యూఎస్‌లో యూజీ.. ఈ కోర్సులకు అధిక ప్రాధాన్యం
- యూఎస్‌లో యూజీపై విద్యార్థుల ఆసక్తి
- ఎస్‌ఏటీ, ఏసీటీ స్కోరుతో ప్రవేశాలు
- మ్యాథ్స్, సైన్స్ కోర్సులకు అధిక ప్రాధాన్యం
- సెప్టెంబర్ టెస్ట్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సుల్లో చేరాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు ‘స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్(శాట్) లేదా అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (యాక్ట్)’ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఆయా దేశాల్లోని కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
రెండు పరీక్షలూ ఒకేలా
- ‘స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్’(శాట్).. అమెరికా,కెనడా, ఆస్ట్రేలియాల్లో.. అంతర్జాతీయ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన పరీక్ష. ఈ మూడు దేశాల్లో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని దాదాపు 85కు పైగా దేశాలు శాట్ స్కోరును ప్రామాణికంగా తీసుకొని ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇది ఆన్‌లైన్ విధానంలో జరిగే పరీక్ష.
- అమెరికన్ కాలేజ్ టెస్టింగ్(ఏసీటీ) అనేది యూఎస్, కెనడా తదితర దేశాల్లోని యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో అంతర్జాతీయ విద్యార్థులకు ప్రవేశాలకు ఉద్దేశించిన పరీక్ష. ఈ టెస్ట్ ఆన్‌లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తారు.
- శాట్, యాక్ట్.. ఈ రెండింటి స్కోర్లను ఆయా దేశాల్లోని కాలేజీల్లో అడ్మిషన్లకు, మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ అందించేందుకు ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ రెండు టెస్టులు ఒకేరమైన టాపిక్స్‌పై ఉంటాయి. అయితే ఈ రెండు ఎంట్రెన్స్ టెస్టుల నిర్వహణ వేర్వేరు సమయాల్లో జరుగుతుంది. దీనివల్ల ఒక పరీక్ష రాయలేని విద్యార్థులు.. మరో పరీక్షకు హాజరై తమ విదేశీ విద్య కలను నిజం చేసుకోవచ్చు.
శాట్–యాక్ట్ అర్హతలు
- విదేశాల్లో యూజీలో చేరాలంటే.. విద్యార్థి ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. దీంతోపాటు వయసు 17ఏళ్ల నుంచి 19ఏళ్ల మధ్య ఉండాలి.
- ‘శాట్’ స్కోరును ప్రపంచంలో దాదాపు 85కు పైగా దేశాల్లోని యూనివర్సిటీలు, కాలేజీలు అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, ఇండియా, న్యూజిలాండ్, నెదర్‌లాండ్‌తోపాటు మరెన్నో దేశాలు ఈ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
- శాట్ స్కోరుతో యూజీ కోర్సుల్లో ప్రవేశం మాత్రమే కాకుండా.. ఆయా దేశాల్లో చదువుతున్నప్పుడు స్కాలర్‌షిప్పులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏసీటీ ఎంట్రన్స్‌ను కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు రాయవచ్చు. దీనికి ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. పరీక్ష నిర్వహణ బోర్డు 2021లో టెస్ట్ రాసే అభ్యర్థుల కనిష్ట వయసు 13ఏళ్లు ఉండాలని పేర్కొంది. దీనిబట్టి ఆరు నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా పరీక్షకు హాజరుకావచ్చు. ఏసీటీ స్కోరును అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాల్లోని దాదాపు 200 యూనివర్సిటీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.
‘శాట్’ జనరల్
- శాట్ పరీక్ష.. ‘శాట్ జనరల్, శాట్ సబ్జెక్ట్’ అని రెండు విధాలుగా ఉంటుంది. శాట్ జనరల్ టెస్ట్‌లో మొత్తం 154 ప్రశ్నలు ఇంగ్లిష్‌లో ఉంటాయి. స్కోరు పర్సంటైల్ 400 నుంచి 1600 వరకు ఉంటుంది. పరీక్షలో విద్యార్థి రీడింగ్, రైటింగ్, మ్యాథమెటిక్స్ స్కిల్స్‌ను అంచనా వేస్తారు. హిస్టరీ, లిటరేచర్, సైన్స్, ఫారిన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులపై శాట్ నిర్వహిస్తారు. శాట్‌లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. హైస్కూల్ స్థాయి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- శాట్ సబ్జెక్ట్ టెస్ట్‌లో దాదాపు 20కి పైగా సబ్జెక్టుల జాబితా ఉంది. వీటిని ఇంగ్లిష్, హిస్టరీ, సైన్స్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్.. ఐదు విభాగాలుగా చేశారు. ప్రపంచంలో అత్యధిక మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్ సబ్జెక్టును ఎంచుకుంటున్నారు. దీని తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్, మాలిక్యులర్ బయాలజీ, ఎకలాజికల్ బయాలజీ, లిటరేచర్ ఉన్నాయి. సబ్జెక్టును బట్టి కొన్నింటికి 60 ప్రశ్నలు ఉంటే.. మరికొన్నింటికి 95 ప్రశ్నల వరకు ఉంటాయి.
యాక్ట్ పరీక్ష విధానం
ఏసీటీ(యాక్ట్) ఎంట్రన్స్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. టెస్ట్‌లోని నాలుగు సెక్షన్లలో మొత్తం 215 ప్రశ్నలకు 175 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. పర్సంటైల్ స్కోరు స్కేల్ 1–36 ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్, మ్యాథ్స్, రీడింగ్, సైన్స్ అనే నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు 30 నుంచి 40 నిమిషాల వ్యవధి గల ‘రైటింగ్ సెక్షన్’ (ఆప్షనల్) కూడా ఉంటుంది. ఈ స్కోరును అభ్యర్థుల కాంపోజిట్ స్కోరులో కలపరు.
సిలబస్ వారీగా పరిశీలిస్తే
- ఇంగ్లిష్ (45 నిమిషాలు): ఇందులో యూసేజ్, పంక్చుయేషన్స్, గ్రామర్–యూసేజ్, సెంటెన్స్ స్ట్రక్చర్, రెటోరికల్ స్కిల్స్, స్ట్రాటజీ, ఆర్గనైజేషన్, స్టయిల్ విభాగాల నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి.
- మ్యాథ్స్ (60 నిమిషాలు): ఇందులో ప్రీ ఆల్జీబ్రా, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, ఇంటర్మీడియట్ ఆల్జీబ్రా, కో ఆర్డినేట్ జామెట్రీ, ప్లేన్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీల నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి.
- రీడింగ్ (35 నిమిషాలు): ఇందులో నాలుగు భాగాలు.. సోషల్ స్టడీస్, నేచురల్ సైన్స్, ఫిక్షన్, హ్యుమానిటీస్ అంశాలపై నాలుగు ప్యాసేజెస్ ఇస్తారు. వీటిని చదివి 40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
- సైన్స్(35 నిమిషాలు): ఈ భాగంలో డేటా రిప్రజెంటేషన్(గ్రాఫ్స్ అండ్ టేబుల్స్), రీసెర్చ్ సమ్మరీస్, కన్‌ఫ్లిక్టింగ్ వ్యూ పాయింట్స్ నుంచి 40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
- రైటింగ్ టెస్ట్: ఇది 40 నిమిషాల వ్యవధి గల ఐచ్చిక విభాగం. అంటే అభ్యర్థి ఇష్టం ఉంటే రాయవచ్చు. ఇందులో సాధించిన మార్కులను మొత్తం స్కోరుతో కలపరు.
కనీసం రెండుసార్లు
స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్(శాట్) ఏడాదిలో ఐదుసార్లు.. మార్చి, మే, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్‌లో నిర్వహిస్తారు. విద్యార్థి ఇంటర్మీడియెట్ ఫైనల్‌లో ఉండగా.. కనీసం రెండుసార్లు పరీక్ష రాయడం మంచిది. దానివల్ల స్కోరు పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది స్కాలర్‌షిప్ పొందేందుకు ఉపయోగపడుతుంది.
దరఖాస్తు ఫీజు
- శాట్ దరఖాస్తు ఫీజు మన దేశంలో జనరల్ ఎగ్జామ్‌కు 104 డాలర్లు, ఎస్సే రైటింగ్‌తో కలిపి 117 డాలర్లు, శాట్ జనరల్‌తోపాటు సబ్జెక్టుకు అదనంగా 26 డాలర్లు చెల్లించాలి. అదనంగా సబ్జెక్టు టెస్టు రాయాలంటే(లాంగ్వేజెస్ కాకుండా).. ఒక్కో సబ్జెక్టుకు 22 డాలర్లు, లాంగ్వేజ్ టెస్ట్ విత్ లిజనింగ్ కోసం 26 డాలర్లు చెల్లించాలి.
- యాక్ట్‌ను ప్రతిఏటా సెప్టెంబర్‌లో ప్రారంభించి.. జూలై వరకు ఏడుసార్లు నిర్వహిస్తారు. అంటే.. సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, జూలై నెలలో ఈ టెస్ట్ ఉంటుంది. దీనికి అమెరికాయేతర అభ్యర్థులు రైటింగ్ విభాగం లేకుండా 60 డాలర్లు, రైటింగ్ విభాగంతో కలిపి 85 డాలర్లు ఫీజుగా చెల్లించాలి.
పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్స్: https://collegereadiness.collegeboard.org/sat/register
https://www.collegeboard.org https://www.act.org/