English medium in Anganwadis: ఇకపై అంగన్‌వాడీల్లో ఇంగ్లీష్‌ మీడియం

English medium in Anganwadis

అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు స్వచ్ఛందంగా వచ్చే విధంగా జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పిల్లలకు అందించే విద్య దగ్గర నుంచి పౌష్టికాహారం వరకు అన్నింటా మార్పులు తీసుకొచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం కంటే మెరుగైన సౌకర్యాలను అంగన్‌వాడీ కేంద్రాల్లో కల్పించింది. పిల్లలకు పెట్టే భోజనంలో పూర్తిస్థాయిలో మార్పులు చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు కాన్వెంట్లకు దీటుగా విద్యను బోధిస్తోంది.

పీపీ కిట్లు పంపిణీ

అంగన్‌వాడీ కేంద్రాలకు గతంలో పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు ఆసక్తి కనబరిచేవారుకాదు. ఆంగ్ల మాధ్యమంలో పిల్లలు పట్టు సాధించే విధంగా జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో కాన్వెంట్ల తరహాలోనే ఆంగ్లం బోధిస్తున్నారు. పిల్లల బోధనకు సంబంధించి 3 నుంచి 4 సంవత్సరాల లోపు పిల్లలకు ఇంగ్లీష్‌ , మ్యాథ్స్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, యాక్టివిటీ, డ్రాయింగ్‌లకు సంబంధించిన ఐదు పుస్తకాలతో కూడిన పీపీ–1 కిట్‌, 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఐదు పుస్తకాలతో కూడిన పీపీ కిట్‌–2ను ప్రభుత్వం అందజేసింది.

వాటితో పిల్లలకు బోధిస్తున్నారు. కిట్‌లో బొమ్మలు దిద్దడానికి అవసరమైన కలర్‌ పెన్సిల్స్‌, జంతువులు గుర్తించే బొమ్మలు అందించారు. పిల్లలకు బొమ్మలు, ఆటపాటలతో చదువు చెప్పడంతో అంగన్‌ వాడీ కేంద్రాలకు రావడానికి పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు మంచి పౌష్టికాహారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోంది.

ప్రతి రోజు గుడ్లు

గత ప్రభుత్వ హాయంలో వారానికి రెండు సార్లు మాత్రమే అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు గుడ్లు ఇచ్చేవారు. కానీ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సెలవురోజు మినహా ప్రతి రోజూ పిల్లలకు గుడ్డు, పాలు అందిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే వారంతా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలే. వారిలో చాలామంది పిల్లల తల్లిదండ్రులకు పౌష్టికాహారం అందించే పరిస్థితి ఉండదు. దీన్ని గమనించిన ప్రభుత్వం పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తోంది.

రోజుకో రకమైన ఆహారం

అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం రోజుకో రకమైన భోజనాన్ని అందిస్తోంది. దీంతో పిల్లలు తినేందుకు అమితంగా ఇష్టపడుతున్నారు. సోమవారం అన్నం దోసకాయ పప్పు, ఉడికించిన కోడి గుడ్డు, 100 మి.లీ పాలు పెడతారు. మంగళవారం పులిహోర, టమాటో పప్పు ఉడికించిన కోడి గుడ్డు, 100 మి.లీ పాలు ఇస్తారు. బుధవారం అన్నం ఆకుకూర పప్పు , ఉడికించిన కోడి గుడ్డు, 100 మి.లీ పాలు ఇస్తారు. గురువారం అన్నం, ఆకుకూర, ఉడికించిన కోడిగుడ్డు, 100 మి.లీ పాలు ఇస్తారు. శుక్రవారం అన్నం సొరకాయ పప్పు, ఉడికించిన కోడి గుడ్డు, 100 మి.లీ పాలు, శనివారం వెజిటుబుల్‌ రైస్‌, ఆకుకూర, ఉడికించిన కోడి గుడ్డు, 100 మి.లీ పాలు అందిస్తారు.

జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలో 2499 అంగన్‌ వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 8,588 మంది గర్భిణులు ఉన్నారు. అదేవిధంగా బాలింతలు 9692 మంది, 6 నెలల నుంచి ఏడాది వయస్సు లోపు పిల్లలు 10, 351 మంది ఉన్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 34, 270 మంది ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు 25,150 మంది ఉన్నారు.

ఇష్టంగా తింటున్న పిల్లలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు భోజనం, గుడ్డు, పాలు వంటి పోషకాలతో రుచికరమైన భోజనాన్ని అందించడంతో ఇష్టంగా తింటున్నారు. కేంద్రాలకు నిర్దేఽశించిన మెనూ ప్రతిరోజూ అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌లో ప్రతి రోజూ పిల్లలకు పెట్టే భోజనం వివరాలు ఫొటో తీసి అంగన్‌వాడీలు అప్‌లోడ్‌ చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

గర్భిణులు, బాలింతలకు టేక్‌ హోం రేషన్‌

గర్భిణులు, బాలింతలకు మంచి పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వారి ఇంటికే వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ (పౌష్టికాహారం కిట్‌)ను ప్రభుత్వం అందిస్తోంది. గర్భిణులకు నెలకు సరిపడా గుడ్లు, పాలు, బెల్లం, ఖర్జూరం, వేరుశనగ చెక్కీలు, రాగి పిండితో కూడిన కిట్లు అందిస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. కాన్వెంట్‌ తరహాలో ఆంగ్ల బోధన, రుచికరమైన భోజనం కేంద్రాల్లో పెడుతున్నాం. గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహారం, రక్తహీనతను నివారించేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్లు అందిస్తోంది.

#Tags