బీటెక్‌లో ప్రాక్టికల్‌ పరుగులు.. ల్యాబ్‌ వర్క్‌కు ప్రాధాన్యం..!

బీటెక్‌లో అడుగుపెట్టారా.. కార్పొరేట్‌ ప్రపంచంలో ఉన్నత స్థాయి కెరీర్‌ కోరుకుంటున్నారా.. ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకుంటే.. చక్కటి భవిష్యత్తు ఖాయమని కలలుకంటున్నారా?!

మీ స్వప్నం సాకారం కావాలంటే.. జాబ్‌ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా.. నిత్యం నైపుణ్యాలు మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు! ముఖ్యంగా ల్యాబ్‌ వర్క్, కోడింగ్‌ స్కిల్స్‌ కీలకం అంటున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు.. అకడమిక్‌ స్థాయిలోనే.. తొలి ఏడాది నుంచే.. ‘ప్రాక్టికల్‌’ దృక్పథంతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి! ఈ నేపథ్యంలో.. బీటెక్‌∙విద్యార్థులు.. ల్యాబ్‌వర్క్‌లో రాణించేందుకు.. కోడింగ్‌ నైపుణ్యాలు నేర్చుకునేందుకు మార్గాలు...

బీటెక్‌ విద్యార్థులు క్షేత్ర నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఇందుకోసం తాము చదివే అంశాలను ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ స్కిల్స్‌ పెంపొందించుకోవాలి. ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ.. విద్యార్థులు ప్రాక్టికల్‌ దృక్పథం అలవర్చుకోవాలని నిపుణులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. అందుకోసం ఇంజనీరింగ్‌ విద్యార్థులు లేబొరేటరీ వర్క్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అంతేకాకుండా రోజురోజుకూ ప్రాధాన్యం సంతరించుకుంటున్న కోడింగ్‌ స్కిల్స్‌ సొంతం చేసుకునేందుకు కృషి చేయాలి.

ల్యాబ్‌ వర్క్‌కు ప్రాధాన్యం..
ఇంజనీరింగ్‌ అంటేనే.. వాస్తవ పరిస్థితుల్లో అప్లికేషన్‌ అప్రోచ్‌తో విధులు నిర్వహించాల్సిన విభాగం. దీనికి సంబంధించి అకడమిక్‌గా అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. ల్యాబ్‌వర్క్‌. ఇది విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న థియరీ అంశాలపై ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ సొంతం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనిద్వారా కాన్సెప్ట్యువల్‌ క్లారిటీ, అప్లికేషన్‌ స్కిల్స్‌ సొంతమవుతాయి. ఇప్పుడు ప్రతి రంగంలోనూ కీలకమైన డిజైనింగ్‌ నైపుణ్యాల ఆర్జనకు సైతం ల్యాబ్స్‌ ఉపయుక్తమని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఏ బ్రాంచ్‌ విద్యార్థులకైనా డిజిటల్‌ స్కిల్స్‌ తప్పనిసరి. వీటిని సొంతం చేసుకోవడానికి కూడా ల్యాబ్‌వర్క్‌ తోడ్పడుతుంది. ముఖ్యంగా ల్యాబ్‌వర్క్‌ ద్వారా విద్యార్థులకు రియల్‌ టైమ్‌ నైపుణ్యాలతో పాటు ప్రాబ్లమ్‌ సాల్వింగ్, క్రిటికల్‌ థింకింగ్, డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌ అలవడుతాయి.

ఇంకా చ‌ద‌వండి: part 2: కాలేజీలో షెడ్యూల్‌ ప్రతి రోజు నిర్దిష్ట సమయం.. వీటిపై దృష్టి పెట్టడం మంచిది..