BITSAT 2024: మేటి ఇంజనీరింగ్‌కు మార్గం.. బిట్‌శాట్
- బిట్‌శాట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- బిట్స్ క్యాంపస్‌ల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులు
- బిట్‌శాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు
- రెండు విడతల్లో బిట్‌శాట్ పరీక్ష నిర్వహణ
బిట్స్ పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌ల్లో.. ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సులుగా పేర్కొనే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి బిట్‌శాట్‌ను ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ అభ్యర్థులు సైతం పోటీ పడే పరీక్ష ఇది. దీంతో పోటీ అధికంగా ఉంటుంది.
క్యాంపస్‌లు.. బ్రాంచ్‌లు
- పిలానీ క్యాంపస్: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటితోపాటు బీఫార్మ్, ఎమ్మెస్సీ(బయలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఎమ్మెస్సీ జనరల్ స్టడీస్ కోర్సులను అందిస్తున్నారు.
- గోవా క్యాంపస్: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటితోపాటు ఎమ్మెస్సీ బయలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కోర్సులను అందిస్తున్నారు.
- హైదరాబాద్ క్యాంపస్: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్‌లు ఉన్నాయి.
- వీటితోపాటు బీఫార్మ్, ఎమ్మెస్సీ బయలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కోర్సులు అందిస్తున్నారు.
చదవండి: CAT 2023 Results: క్యాట్.. మలిదశలో మెరిసేలా!
అర్హతలు
10+2/ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ(బి.ఫార్మ్ కోర్సులో అడ్మిషన్ కోసం)లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. గ్రూప్ సబ్జెక్ట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ)లలో.. ప్రతి సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. 10+2/ఇంటర్మీడియెట్ 2023లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, 2024లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
130 ప్రశ్నలకు బిట్‌శాట్
- బిట్‌శాట్ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. నాలుగు విభాగాల్లో 3 గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. పార్ట్-1: ఫిజిక్స్ 30ప్రశ్నలు; పార్ట్-2: కెమిస్ట్రీ 30 ప్రశ్నలు; పార్ట్-3: ఎ) ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ 10 ప్రశ్నలు, బి) లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు; పార్ట్-4: మ్యాథమెటిక్స్/బయాలజీ 40 ప్రశ్నలు ఉంటాయి.
- పార్ట్-4కు సంబంధించి బీ.ఫార్మ్ విద్యార్థులు బయాలజీ సబ్జెక్టును; బీఈ కోర్సుల అభ్యర్థులు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు చొప్పున మొత్తం 130 ప్రశ్నలు-390 మార్కులకు పరీక్ష జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కును తగ్గిస్తారు.
అదనపు ప్రశ్నల అవకాశం
మూడు గంటల్లోపు అన్ని ప్రశ్నలను పూర్తిచేసిన అభ్యర్థులకు.. అదనంగా మరో 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం కల్పిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ, లాజికల్ రీజనింగ్ నుంచి మూడు ప్రశ్నలు చొప్పున ఇస్తారు.
రెండు సెషన్లు.. బెస్ట్ స్కోర్‌తో ప్రవేశం
బిట్‌శాట్‌ను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు సెషన్లకు లేదా ఏదో ఒక సెషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు సెషన్లకు హాజరైతే.. బెస్ట్ స్కోర్ వచ్చిన సెషన్‌నే మెరిట్ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. సీట్ల కేటాయింపులో అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న క్యాంపస్ ప్రాథమ్యాలను, ఇంజనీరింగ్ బ్రాంచ్ ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. దానికి అనుగుణంగా సీట్ల కేటాయింపు చేస్తారు.
చదవండి: STEM: ఈ కోర్సులతో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు
టాపర్స్‌కు డైరెక్ట్ అడ్మిషన్
రాష్ట్రాల స్థాయిలోని ఇంటర్మీడియెట్, తత్సమాన బోర్డ్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకు పొందిన వారికి బిట్‌శాట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ బోర్డ్ టాపర్స్ నేరుగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందే వీలుంది.
మరెన్నో ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ
బిట్‌శాట్ స్కోర్ ద్వారా బిట్స్ క్యాంపస్‌లతోపాటు మరెన్నో ఇన్‌స్టిట్యూట్‌లలో బీటెక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందే వీలుంది. దాదాపు వంద వరకు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు బిట్‌శాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2024
- దరఖాస్తు సవరణకు అవకాశం: ఏప్రిల్ 15 నుంచి 19 వరకు
- టెస్ట్ సెంటర్ కేటాయింపు: మే 1, 2024
- సెషన్-1 హాల్‌టికెట్ డౌన్‌లోడ్: మే 15 నుంచి
- సెషన్-1 ఆన్‌లైన్ టెస్ట్ తేదీలు: మే 21 నుంచి మే 26 వరకు
- బిట్‌శాట్ సెషన్-2 దరఖాస్తు తేదీలు: మే 22 నుంచి జూన్ 10 వరకు
- సెషన్-2 దరఖాస్తు సవరణ అవకాశం: జూన్ 11, 12
- సెషన్-2 హాల్‌టికెట్ డౌన్‌లోడ్: జూన్ 19నుంచి
- సెషన్-2 ఆన్‌లైన్ టెస్ట్ తేదీలు: జూన్ 22 నుంచి జూన్ 26 వరకు
- అడ్మిషన్ జాబితా ప్రకటన: జూలై 3, 2024
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
- వెబ్‌సైట్: https://www.bitsadmission.com/
బెస్ట్ స్కోర్‌కు మార్గాలు
జాతీయ స్థాయిలో వేల సంఖ్యలో విద్యార్థులు పోటీ పడే బిట్‌శాట్‌లో బెస్ట్ స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి.
చదవండి: Software Jobs: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..
కాన్సెప్ట్‌లే కొండంత అండ
- బిట్‌శాట్ క్లిష్టత జేఈఈ మెయిన్ స్థాయిలో ఉంటోంది. ప్రశ్నలన్నీ దాదాపుగా అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో సమాధానం ఇవ్వాల్సిన విధంగా ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ బేసిక్స్‌పై పట్టు సాధించాలి. జేఈఈ ప్రిపరేషన్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవడం వల్ల ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత పొందొచ్చు.
- ప్రతి సబ్జెక్ట్‌లోనూ ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది.
- మ్యాథమెటిక్స్‌లో.. హైపర్‌బోలా, పారాబోలా, రెక్టాంగులర్ పారాబోలా, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, 3-డి, ఇంటెగ్రల్ కాలిక్యులస్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఫిజిక్స్‌లో.. వర్క్ అండ్ ఎనర్జీ, న్యూటన్స్ లా, కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మ్యాగ్నటిజం అండ్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్లలో ముఖ్య అంశాలతో నోట్స్ రూపొందించుకోవాలి.
- కెమిస్ట్రీలో.. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్‌ను ఒక జాబితాగా రూపొందించుకోవాలి.
పార్ట్-3కి ప్రత్యేకంగా
బిట్‌శాట్‌లో మరో ప్రత్యేకత.. పార్ట్-3. ఈ విభాగంలో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నైపుణ్యాలతోపాటు లాంగ్వేజ్, తులనాత్మక పరిశీలన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఈ విభాగాన్ని పొందుపర్చారు. పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్ గ్రామర్,వొకాబ్యులరీపై పట్టు సాధిస్తే.. ఈ విభాగంలో మంచి స్కోర్ సాధించొచ్చు.