ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంటున్నారు.

ఎంబీఏపైనా తగ్గుతున్న ఆసక్తి :
మన విద్యార్థులకు ఇంజనీరింగ్ తర్వాత అత్యంత క్రేజీగా నిలుస్తున్న కోర్సు మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఎంబీఏ). అయితే.. కొత్త స్పెషలైజేషన్లు, ఇండస్ట్రీ పరంగా ఆవిష్కృతమైన విభాగాలకు అనుగుణంగా యూనివర్సిటీలు అడుగులు వేయకపోవడం, పాత పద్ధతిలోనే బోధన సాగిస్తుండటంతో ఇందులో చేరుతున్న విద్యార్థుల సంఖ్య కూడా కొంత తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో పలు ప్రైవేటు బి-స్కూల్స్ మార్కెట్ అవసరాలను నిరంతరం సునిశితంగా పరిశీలిస్తూ.. కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. ప్రత్యేకంగా ఒక రంగానికి సంబంధించిన నైపుణ్యాలతో ఫుల్‌టైమ్ కోర్సులను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ తదితర. దీంతో చాలామంది ప్రైవేటు బి-స్కూల్స్ వైపు దృష్టిసారిస్తున్నారు.

ప్రాక్టికాలిటీ లోపం :
ఇటు ఇంజనీరింగ్.. అటు మేనేజ్‌మెంట్ రెండు కోర్సుల పట్ల విద్యార్థుల ఆసక్తి తగ్గుతుండటానికి మరో కారణం.. ప్రాక్టికాలిటీకొరవడటం. వాస్తవ పరిస్థితులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం మన విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్‌‌జ తక్కువని చెబుతున్నాయి. ఈ కారణంగానే 70 నుంచి 80 శాతం మంది విద్యార్థులకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉండట్లేదని అంటున్నాయి.
వీటన్నిటినీ బేరీజు వేసుకుంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు.

సీట్ల మిగులు ఇలా...

తెలంగాణలో కన్వీనర్ కోటాలో

: 12,264

ఆంధ్రప్రదేశ్‌లో కన్వీనర్ కోటాలో

: 31,455

జాతీయ స్థాయిలో ఐఐటీల్లో

: 121

ఎన్‌ఐటీల్లో

: 187

ట్రిపుల్ ఐటీల్లో

: 37

ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్

: 934

(ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంసెట్ కౌన్సెలింగ్, జాతీయ స్థాయిలో జోసా గణాంకాల ప్రకారం..)

రెండు, మూడు దశాబ్దాల క్రితం :
ఇంజనీరింగ్ అంటే ఎంతో క్రేజ్. సొంత రాష్ట్రంలో సీటు అత్యుత్తమ ర్యాంకర్లకే సాధ్యం. తర్వాతి స్థానాలవారు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి.

దశాబ్దం క్రితం :
మన దగ్గర కళాశాలలు, దానికి తగ్గట్లే సీట్లూ పెరిగాయి. దాంతో ఇంజనీరింగ్ చేయాలనుకున్న విద్యార్థులందరికీ కోర్సుల్లో చేరే అవకాశం సులభంగా దక్కింది. ఫలితం.. వేలాదిమంది ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యారు.

ప్రస్తుతం..
పరిస్థితిలో పూర్తి మార్పు. ఆదరణ తగ్గుతున్న బీటెక్ కోర్సులు. ప్రత్యామ్నాయ మార్గాలవైపు యువత దృష్టి. ఐఐటీలు, ఎన్‌ఐటీల నుంచి సాధారణ ఇంజనీరింగ్ కళాశాలల వరకు భారీగా మిగిలిపోతున్న సీట్లు.

తృతీయ శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌లలోనే..
ఇంజనీరింగ్‌లో సీట్లు మిగిలిన పరిస్థితిని విశ్లేషిస్తే.. తృతీయ శ్రేణి కళాశాలలే ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల నుంచి పలు అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. విద్యార్థులు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ కొత్త అవకాశాల వేదికలను అన్వేషిస్తున్నారు. ఇంజనీరింగ్‌పై క్రేజ్ తగ్గిందనే మాట వాస్తవం కాదు.
-ఎన్.యాదయ్య, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ-హెచ్

మార్పులు చేస్తున్నాం...
ఇంజనీరింగ్ కరిక్యులంలో మార్పులు చేయకపోవడంతోనే విద్యార్థులు చేరట్లేదనే మాట సరికాదు. మొత్తం ప్రోగ్రామ్‌లో మార్పులు లేకున్నా.. కొన్ని కోర్సుల పరంగా మార్పుచేర్పులు చేస్తున్నాం. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి, సీట్లు మిగలడానికి మరెన్నో కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది జాబ్ మార్కెట్‌పై దూరదృష్టితో ఆలోచిస్తుండటమే.
- ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబా, ఏపీ ఎంసెట్ కన్వీనర్