Skip to main content

ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తి.. క్లాసులు ఆన్‌లైనా..ఆఫ్‌లైనా!

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ మొదటి, చివరి దశ ప్రవేశాలు పూర్తి అయిన నేపథ్యంలో తమ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యాబోధనపై జేఎన్‌టీయూ కసరత్తు చేస్తోంది.
డిసెంబర్ నుంచి ఇంజనీరింగ్ ప్రత్యక్ష బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇదివరకే మార్గదర్శకాలను జారీచేసింది. అయితే కరోనా ప్రభావం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలన్న విషయమై ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ప్రథమ సంవత్సరం మినహా మిగతా సంవత్సరాల్లో ఆన్‌లైన్ బోధనకు చర్యలు చేపట్టిన జేఎన్‌టీయూ.. ఫస్టియర్ విద్యార్థులకు విద్యా బోధనను ప్రారంభించే అంశంపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ నుంచి ప్రత్యక్ష బోధన చేపట్టాలని, లేదంటే ఆన్‌లైన్ బోధనను కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతోపాటు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ బోధన విధానంపై కూడా కసరత్తు చేస్తోంది. ఇందులో ఏది వీలైతే అదే విధానాన్ని కొనసాగించనుంది.

ప్రత్యక్ష బోధన సాధ్యం కాని పరిస్థితుల్లో..
కరోనా విషయంలో ప్రభుత్వం వచ్చే నెలలో తరగతుల ప్రత్యక్ష బోధన ప్రారంభించకపోతే ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానం వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశముంది. అది కూడా వద్దనుకుంటే మాత్రం ఆన్‌లైన్‌లోనే తరగతుల బోధన ఉండనుంది. ఇక ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో విద్యార్థులను విభజించి షిఫ్ట్ పద్ధతుల్లో తరగతులు కొనసాగించడం లేదా రోజు విడిచి రోజు (ఒకరోజు ఆన్‌లైన్, ఒకరోజు ఆఫ్‌లైన్) పద్ధతుల్లో బోధనను కొనసాగించే అంశంపైనా కసరత్తు చేస్తున్నారు. గతంలో జరిగిన జేఎన్‌టీయూ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయానికి వచ్చింది. ఇంజనీరింగ్‌తోపాటు ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ తదితర కోర్సుల్లోనూ ఈ విధానాలను అవలంభించేలా ఏర్పాట్లు చేస్తోంది. వార్షిక పరీక్షలతోపాటు అకడమిక్ కేలండర్ అమలుపై ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని ఇంజనీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యాకాలేజీల్లోనూ అవే ఆదేశాలను అమలు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. దీంతో జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల్లో యూజీసీ మార్గదర్శకాల అమలుకు చర్యలు చేపట్టింది.

ప్రభుత్వ నిర్ణయం మేరకే తరగతుల నిర్వహణ..
ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో విద్యాబోధనకు సంబంధించి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకే ముందుకుసాగుతాం. ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తయ్యాయి. ఇక బీఫార్మసీ (అగ్రికల్చర్), ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. వాటిలో ప్రవేశాలను ఈ నెలాఖరుకు ప్రారంభించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే తరగతుల బోధనపై ఈ నెలాఖరులోగా ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నాం.
- మంజూర్ హుస్సేన్, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్

పరిస్థితులపై నివేదిక..
ఉన్నత విద్యలో తరగతుల ప్రారంభంపై దీపావళి తర్వాత ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తాం. ప్రస్తుత పరిస్థితులు, విద్యా బోధన అవసరాలు, కరోనా ప్రభా వం, యూజీసీ మార్గదర్శకాలు, వైద్య ఆరోగ్యశాఖ అభిప్రాయాలు తదితరాలన్నింటిపై అందులో చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప్రభుత్వం ఓకే అంటే కరోనా నిబంధనలకు అనుగుణంగా తరగతుల ప్రారంభానికి చర్యలు చేపడతాం..
- ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి
Published date : 16 Nov 2020 03:34PM

Photo Stories