Skip to main content

జగనన్న విద్యా దీవెన పథకం – ప్రాధాన్యతలు

చదువుతోనే జీవితాల రూపురేఖలు మారతాయని, పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదివాలన్న సమున్నత లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకమే ‘జగనన్న విద్యా దీవెన’. ఈ పథకాన్ని సీఎం ఏప్రిల్‌ 19, 2021న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది.
Jagananna Vidya Deevena Scheme
Jagananna Vidya Deevena Scheme

ఏమిటీ జగనన్న విద్యాదీవెన పథకం ప్రాధాన్యత..
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలు) సకాలంలో, ఏ బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నాలుగు విడతల్లో కాలేజీలకు కాకుండా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. అడ్మీషన్‌ తీసుకొని పై తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. అంతేకాకుండా ఫీజుల డబ్బుల కోసం ప్రవేశాల సమయంలో విద్యార్థులను ఒత్తిడి చేయవద్దని, కళాశాలల్లో తల్లిదండ్రులు పరిశీలించిన సౌకర్యాలను విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు యథాతథంగా కొనసాగించాలని యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. ఏ కాలేజీలో స్పెషల్‌ ఫీజుల పేరుతో కానీ మరే పేరుతో కానీ అదనంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం కచ్చితంగా విద్యార్థుల చదువులకు అవసరమయ్యే పూర్తి ఫీజు చెల్లిస్తుంది.
 
అర్హతలు:

  • తల్లిదండ్రులు, వారి పిల్లలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన స్థానికులై ఉండాలి.
  • విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేసి, తదుపరి విద్యకోసం కాలేజీ లేదా యూనివర్సిటీ లేదా ఏదైనా ఇన్స్‌స్టిట్యూట్‌లో రెగ్యులర్‌ కోర్సుల్లో తప్పనిసరిగా అడ్మిషన్‌ తీసుకుని ఉండాలి.
  • కుటుంబం వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలలోపు ఉండాలి.
  • 10 ఎకరాల సాగు భూమి, 25 ఎకరాల మెట్ట భూమి కలిగిన వ్యవసాయ కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా అర్హులే.
  • దరఖాస్తుదారుల కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఉన్న యడల అతడు లేదా ఆమె ఈ పథకానికి అనర్హులు.
  • పారిశుధ్య కార్మికుల పిల్లలు మరియు ట్యాక్సి, ఆటో, ట్రాక్టర్‌లపై ఆధారపడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
  • కుటుంబంలో ఉన్న అర్హులైన పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. తద్వారా ప్రతిఒక్కరికీ ఉన్నత విద్య చదివే అవకాశం దక్కుతుంది.

కాలేజీలకు విద్యార్థుల తల్లిదండ్రులు..
నాలుగు త్రైమాసికాలలో (ఏప్రిల్, జూలై, డిసెంబర్, ఫిబ్రవరి) ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులను విద్యార్థి తల్లి కళాశాలలకు చెల్లించాలి. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? లేదా? విద్యార్థి ఎలా చదువుతున్నాడో.. అనే విషయాలను పరిశీలించేందుకు తల్లిదండ్రులు తరచూ కాలేజీలను సందర్శించాలి. ప్రభుత్వం విద్యార్థి తల్లి ఖాతాకు ఫీజుల డబ్బులు విడుదల చేసిన వారం రోజుల్లో ఆయా కాలేజీల్లో చెల్లించాలి. అలా కాలేజీలో చెల్లించకుంటే ప్రభుత్వం బాధ్యత వహించదు. ఆ విధంగా చెల్లించకుంటే తదుపరి దఫా విద్యార్థికి జగనన్న విద్యా దీవెన పథకం కింద డబ్బులు నిలిపివేస్తారు. 

తల్లుల ఖాతాల్లోనే ఎందుకంటే..

  •  పిల్లలు చదువుతున్న కాలేజీలకు తల్లిదండ్రులు స్వయంగా వెళ్లి ఫీజులు కట్టడం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఆ కాలేజీల్లో సమస్యలు, వాటిలో ఉన్న పరిస్థితులు, సదుపాయాలు, అక్కడ తమ పిల్లల బాగోగులు గురించి తెలుసుకుని వసతుల లోపంతో పాటు సమస్యలేమైనా ఉంటే కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు.
  •  కాలేజీల్లోని సమస్యలను 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ కాలేజీల్లో పరిస్థితులను చక్కదిద్ది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది.
  • కాలేజీల్లో జవాబుదారీతనం, కాలేజీల్లో స్థితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది.

సౌకర్యాలు లేకుంటే ఫిర్యాదు చేయవచ్చు..
కాలేజీలో సౌకర్యాలు సరిగా లేవని భావిస్తే జ్ఞానభూమి పోర్టల్‌లో విద్యార్థి లాగిన్‌ ద్వారా తల్లులు ఫిర్యాదు చేయవచ్చు. లేదా స్పందన పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 1902కి కాల్‌ చేసి తెలియచేయవచ్చు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. 

విద్యకు ఎందుకింత ప్రాధాన్యత..
చదవాలనే తపన ఉన్నప్పటికీ పేదరికం ఒక పెద్ద గుదిబండలా పరిణమించడంతో, మధ్యలోనే చదువు నిలిచిపోయి, చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు తలకెత్తుకున్న ఎందరో జీవితాలలోని అమూల్యమైన బాల్యం కునీరుపోతుంది. వారికి విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.... ఈ పరిస్థితులను మార్చేందుకు, పేదరికం నుంచి బయటపడేందుకు, మెరుగైన ఆలోచనలకు, మంచి ఉద్యోగానికి, ఉపాధికి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, సమాజంలో గౌరవం పొందటానికి, ఒక మనిషి తన తరవాత తరాల భవిష్యత్తుకు మెరుగైన బాటలు వేయటానికి పెద్ద చదువన్నది ప్రస్తుత కాలంలో ఒక కనీస అవసరంగా మారిపోయింది. 15 సంవత్సరాలకు టెన్త్, 17 ఏళ్లకు ఇంటర్, 20–21 ఏళ్ల మధ్య డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి తనకు 60 – 70 ఏళ్లు వచ్చే నాటికి ఆ చదువు పునాది మీదే తన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని ఒక్కసారి బేరీజు వేసుకోగలిగితే.. ఏ అప్పులూ లేకుండా మంచి చదువులు చదివితే, వారి జీవితాలు ఎలా మారతాయన్నది ఊహించగలిగితే చదువు విలువ ఏమిటన్నది అర్ధమవుతుంది. అందుకే ఏపీ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది. విద్యార్థుల హాస్టల్‌ వసతి, భోజన ఖర్చుల కోసం వసతి దీవెన పథకం కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకాలతో విద్యార్థుల చదువుకు అడుగడుగునా ప్రభుత్వం తోడుగా నిలుస్తోంది. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది.
 

Published date : 17 Aug 2021 05:12PM

Photo Stories