Collector Nishant Kumar: పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

పార్వతీపురం: పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత, ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రతివారం దత్తత పాఠశాలలను అధికారులు సందర్శించాలని కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ఆదేశించారు. వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలలను పరిశీలించిన సమయంలో విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి ఉపాధ్యాయులకు సూచనలు చేయాలన్నారు. నోట్‌, వర్క్‌బుక్స్‌ను ఉపాధ్యాయులు తనిఖీ చేసినది, లేనిదీ విధిగా పరిశీలించాలని సూచించారు. ఈ నెల 24వ తేదీన విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షను నిర్వహించి అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించాలన్నారు.

  • చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత నివారణకు ఐసీడీఎస్‌ సిబ్బంది చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను యథావిధిగా తెరవాలని సూచించారు.
  • జల్‌జీవన్‌ మిషన్‌ పనులు, గృహనిర్మాణం పనులు వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్‌ కింద పీవీటీజీలకు శతశాతం గృహాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో 9,825 కుటుంబాలకు ఇళ్లు అవసరమున్నట్టు ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు. దీనిపై డిసెంబర్‌ 31 నాటికి సర్వేను పూర్తిచేయాలని ఇంజినీరింగ్‌ సిబ్బందిని ఆదేశించారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా అందిన ఫారం 6,7,8 దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఓటరు నమోదు అధికారులను ఆదేశించారు.

చ‌ద‌వండి: AP 10th Class Study Material

26 నుంచి ఆడుదాం–ఆంధ్రా పోటీలు
ఆడుదాం–ఆంధ్రా క్రీడా పోటీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతాయని కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే 193 మైదానాలు గుర్తించగా, 125 మైదానాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ క్రీడాంశంలో జరిగే పోటీల్లో 15 సంవత్సరాల వయస్సు పైబడిన మహిళలు, పురుషులు తలపడేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ఆర్‌.గోవిందరావు, డీఆర్వో జె.వెంకటరావు, కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీ జి.కేశవనాయుడు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.జగన్నాథ రావు, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకరరావు, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి డా.ఎంవీఆర్‌ కృష్ణాజీ, గృహనిర్మాణ సంస్థ ఇన్‌చార్జి పీడీ రమేష్‌, జిల్లా పశుసంవర్ధక అధికారి రత్నాకర్‌, డీపీఓ బి.సత్యనారాయణ, జిల్లా సర్వే సెటిల్మెంట్‌ అధికారి కె.రాజ్‌కుమార్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఎం.ఎన్‌.రాణి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్‌. వేంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: 10th Class Public Exams 2024: ఈ టిప్స్ ఫాలో అవ్వండి... పరీక్షలో విజయం సాధించండి

#Tags