Students Commit Suicide After Marks:మార్కుల పరుగుల వేటతో మానసిక ఆందోళన ...విద్యార్థుల కు ఒత్తిడే శత్రువై.. ఈ ఆత్మహత్య లు..

Students Commit Suicide After Marks:మార్కుల పరుగుల వేటతో మానసిక ఆందోళన ...విద్యార్థుల కు ఒత్తిడే శత్రువై.. ఈ ఆత్మహత్య లు..

హైదరాబాద్‌: మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య.. అమ్మ తిట్టిందని.. సూసైడ్‌.. సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని.. టీచర్‌ మందలించారని బలవన్మరణం.. ఇలా ప్రతిదానికీ చనిపోవడమే శరణ్యమని భావిస్తున్నారు ప్రస్తుత విద్యార్థులు. ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చాయని, ఎంత చదివినా గుర్తుండట్లేదని.. ఇలా పలు కారణాలతో సూసైడ్‌ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నగరంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఒత్తిడిని భరించలేక..   
సాధారణంగా పలు కాలేజీల్లోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ఒంటరితనంతో బాధపడుతుండటం.. వేరే వారితో వెంటనే కలవలేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇక, హాస్టళ్లలో ఉండే వారికి ఎప్పుడూ చదువు గురించే చెబుతుండటం.. విశ్రాంతి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్, క్లాసులు, హోంవర్కు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని, ఉదయమే నిద్రలేచి మళ్లీ క్లాసులు ఇలా తీవ్ర ఒత్తిడి తెస్తుంటారని, అందుకే విద్యార్థుల్లో తెలియని నైరాశ్యం ఏర్పడుతోందని అంటున్నారు. రోజంతా వేరే వాళ్లు చెప్పింది వినడమే తప్ప తమ సొంత ఆలోచనలు కూడా చేయలేని పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోతుంటారు.

ఇదీ చదవండి: ప‌రీక్ష‌ల్లో ఫెయిలైతే..Take it Easy.. | భ‌విష్య‌త్‌కు దారులెన్నో.. 

మార్కుల గోల.. పోల్చడం సబబేనా? 
కాలేజీల్లో పెట్టే పరీక్షల వేళ.. మార్కుల విషయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అంతేకాకుండా వేరే వారితో పోల్చడంతో మరింత నిరాశకు లోనై.. తనకు చదువు రాదని, ఎంత చదివినా గుర్తుండదని ఆత్మ న్యూనతా భావంతో బాధపడుతుంటారు. ఆ సమయంలో ఒకవేళ మార్కులు తక్కువ వచ్చాయని ట్యూటర్‌ కానీ టీచర్‌ కానీ మందలిస్తే దారుణమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉండది. 

ఇతరులతో పోల్చడం సరికాదు..  
తల్లిదండ్రులు, టీచర్లు, మెంటార్లు, బంధువులు కూడా మార్కులు ముఖ్యమని చెబుతుండటం.. అందుకోసం తీవ్రంగా కష్టపడ్డా కూడా మార్కులు రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అయితే మానసిక స్థైర్యం, మైండ్‌సెట్‌ అనేది మార్కుల కన్నా ముఖ్యమని ఎవరూ చెప్పరు. పాజిటివిటీ నింపాల్సిన వారు కూడా ఎప్పుడూ తెలియకుండానే ఒత్తిడి తీసుకొచ్చేలా మాట్లాడటం అస్సలు చేయకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. వేరే వారితో పోల్చడం, తక్కువ చేసి మాట్లాడటం, బ్లేమ్‌ చేస్తుండటం వల్ల వారిలోని శక్తిసామర్థ్యాలు మరింత తగ్గుతాయి. ప్రేమతో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయకుండా, కరుకుగా మాట్లాడుతుండటం వల్ల ఆత్మన్యూనత పెరుగుతుంది. గది వాతావరణం గుంపులు గుంపులుగా.. ఎప్పుడూ చదువుకుంటూ ఒకే గదిలో వెలుతురు లేని ప్రాంతాల్లో ఒకే దగ్గర ఉండటంతో మానసికంగా ఇబ్బంది. స్ట్రెస్‌ వచ్చేలా వాతావరణం.. ప్రశాంతత ఉండకపోవడంతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. 

ఇదీ చదవండి: పరీక్షల్లో ఫెయిల్ ఏమి.. భ‌విష్య‌త్‌కు మార్గాలెన్నో ఉన్నాయ్‌గా..

మెడిటేషన్‌తో ప్రశాంతత 
ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఉండేలా చూడాలి. ఉదయమే యోగా లేదంటే మెడిటేషన్‌ చేస్తుండాలి. కనీస శారీరక వ్యాయమం చేసినా కూడా శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇక, సరైన ఆహారం తీసుకోకపోవడంతోనూ మానసిక దృఢత్వంతో ఉండరు.  

ప్రశాంత వాతావరణం కల్పించాలి 
విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడాలి. చదువు మాత్రమే కాకుండా వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించాలి. వారానికోసారి మానసిక ఎదుగుదలకు సంబంధించి.. ఆత్మన్యూనతను తగ్గించేందుకు క్లాసులు పెట్టాలి. సృజనాత్మకత పెంపొందించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి సారించేలా.. వాటిని సాధించే దిశగా కృషి చేసేలా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. 

– డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ దేవరకొండ, సైకాలజిస్టు, న్యూరో మైండ్‌సెట్‌ కోచ్‌  

 

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Follow our YouTube Channel (Click Here)

#Tags