ఈ టెస్ట్‌లో స్టాండర్డ్‌ స్కోర్‌తో.. విదేశీ విద్యకు తొలి అడుగు!!

స్టడీ అబ్రాడ్‌.. విదేశీ విద్య.. అనగానే విద్యార్థులు ఏ యూనివర్సిటీ మంచిది? ఎప్పుడు ప్రవేశాలు ఉంటాయి? ఏ కోర్సులకు డిమాండ్‌ ఉంది? వీటి గురించే ఎక్కువగా అన్వేషిస్తారు! కాని వీటితోపాటు మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది..

అదే ప్రీ–రిక్విజిట్‌ టెస్ట్‌లు!! జీమ్యాట్, జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, శాట్, ఏసీటీలను ప్రీ–రిక్విజిట్‌ టెస్ట్‌లుగా పిలుస్తున్నారు. వీటినే స్టాండర్ట్‌ టెస్ట్‌లుగానూ పేర్కొంటున్నారు. వీటిలో సాధించిన స్కోరే.. విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి తొలి మార్గంగా నిలుస్తుంది. మంచి స్కోర్‌ సొంతం చేసుకుంటే.. బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టొచ్చు. ప్రస్తుతం పలు విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. విదేశీ విద్యకు అవసరమైన ఈ ప్రీ–రిక్విజిట్‌ టెస్ట్‌లు, పరీక్ష విధానాలు, బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టడానికి అవసరమైన స్కోర్ల గురించి తెలుసుకుందాం...

ఏదైనా విదేశీ యూనివర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటే.. సదరు వర్సిటీ అధికారులు అకడమిక్‌ అర్హతలతో పాటు ప్రధానంగా పరిశీలించేది.. ప్రీ–రిక్విజిట్‌ (స్టాండర్ట్‌ టెస్ట్స్‌)లో పొందిన స్కోరే! దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌లో, విద్యార్థులకు ప్రవేశాలు ఖరారు చేసే విషయంలో..స్టాండర్ట్‌ టెస్టుల స్కోర్‌ ఎంతో కీలకంగా నిలుస్తుంది. కాబట్టి.. విద్యార్థులు కేవలం బెస్ట్‌ యూనివర్సిటీల అన్వేషణే కాకుండా.. తాము చేరాలనుకుంటున్న కోర్సుకు సం బంధించి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు కోరుకుంటున్న టెస్టుల గురించి తెలుసుకోవాలి. సదరు‡టెస్ట్‌ల్లో బెస్ట్‌ స్కోర్‌ సొంతం చేసుకోవడానికి కృషి చేయాలి అనేది నిపుణుల అభిప్రాయం.

మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌కు..
విదేశీ యూనివర్సిటీల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు.. గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(జీమ్యాట్‌)లో మంచి స్కోర్‌ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా దాదాపు మూడు వేలకుపైగా ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో జీమ్యాట్‌ స్కోర్‌ ఆధారంగానే ప్రవేశాలు ఖరారు చేస్తున్నారు. జీమ్యాట్‌ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో.. ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. అవి.. అనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌; ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌; వెర్బల్‌ ఎబిలిటీ; క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ. అందుబాటులో ఉండే∙సమయం మూడున్నర గంటలు. ఇలా మొత్తం నాలుగు విభాగాల్లో గరిష్టంగా 800పాయింట్లకు స్కోర్‌ను లెక్కిస్తారు. బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్, టాప్‌–10, టాప్‌–20, టాప్‌–50 జాబితాలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందాలంటే.. కనీసం 675కు పైగా స్కోర్‌ సాధించాల్సి ఉంటుంది.

ఏడాది పొడవునా: జీమ్యాట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో ఏడాది పొడవునా నిర్ణీత తేదీల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు గరిష్టంగా అయిదుసార్లు పరీక్ష రాయొచ్చు. ప్రతి పరీక్షకు మధ్య కనీసం 16 రోజుల వ్యవధి ఉండాలి. జీమ్యాట్‌ నిర్దేశిత సెంటర్లలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి.. తమకు అనుకూలమైన తేదీలు, సెంటర్లు లభించాలంటే.. అభ్యర్థులు కనీసం మూడు నెలల ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం మేలు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.mba.com/india

ఇంకా చ‌ద‌వండి: part 2: విదేశాల్లో సైన్స్, ఇంజనీరింగ్‌లో పీజీ కోర్సుల కోసం.. ఈ టెస్ట్‌లో మంచి స్కోరు సాధించాల్సిందే..