Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!
గ్రూప్–1, గ్రూప్–2.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే ఈ పరీక్షలకు.. ఎంతో క్రేజ్. వీటికి లక్షల మంది సన్నద్ధమవుతుంటారు. నోటిఫికేషన్ సంకేతం వచ్చిదంటే చాలు.. ప్రిపరేషన్‌లో నిమగ్నమైపోతారు. విజయ సాధనకు నిర్విరామంగా కృషి చేస్తుంటారు! లక్షల మంది పరీక్షలు రాసినా.. విజయం దక్కేది కొందరికే!అడుగులు తడబడకుండా.. గమ్యం వైపు ప్రయాణం సాగించే వారే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు. విజేతల వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. దీంతో.. టాపర్స్ ఎలా చదివారు.. వారు అనుసరించిన ప్రణాళిక ఏంటి.. అనే ఆసక్తి అభ్యర్థుల్లో కలగడం సహజం. తాజాగా..రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1, 2 పరీక్షలకు నోటిఫికేషన్ల విడుదల దిశగా అడుగులు పడుతు¯ ్న నేపథ్యంలో.. గ్రూప్స్ గత విజేతల విజయ వ్యూహాల గురించి తెలుసుకుందాం...
- సిలబస్‌పై సంపూర్ణ అవగాహన ప్రధానం
- మెటీరియల్, పుస్తకాల ఎంపిక కూడా కీలకమే
- సబ్జెక్ట్‌పై పట్టుకు చదివే తీరు కూడా ముఖ్యం
- నిర్దిష్ట వ్యూహంతోనే విజయం అంటున్న గత విజేతలు
ప్రాంతీయ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి
ఏపీ, తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు ప్రాంతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. టీఎస్‌పీఎస్సీ సిలబస్‌లో తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించింది. గ్రూప్–1, గ్రూప్–2ల్లో తెలంగాణ చరిత్ర, భౌగోళిక స్వరూపం, సంస్కృతి, కళలు, సాహిత్యం తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ సిలబస్ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాధాన్య సమకాలీన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలంలో రూపొందిన కొత్త పథకాలు, ఇతర కార్యక్రమాలు, బడ్జెట్, సోషల్ సర్వే, ఆర్థిక సర్వే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పరిస్థితులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ఆర్థిక వనరులు, పంటలు, భూ సంస్కరణలు, భూదానోద్యమం, ముఖ్యమైన వనరులు, జనాభా, సెన్సెస్, అక్షరాస్యత రేటు, ఆర్థిక వృద్ధి సర్వే వంటి అంశాలను చదవాలి.
- ప్రిపరేషన్ సమయంలో ఒక అంశాన్ని ఏ విధంగా రాస్తే ఎక్కువ సమాచారం, విలువైన సమాచారం ప్రజెంట్ చేయగలమో తెలుసుకోవాలి. ఉదాహరణకు కొన్ని అంశాలకు ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్స్ ఆధారంగా కూడా పరిపూర్ణమైన సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి విషయంలో వ్యాసాలు రాయడం కంటే చార్ట్‌ల రూపంలో ప్రజెంటే చేయడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు.
- గ్రూప్స్ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం.. సమయ పాలన. ప్రిపరేషన్ మొదటి రోజు నుంచి పరీక్ష రోజు వరకు సమయ పాలన పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు ప్రతి పేపర్‌లో ఒక్కో టాపిక్/యూనిట్ చదువుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఒకరోజు ఒక యూనిట్/ టాపిక్ చదవలేకపోయినా.. తర్వాత రోజు ఒక గంట అదనంగా కేటాయించైనా సమయ పాలన గాడిలో ఉండేలా వ్యవహరించాలి. అప్పుడే విజయావకాశాలు మెరుగవుతాయి. టైంప్లాన్ విషయంలో పొరపాట్లు లేదా కష్టమైన అంశాలను విస్మరించడం వంటి వాటి వల్ల చాలామంది కొద్ది మార్కుల తేడాతో విజయావకాశాలు చేజార్చుకుంటారు. కొత్తగా ప్రిపరేషన్ సాగించే వారందరికీ సిలబస్ కూడా కొత్తదే అని గుర్తించాలి. కాబట్టి ఇతరులతో పోల్చుకుని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
–కె.హేమలత,గ్రూప్–1 విజేత(డిప్యూటీ కలెక్టర్)
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
ఆన్‌లైన్ వనరులూ వినియోగించుకోవాలి
గ్రూప్స్ అభ్యర్థులు ప్రామాణిక మెటీరియల్‌ను చదువుతూనే.. ఆన్‌లైన్‌లో ఉన్న వనరులను వినియోగించుకోవాలి. తమ ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఫలితంగా తమ బలాలు, బలహీనతలు, సంబంధిత సబ్జెక్ట్‌లో పొందిన పరిజ్ఞానం, ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. దీనిద్వారా సదరు అంశాలకు ప్రిపరేషన్ సాగించేందుకు ప్రత్యేక సమయం కేటాయించాలి.
- గ్రూప్–2 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనికోసం బిట్ బ్యాంక్స్ లేదా ఇన్‌స్టంట్ మెటీరియల్‌కు పరిమితం కాకూడదు. ఎందుకంటే.. గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలు అడిగే తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ప్రశ్న కూడా పూర్తిగా విషయ పరిజ్ఞానం ఉంటేనే సమాధానం ఇవ్వగలిగేలా ఉంటున్నాయి. అసెంప్షన్ అండ్ రీజన్ తరహా ప్రశ్నలను దీనికి ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ఒక విషయానికి సంబంధించి అన్ని కోణాల్లో పరిజ్ఞానం అవసరం. మ్యాథమెటిక్స్, సైన్స్ నేపథ్యం ఉన్న వారు గ్రూప్స్ ప్రిపరేషన్ విషయంలో ప్రత్యేక దృష్టితో వ్యవహరించాలి. ముఖ్యంగా ఎకానమీ, హిస్టరీ, పాలిటీల కోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. నాది.. బీటెక్ నేపథ్యం కావడంతో వీటికోసం ప్రత్యేకంగా ప్రిపరేషన్ సాగించాను. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అంశాలపై అవగాహనకు మెక్‌గ్రాహిల్ పబ్లికేషన్స్ పుస్తకాలు చదివాను. ఇక.. రాష్ట్ర అంశాలకు సంబంధించి అకాడమీ పుస్తకాలను, తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావ దశల కోసం వి.ప్రకాశ్ పుస్తకాలు చదివాను. గ్రూప్–1,2 రెండింటికీ సిద్ధమవ్వాలనుకునే వారు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించి.. సబ్జెక్ట్‌పై పట్టు పెంచుకోవాలి. అదే విధంగా ప్రతి అంశానికి సంబంధించి.. నిరంతర పునశ్చరణ ఎంతో ముఖ్యమని గుర్తించాలి. ప్రిపరేషన్ చివరి దశలో, పరీక్షకు ముందు ప్రాక్టీస్ టెస్ట్‌లకు హాజరు కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా పోటీని చూసి ఆందోళన చెందకుండా.. సాధించగలం అనే సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి.
బి.ప్రదీప్ కుమార్, గ్రూప్–2 విజేత (మండల పంచాయతీ ఆఫీసర్)
చదవండి: ఏపీపీఎస్సీ పరీక్ష స్టడీమెటీరియల్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, సిలబస్, గైడెన్స్, సక్సెస్ స్టోరీలు మొదలైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
బేసిక్స్‌తో ప్రారంభించి
గ్రూప్స్ అభ్యర్థులు ముందుగా తమ స్వీయ సామర్థ్యాలపై అవగాహన పెంచుకోవాలి. సాధించగలం అనే ఆత్మస్థయిర్యం సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌తో ప్రిపరేషన్ ప్రారంభించాలి. దాని ఆధారంగా సంబంధిత సబ్జెక్ట్ లేదా టాపిక్‌పై అన్ని కోణాల్లో పూర్తి పట్టు సాధించాలి. ఇందుకోసం కచ్చితంగా హైస్కూల్ స్థాయి పుస్తకాలను చదవాలి. దీనివల్ల సమయం వృధా అవుతుందనే భావన వీడాలి. పాఠశాల స్థాయి పుస్తకాలు చదవడం వల్ల సబ్జెక్ట్‌లలో వచ్చిన గ్యాప్‌ను నిలువరించుకోవచ్చు. వాస్తవానికి దీన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానాన్ని పాటించాను.
- గ్రూప్స్‌కు మొదటిసారి సన్నద్ధమవుతున్న వారు ప్రతి టాపిక్‌ను చదవాలి. అంతేకాకుండా ప్రత్యేకమైన రీడింగ్ టెక్నిక్స్ పాటించాలి. ఒక సబ్జెక్ట్‌లోని అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించి సొంతంగా ప్రశ్నలు రూపొందించుకోవాలి. ఎందుకంటే పుస్తకాల్లోని అంశాలు ప్రశ్న–సమాధానం రూపంలో ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అంశానికి సంబంధించి.. ఎందుకు? ఏమిటి? ఉద్దేశం ఏమిటి? తదితర కోణాల్లో సొంతంగా ప్రశ్నలను రూపొందించుకుని, వాటికి పుస్తకంలోని అంశాలతో తులనాత్మక సమాధానాలను గుర్తిస్తే.. ఆ అంశం నుంచి అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
- ఇప్పటికే గ్రూప్స్‌కు హాజరై మరోసారి సిద్ధమవుతున్న వారు ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేసుకోవాలి. అదే విధంగా ప్రతి టాపిక్‌కు సంబంధించి రన్నింగ్ నోట్స్ రాసుకోవడం, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం వంటివి చేయాలి.
- పుస్తకాల ఎంపిక కూడా విజయంలో ఎంతో కీలకంగా నిలుస్తుందని గుర్తించాలి. అందుకోసం ప్రామాణిక పుస్తకాలను, సిలబస్‌కు సరితూగే అంశాలు ఉన్న పుస్తకాలను ఎంచుకోవాలి. నేను పూర్తిగా అకాడమీ పుస్తకాలు, స్కూల్ పుస్తకాలనే అనుసరించాను. అకాడమీ పుస్తకాలు చదివేటప్పుడు కూడా ప్రత్యేక వ్యూహం అవసరం. వీటిలో ఫ్యాక్ట్‌తో కూడిన సమాచారం మాత్రమే ఉంటుంది. ఆ ఫ్యాక్ట్స్‌కు సంబంధించి సమకాలీన పరిణామాల గురించి తెలుసుకోవాలి.దీనికోసం సంబంధిత విషయాలపై న్యూస్ పేపర్స్‌లో వచ్చే సంపాదకీయాలు, విశ్లేషణలు చదవాలి.
- గ్రూప్–1, 2 రెండింటికీ హాజరయ్యే అభ్యర్థులు సబ్జెక్టివ్‌గా చదివితేనే విజయం దక్కుతుందని గుర్తించాలి. ఒక అంశానికి సంబంధించి సామాజికంగా, ఆర్థికంగా, భౌగోళికంగా ప్రభావితం చేసే విషయాలను అధ్యయనం చేయాలి.
–వి.శివకుమార్, గ్రూప్–2 విజేత (అసిస్టెంట్ రిజిస్ట్రార్ – కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్)
అనుసంధానం చేసుకుంటూ చదవాలి
గ్రూప్–1, 2 రెండు పరీక్షలను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు అనుసంధాన విధానాన్ని పాటించడం వల్ల ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత పొందే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం గ్రూప్స్ సిలబస్‌ను పరిశీలిస్తే.. గ్రూప్–1, 2 రెండింటిలోనూ దాదాపు ఒకే విధమైన సిలబస్ ఉంది. దీన్ని అభ్యర్థులు తమకు అనుకూలంగా మలచుకోవాలి. అదే విధంగా సబ్జెక్ట్‌ల విషయంలోనూ ఈ కోఆర్డినేషన్ అప్రోచ్ కలిసొస్తుంది. పాలిటీ–ఎకానమీ, జాగ్రఫీ–ఎకానమీ, హిస్టరీ–జాగ్రఫీ.. ఇలా సబ్జెక్ట్‌ల మధ్య అనుసంధానం చేసుకోవాలి. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా.. ఏవైనా రెండు సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై విశ్లేషణాత్మక అవగాహన పొందే అవకాశం ఉంటుంది.
టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు కోర్ సబ్జెక్ట్ అంశాలకు సంబంధించి తెలంగాణ చరిత్ర, రాజ వంశాలు వంటి రాష్ట్ర చరిత్రకు సంబంధించిన అంశాలతోపాటు సింధు నాగరికత మొదలు స్వాతంత్య్ర ఉద్యమం వరకూ అన్ని సిలబస్ అంశాలపై కనీస అవగాహన ఏర్పరచుకోవాలి. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత అవసరం. అంతేకాకుండా కోర్ సబ్జెక్ట్‌లను కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదివితే దాదాపు అన్ని పేపర్లకు ఉపయుక్తంగా ఉంటుంది.
నాన్–మ్యాథ్స్ అభ్యర్థులు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో మెంటల్ ఎబిలిటీ, అదే విధంగా మెయిన్స్‌లో పేపర్–5 కోసం కొంత ప్రత్యేక సమయం కేటాయించడం మంచిది.
మెటీరియల్ విషయంలో..తక్కువ సమయంలో ఎక్కువ విషయ పరిజ్ఞానం అందించే పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవాలి. అకాడమీ పుస్తకాలు, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించి ఇగ్నో మెటీరియల్, అదే విధంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం మేలు చేస్తుంది. వీటితోపాటు లక్ష్మీకాంత్(పాలిటీ), బిపిన్ చంద్ర (హిస్టరీ), మాజిద్ హుస్సేన్ (జాగ్రఫీ) పుస్తకాలతో ఆయా అంశాలపై పట్టు సాధించే అవకాశం లభిస్తుంది.
– కె.సురేశ్ కుమార్, గ్రూప్–1 విజేత (ఏఎస్పీ)
సమయ పాలన ఎంతో ప్రధానం
గ్రూప్స్ పరీక్షల విషయంలో అత్యంత ప్రధానమైన అంశం.. సమయ పాలన పాటించడం. ప్రిపరేషన్ సమయంలో ఆయా అంశాలపై పట్టు సాధించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. మరోవైపు ప్రిపరేషన్ నుంచే నిర్దిష్ట సమయ పాలన అలవర్చుకుంటే పరీక్షలోనూ ఎలాంటి ఆందోళన లేకుండా, ఒత్తిడికి గురికాకుండా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
- ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందు అభ్యర్థులు ప్రధానంగా సిలబస్‌లోని అంశాలను, పరీక్ష విధానాన్ని అవగాహన చేసుకోవాలి. సిలబస్‌లో తమకు పట్టున్న అంశాలు, గుర్తున్న అంశాలను, క్లిష్టంగా భావించే అంశాలను విభజించుకొని.. వాటి ప్రాధాన్యం మేరకు ప్రిపరేషన్‌లో టైం కేటాయించాలి. అదే విధంగా ప్రిపరేషన్ సమయంలో ముఖ్యమైన అంశాలతో సూటిగా, స్పష్టంగా, సరళంగా సమాధానం రాసేలా ప్రాక్టీస్ చేయాలి. దీన్ని ప్రిలిమ్స్, స్క్రీనింగ్ టెస్ట్‌ల ప్రిపరేషన్ నుంచే అనుసరించాలి. దీనివల్ల తర్వాత దశలో ఉండే మెయిన్స్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
- ప్రిపరేషన్ సమయంలో ఒక సబ్జెక్ట్‌లో ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్లను రాసుకోవాలి. మలి దశలో సదరు సబ్జెక్ట్ ప్రిపరేషన్‌కు ఉప క్రమించినప్పుడు అంతకుముందు పాయింట్ల రూపంలో రాసుకున్న వాటిలో ఎన్ని గుర్తున్నాయో అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. పుస్తకాల ఎంపిక కూడా ఆయా సబ్జెక్ట్‌లలో పట్టు సాధించే విషయంలో ఎంతో కీలకంగా నిలుస్తుంది. ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ఒకట్రెండు ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. దీనికి భిన్నంగా ఒకే సబ్జెక్ట్‌కు అయిదారు పుస్తకాలు చదివితే మరింత నాలెడ్జ్ వస్తుందనుకోవడం పొరపాటే అవుతుంది.
- మెటీరియల్ ఎంపిక విషయంలో హిస్టరీకి బిపిన్ చంద్ర పుస్తకాలు, పాలిటీకి లక్ష్మీకాంత్ పుస్తకం, ఎకానమీ విషయంలో మిశ్రా అండ్ పూరి మెటీరియల్ ఉపయుక్తంగా ఉంటాయి. అదే విధంగా డిగ్రీ స్థాయిలోని హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ పుస్తకాలు తప్పక అధ్యయనం చేయాలి. రాష్ట్రాల సంబంధిత అంశాల విషయంలో అకాడమీ పుస్తకాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అదే విధంగా సోషియో ఎకనామిక్ సర్వే, బడ్జెట్ గణాంకాలు చదవడం లాభిస్తుంది. అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో తాము చదివిన అంశాలు దీర్ఘకాలం గుర్తుండేలా మెమొరీ టిప్స్ పాటించాలి. తమకు అనుకూలమైన టిప్స్‌ను అనుసరించాలి. ఉదాహరణకు పాయింటర్స్ అప్రోచ్, షార్ట్ నోట్స్, టాపిక్ వైజ్‌గా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం, విజువలైజేషన్, మైండ్ మ్యాపింగ్ వంటి టెక్నిక్స్ ఉపయోగపడతాయి.
–ఎ.వెంకట రమణ, గ్రూప్–1 విజేత(డిప్యూటీ కలెక్టర్)