Skip to main content

Indian Polity Notes for Group 1&2: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించిన కమిషన్‌ ఏది?

Indian Polity Notes for Group 1&2

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కె. చంద్రశేఖర్‌రావు నవంబర్‌ 29, 2009న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్‌ 9, 2009న కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం ప్రకటించారు. అక్టోబర్‌ 3, 2013న కేంద్ర కేబినెట్‌ రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు 2013ను రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి పంపారు. శాసనసభ 45 రోజుల్లోగా తన అభిప్రాయాన్ని తెలపాలని రాష్ట్ర్టపతి ఆదేశించారు. పునర్‌వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ జనవరి 27, 2014న రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది. ఫిబ్రవరి 18, 2014న నాటి హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అదే రోజున లోక్‌సభ మూజువాణి పద్ధతిలో బిల్లును ఆమోదించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ బిల్లుకు ఆమోదం తెలిపింది. మార్చి 1న ఈ బిల్లుకు రాష్ట్ర్టపతి ఆమోద ముద్ర వేశారు. జూన్‌ 2,2014ను విభజన తేదీగా కేంద్ర ప్రభుత్వం  అధికారికంగా ప్రకటించింది. ఆ రోజున 29వ రాష్ట్ర్టంగా తెలంగాణ అవతరించింది.

రాష్ట్రాల ఏర్పాటు
రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ఫజల్‌ అలీ కమిషన్‌

భాషాప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. దీంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ భాషా ప్రాతిపదికపై రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ బలంగా ప్రస్తావనకు వచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌ను నియమించింది. కె.ఎం.ఫణిక్కర్, హెచ్‌.ఎం.కుంజ్రు సభ్యులుగా ఉన్న ఈ కమిషన్‌కు ఫజల్‌ అలీ నేతృత్వం వహించారు. 1955 సెప్టెంబర్‌లో ఈ కమిషన్‌ నివేదిక సమర్పించింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును ఫజల్‌ అలీ కమిషన్‌ సమర్థించింది. కానీ ఒక భాష-ఒక రాష్ట్రం అనే డిమాండ్‌ను తిరస్కరించింది.

చ‌ద‌వండిIndian Territory-Union of India: భారత భూభాగం-భారత యూనియన్‌.. రాష్ట్రాల ఏర్పాటు-పునర్‌ వ్యవస్థీకరణ 

ఫజల్‌ అలీ కమిషన్‌ ప్రతిపాదనలు.. 

  • రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణలో దేశ ఐక్యతను, రక్షణను బలోపేతం చేసేలా చర్యలు ఉండాలి.
  • భాష, సాంస్కృతికపరమైన సజాతీయత ఉండాలి.
  • ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • జాతీయాభివృద్ధితోపాటు రాష్ట్రాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

దీనికి అనుగుణంగా 1956లో పార్లమెంట్‌ రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం, ఏడో రాజ్యాంగ సవరణ చేసింది. ఈ సవరణ ద్వారా పార్ట్‌-ఎ, పార్ట్‌-బి, పార్ట్‌-సి అనే వ్యత్యాసాలను రద్దు చేసి రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించింది. ఫలితంగా 14 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలతో నూతన వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ-పెద్ద మనుషుల ఒప్పందం

రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణతో కలిపి 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది.

1948లో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర సంస్థను స్థాపించారు. తెలుగు మాట్లాడే వారందరినీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేది విశాలాంధ్ర ప్రధాన నినాదం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు విషయంలో నిర్ణయాన్ని హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి వదిలిపెట్టారు. హైదరాబాద్‌ రాష్ట్ర అసెంబ్లీలో విశాలాంధ్ర ఏర్పాటు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, 103 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. 1956 ఫిబ్రవరి 20న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన 8 మంది నాయకుల మధ్య ఢిల్లీలో ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే 'పెద్ద మనుషుల ఒప్పందం' అంటారు.∙ఈ ఒప్పందంపై బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, జె.వి.నరసింగరావు, మర్రి చెన్నారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ, నీలం సంజీవరెడ్డి, సర్దార్‌ గౌతు లచ్చన్న సంతకాలు చేశారు.

చ‌ద‌వండిIndian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు 

1956 తర్వాత ఏర్పాటైన రాష్ట్రాలు

గుజరాత్‌ (1 మే, 1960): బొంబాయి రాష్ట్రాన్ని విడగొట్టి గుజరాత్‌ను 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. బొంబాయి రాష్ట్రం పేరును మహారాష్ట్రగా మార్చారు.
నాగాలాండ్‌ (1 డిసెంబర్, 1963): అస్సాం రాష్ట్రాన్ని పునర్‌ వ్యవస్థీకరించి నాగా కొండ ప్రాంతాలు, ట్యూన్‌సాంగ్‌ ప్రాంతాలతో నాగాలాండ్‌ను ఏర్పాటు చేశారు. ఇది 16వ రాష్ట్రంగా ఏర్పాటైంది.
హర్యానా(1 నవంబర్, 1966): పంజాబ్‌ను పునర్‌వ్యవస్థీకరించి హిందీ మాట్లాడే ప్రాంతాన్ని హర్యానా రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. షా కమిషన్‌ సూచన మేరకు చండీగఢ్‌ను పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చేశారు. దీంతోపాటు చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించారు. 
హిమాచల్‌ ప్రదేశ్‌ (25 జనవరి, 1971): పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలతో కలిపి కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్‌కు రాష్ట్ర హోదా కల్పించారు. ఇది 18వ రాష్ట్రం.
మణిపూర్‌(21 జనవరి, 1972): ఈశాన్య రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం ద్వారా మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన మణిపూర్‌ను 19వ రాష్ట్రంగా మార్చారు.
త్రిపుర (21 జనవరి, 1972): కేంద్రపాలిత ప్రాంతమైన త్రిపురను 20వ రాష్ట్రంగా మార్చారు. 
మేఘాలయ (21 జనవరి, 1972): అస్సాంలో ఉపరాష్ట్రంగా ఉన్న మేఘాలయను పూర్తి రాష్ట్రంగా మార్చారు. 1969లో మేఘాలయకు ఉపరాష్ట్ర హోదా కల్పించారు.
సిక్కిం(16 మే, 1975): 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు. సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 1947 వరకు సిక్కిం ఛోగ్యాల్‌ రాజవంశ పాలనలో ఉండేది. 1974లో 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు అసోసియేట్‌ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు. 10వ షెడ్యూల్‌లో నూతన ప్రకరణ 2ఎను చేర్చారు. 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను సంపూర్ణ రాష్ట్రంగా గుర్తించారు. ఈ విధంగా సిక్కిం 22వ రాష్ట్రంగా ఏర్పాటైంది. 1974లో చేసిన 35వ రాజ్యాంగ సవరణను రద్దుచేశారు. ప్రకరణ 2ఎను, 10వ షెడ్యూల్‌లోని ప్రత్యేకతను తొలగించారు. ప్రకరణ 371ఎఫ్‌ ద్వారా సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక రక్షణ కల్పించారు.
మిజోరాం (20 ఫిబ్రవరి, 1987): కేంద్రపాలిత ప్రాంతమైన మిజోరాంకు 53వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర హోదా కల్పించారు. ఇది 23వ రాష్ట్రంగా ఏర్పాటైంది.
అరుణాచల్‌ ప్రదేశ్‌ (20 ఫిబ్రవరి, 1987): 55వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్‌ ప్రదేశ్‌కు సంపూర్ణ రాష్ట్ర హోదాను కల్పించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజెన్సీ (ఎన్‌ఈఎఫ్‌ఏ) అని పిలిచేవారు.
గోవా (30 మే, 1987): 56వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన గోవాకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు. 1961లో పోర్చుగీసువారు గోవాను భారతదేశానికి అప్పగించారు. గోవా, డయ్యూ, డామన్‌లను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఇందు కోసం 1962లో 12వ రాజ్యాంగ సవరణ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌ (1 నవంబర్, 2000): మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి ఛత్తీస్‌గఢ్‌ను 26వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
ఉత్తరాఖండ్‌ (9 నవంబర్, 2000): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ఉత్తరాఖండ్‌ 27వ రాష్ట్రంగా ఏర్పాటైంది.
జార్ఖండ్‌ (15 నవంబర్, 2000): బిహార్‌ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి 28వ రాష్ట్రంగా జార్ఖండ్‌ను ఏర్పాటు చేశారు. 
తెలంగాణ (2 జూన్, 2014): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
వివరణ: 1954లో ఫ్రెంచివారు పాండిచ్చేరిని భారత్‌కు అప్పగించారు. 1962లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిలో 4 జిల్లాల(పాండిచ్చేరి, కరైకల్, మహే, యానాం)ను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.

చ‌ద‌వండిIndian Polity Terminology: భారత రాజ్యాంగ పీఠికలోని పదజాలం!

కేంద్రపాలిత ప్రాంతాలు- ఏర్పాట్లు

 దాద్రానగర్‌ హవేలి: 1954 వరకు ఈ ప్రాంతం పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేది. 1961లో పదో రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 
డామన్‌- డయ్యూ: భారత ప్రభుత్వం 1961లో సైనిక చర్య ద్వారా ఈ ప్రాంతాలను పోర్చుగీసు వారి నుంచి స్వాధీనం చేసుకుంది. 12వ రాజ్యాంగ సవరణ ద్వారా 1962లో కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1987లో గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా కొనసాగించారు.
పాండిచ్చేరి: ఇది పుదుచ్చేరి, కరైకల్, మహే, యానాం అనే నాలుగు ప్రాంతాల కలయిక. 1964 లో ఫ్రెంచివారు ఈ ప్రాంతాలను భారత్‌కు అప్పగించారు. 1962లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలకు కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించారు.
చంఢీగఢ్‌: 1966లో పంజాబ్‌ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా హర్యానా, పంజాబ్‌లకు ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌కు కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు - పాత పేర్లు - నూతన పేర్లు

సం. పాత పేరు కొత్తపేరు
1950 యునైటెడ్‌ ప్రావిన్స్‌ ఉత్తరప్రదేశ్‌
1956 ట్రావెన్‌కోర్‌ కొచ్చిన్‌ కేరళ
1959 మధ్యభారత్‌ మధ్యప్రదేశ్‌
1960 బొంబాయి మహారాష్ట్ర
1968 మద్రాసు తమిళనాడు
1973 మైసూరు కర్ణాటక
1973 లక్కదీవి, మినికాయ్‌ అమిన్‌దీవి లక్షదీవులు
2006 ఉత్తరాంచల్‌ ఉత్తరాఖండ్‌
2006 పాండిచ్చేరి పుదుచ్చేరి
2007 అస్సాం అసోం
2011 ఒరిస్సా ఒడిశా
2011 పశ్చిమ బెంగాల్‌ పశ్చిమ బంగ

రాష్ట్రాలు - ప్రత్యేక హోదా

 ప్రత్యేక హోదా-చరిత్ర: అయిదో ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని 1969లో ప్రవేశపెట్టారు. మొదట్లో అస్సాం, నాగాలాండ్, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఉండేది. తర్వాత అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు కూడా వర్తింపజేశారు.
ప్రాతిపదిక: ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి...

  • పర్వత ప్రాంతాలు, రవాణాకు కష్టతరమైనవి
  • తక్కువ జనసాంద్రత, అధిక గిరిజనులు ఉన్న ప్రాంతాలు
  • సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు
  • ఆర్థికంగా పటిష్టంగా లేని రాష్ట్రాలు
  • విదేశాలతో సరిహద్దులు ఉండి, వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న రాష్ట్రాలు.

ప్రత్యేక హోదాను నిర్ణయించేది: ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్న జాతీయాభివృద్ధి మండలి, ప్రణాళికా సంఘం(ప్రస్తుతం నీతి ఆయోగ్‌) సలహా మేరకు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యేక హోదాకు నిధుల కేటాయింపులతో సంబంధం ఉండటం వల్ల కేంద్ర ఆర్థిక సంఘాన్ని కూడా సంప్రదించాలి.

చ‌ద‌వండిConstitution of India Notes for Competitive Exams: రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?

ప్రయోజనాలు

  • కేంద్ర ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ల రూపంలో అందిస్తుంది.
  • కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో 30 శాతం నిధులను తొలుత ఈ రాష్ట్రాలకు కేటాయిస్తారు. మిగతా వాటాను ఇతర రాష్ట్రాలకు ఇస్తారు. 
  • కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులను గ్రాంట్ల రూపంలో,1 శాతం నిధులను రుణంగా ఇస్తారు.
  • పన్నుల్లో మినహాయింపు ఉంటుంది.
  • రుణాలు చెల్లింపును వాయిదా వేయడం, పరిశ్రమలను ఏర్పాటు చేసే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తారు.

గాడ్గిల్‌ - ముఖర్జీ ఫార్ములా

ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు గాడ్గిల్‌ - ముఖర్జీ ఫార్ములా ప్రకారం నిధులను కేటాయిస్తారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డి.ఆర్‌. గాడ్గిల్‌ 1969లో ఈ ప్రతిపాదన చేశారు. 1990లో ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ మరికొన్ని మార్పులు సూచించారు. అందుకే దీన్ని గాడ్గిల్‌-ముఖర్జీ ఫార్ములా అంటారు. దీనికి అనుగుణంగా జాతీయాభివృద్ధి మండలి నూతన పద్ధతిని నిర్ణయించింది. దీని ప్రకారం రాష్ట్రాలకు ఈ కింది అంశాల ఆధారంగా నిధులను కేటాయిస్తారు.

ప్రాతిపదిక శాతం
జనాభా 60 శాతం
తలసరి ఆదాయం 25 శాతం
ఆర్థిక నిర్వహణ 7.5 శాతం
ప్రత్యేక సమస్యలు 7.5 శాతం
మొత్తం 100 శాతం

దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలు

అసోం    -    బోడోలాండ్, కర్బి, అంగ్లాంగ్‌
కర్ణాటక    -    కొడగు (కూర్గ్‌)
మహారాష్ట్ర    -    విదర్భ
గుజరాత్‌    -    సౌరాష్ట్ర
ఉత్తరప్రదేశ్‌    -    హరితప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్, అవధ్‌ ప్రదేశ్, పూర్వాంచల్‌
మధ్యప్రదేశ్‌    -    వింధ్యప్రదేశ్, అవధ్‌
బిహార్, జార్ఖండ్‌    -    మిథిలాంచల్,కోసల్‌
కేరళ, కర్ణాటక సరిహద్దులో     -    తుళునాడు
పశ్చిమ బెంగాల్‌    -    గూర్ఖాలాండ్‌
ఒడిశా    -    కోసల్‌
జమ్మూ కశ్మీర్‌    -    లడక్‌
మేఘాలయ    -    గారోలాండ్‌
మణిపూర్‌    -    కుకీలాండ్‌


krishna reddy-బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

Published date : 11 Oct 2022 05:47PM

Photo Stories