Midday Meal Scheme : అస్తవ్యస్తంగా మారిన మధ్యాహ్న భోజన పథకం..!
గుంటూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువులు అర్ధాకలితో సాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న గోరుముద్ద పేరుతో ఆకర్షణీయమైన మెనూతో రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించగా.. నేడు ఆ పథకం అస్తవ్యస్తంగా మారింది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ఇవ్వడం లేదు. గుంటూరులో ఉన్న 14 ఉన్నత పాఠశాలలతో పాటు 80 ప్రాథమిక పాఠశాలల్లో 15 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రూపకల్పన చేసిన మెనూ యథావిధిగా అమలయ్యేది. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పథకం అమలులో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేశారు. దీంతో విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం తృప్తిగా ఆరగించేవారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్కూళ్లు తెరిచినప్పటి నుంచి మధ్యాహ్న భోజనం అధ్వానంగా మారింది.
విద్యార్థులకు వారంలో ఐదు రోజులు కోడి గుడ్డు ఇవ్వాల్సి ఉండగా.. దీనిని పూర్తిగా విస్మరించారు. ఎక్కడా మెనూ పాటిస్తున్న దాఖలాలు లేవు. పౌష్టికాహారం సంగతి దేవుడెరుగు.. చాలీచాలని, రుచి లేని భోజనం చేయలేక చాలా మంది విద్యార్థులు ఇళ్ల నుంచే క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ మాట్లాడుతూ.. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానని చెప్పారు.
1180 AEE Jobs: ఏఈఈ (సివిల్) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా ప్రకటించండి